వేశ్య కథలకు...కాసులు రాలతాయా??
on Apr 13, 2015
మన కథానాయికలకు ఎప్పుడైతే అవార్డులపై గాలి మళ్లుతుందో అప్పుడు వేశ్య కథలు తయారైపోతూ ఉంటాయి. జీవితంలో మోసపోయిన మగువ చీకటి బతుకులే.. ఇలాంటి కథలకు నేపథ్యాలుగా ఉంటాయి. అప్పట్లో అగ్ర కథానాయికలంతా ఇలాంటి సినిమాల్లో నటించి... అవార్డులు పట్టుకెళ్లిపోయినవాళ్లే. బాలీవుడ్‌లోనూ వేశ్య కథలకే బాగా డిమాండు. అక్కడ స్టార్ హీరోయిన్లంతా వేశ్య పాత్రల్లో రాణించినవాళ్లే. `వేశ్య` కథంటే అదో ఆర్టు సినిమా అని... కన్నీళ్లు కష్టాలూ తప్ప మరేం కనిపించవని అనుకొనేవాళ్లు అప్పుడు. అయితే దానికి వీలైనంత మసాలా మిక్స్ చేసి - కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దడం అలవాటు చేసుకొన్నారు దర్శకులు. అందుకే ఈ తరహా కథలు అప్పుడప్పుడూ ప్రేక్షకుల్ని పలకరించడం కామన్ అయిపోయింది. ఈమధ్య కూడా వేశ్య కథా చిత్రాల హవా తగిలింది. ప్రేమ ఒక మైకంతో ఛార్మి, పవిత్రగా శ్రేయ, కమలతో నా ప్రయాణం సినిమాలో అర్చన.. ఈ పాత్రల్లో మెరిసిన వాళ్లే. ఇప్పుడు ఛార్మి మరోసారి ఇలాంటి కథని ఎంచుకొంది.. అదే.. జ్యోతిలక్ష్మి.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న జ్యోతిలక్ష్మి చిత్రంపై పరిశ్రమ ఫోకస్ పెట్టింది. ఇదో సినీ నటి జీవితానికి సంబంధించిన కథ అని బయట ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఓ క్లారిటీ ఇచ్చింది. ఇది సినీ నటి కథ కాదు... ఓ వేశ్య కథ మాత్రమే అని తేల్చింది. దాంతో.. ఛార్మి మరోసారి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయబోతోందన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. అయితే వేశ్య కథలకు కాసులు రాల్చే టాలెంటు లేదన్నది బాక్సాఫీసు సెంటిమెంటు. పవిత్ర, ప్రేమ ఒక మైకం, కమలతో నా ప్రయాణం.. ఈ సినిమాలేవీ బాక్సాఫీసు దగ్గర రాణించలేదు. కనీసం ఆ సినిమాలకు పెట్టుబడి కూడా తిరిగి రాలేదు.
కళాత్మకంగా తీయాల్సిన సినిమాల్లో గ్లామరే ధ్యేయంగా సన్నివేశాలు రాసుకొంటే.. అవి ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోలేవు. ఆర్ట్ సినిమాగా తీయాలన్న ఉద్దేశంతో కథ మొదలై... మెల్లిమెల్లిగా కమర్షియల్ అంశాలు అందులో దొంగచాటుగా చోటు చేసుకొంటుంటాయి. దాంతో ఆ సినిమా రెంటికీ చెడ్డ రేవడి చందాన తయారవుతుంది. పైగా వేశ్య కథ.. వేశ్య కథ అని చాటింపు వేస్తే... కుటుంబ ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకు దూరమవుతారు. అందుకే వేశ్య కథా చిత్రాలు బాక్సాఫీసు దగ్గర మ్యాజిక్ చేయలేకపోయాయి. ఆ సెంటిమెంట్ ఇప్పుడు.... జ్యోతిలక్ష్మిని భయపెడుతోంది. అయితే... దర్శకుడు పూరి జగన్నాథ్‌పై తెలుగు ప్రేక్షకులకు నమ్మకాలెక్కువ. ఆయన ఖచ్చితంగా ఈ సెంటిమెంట్‌ని దాటుకొని వస్తారని చాలామంది ఆశలుపెట్టుకొన్నారు. ఛార్మి కూడా ఆయన్నే నమ్ముకొని రంగంలోకి దిగిపోయింది. మరి ఈ జ్యోతిలక్ష్మి ఏం చేస్తుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.