శ్రీ గోపాలకృష్ణ శాస్త్రి, కనకదండి
షష్ఠ్యంతములు
చీనా కృతఘ్నులకు
సేనా శతఘ్నులకు
సర్వశుభమోచనము! మోచనము! మోచనము!
సర్వజననాశనము! నాశనము! నాశనము!
తన తాన సరికాక
తరములను సరిచేయ
తోడి నరులకు బుద్ధి
వేడి మాటలఁ జెప్పు
గడ్డితిను నెడ్డెలకు
మడ్డిగొను గొడ్డులకు
వక్రగతి చక్రులకు
నక్రమతి శుక్రులకు
శత్రుకృత మిత్రులకు
చిత్రిత చరిత్రులకు ||చీనా||
దిద్దుకొన లేక యిలు
హద్దులను మీర జని
నమ్మించి కను బ్రామి
ఇమ్ముగా దోచుకొను
దొంగలకు బుంగలకు
కొంగలకు దుంగలకు
క్రుద్ధహత బుద్ధులకు
విద్ధశత వృద్ధులకు
యుద్ధరస సిద్ధులకు
రుద్ధమతి శుద్ధులకు
ధర్మముగ దరిఁజేరి ||చీనా||
మర్మములఁ దెలిసికొని
కలిసి కలియని యటుల
కలగలసి నటియించు
హీనులకు మీనులకు
దీనులకు పీనులకు
మత్తజన వృత్తులకు
విత్తపరి వృత్తులకు
కృత్త నీవృత్తులకు
చిత్త విచ్చిత్తులకు
చీనా కృతఘ్నులకు
సేనా శతఘ్నులకు
సర్వశుభమోచనము! మోచనము! మోచనము!
సర్వజననాశనము! నాశనము! నాశనము!
* * * *
