శ్రీ చిన్నికృష్ణశర్మ, దేవరకొండ
విక్రమింపుడు భారతవీరులార!
మందలుమందలై పిఱికిమందుల చీనిశశమ్ము లిప్డు రా
త్రిందివముల్ హిమాద్రి విడిదింబలెఁ గైకొని దండయాత్రచే
యందొడఁగెం బ్రతిక్షణమునందుఁ బ్రతీక్షణ మింక జెల్లునే
ముందడుఁగై ఎదుర్కొని సమూలముగా బలిగొండువైరులన్.
అదె శాంతిప్రియుఁడైన జహ్వరు ప్రధానామాత్యుఁడే యుద్ధమి
య్యది దుర్వార మటంచుఁ జెప్పెనుగదయ్యా! జాల మింకేల? శ
త్రుదళంబున్ విదళింపఁగాఁ జనుఁడు వీరుల్ భారతీయుల్ మహో
గ్ర దవాగ్నుల్ రిపుకాననాళి కని లోకఖ్యాతి సాధింపుఁడీ!
మనది సత్యంబు మనది ధర్మమ్ముగూడ
మనది సకల ప్రపంచాభిమాన మైన
నింక విజయంబు మనదిగా కెట్లు వోవు?
విక్రమింపుఁడు భారతవీరులార!
* * * *
