టాలీవుడ్ లో మహిళా ప్రభంజనం
on Mar 8, 2016
మహిళలకు ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటారు. ఈ సూత్రం సినీ ఇండస్ట్రీలో పెద్దగా కనిపించదు. ఎక్కువగా గ్లామర్ డాల్ గా మాత్రమే మన హీరోయిన్లను ఉపయోగించుకుంటారు తప్ప, టాలెంట్ ఉన్న వాళ్లను ప్రోత్సహించేది తక్కువనే చెప్పాలి. కానీ ఇంతటి పోటీలోనూ, కొన్ని సినిమాలు లేడీ ఓరియెంటెడ్ గా వచ్చి, అద్భుతంగా రాణించాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం రండి.
అమ్మోరు
సౌందర్య, రమ్యకృష్ణ ఇద్దరూ తమలోని నటనను పూర్తి స్థాయిలో తెరపై ఆవిష్కరించిన సినిమా అమ్మోరు. ఈ సినిమా ఎఫెక్ట్ కు థియేటర్లలో జనాలతో పాటు, బాక్సాఫీస్ కు కూడా కలెక్షన్ల పూనకం వచ్చేసింది. టాలీవుడ్ చరిత్రలో ఒక క్లాసిక్ గా అమ్మోరు నిలిచిపోతుందనడంలో ఆశ్చర్యం లేదు.
ఒసేయ్ రావులమ్మ
లేడీ బాస్ విజయశాంతి ఒక ట్రైబల్ అమ్మాయి పాత్రలో, ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన సినిమా ఇది. కానీ స్త్రీశక్తిని చాటుతూ తీసిన ఈ సినిమాకు, వందేమాతరం శ్రీనివాస్ ఇచ్చిన అద్భుతమైన సంగీతం తోడై సినిమాను పరుగులు పెట్టించింది.
ప్రతిఘటన
స్త్రీ తిరగబడితే చరిత్రలే మారిపోతాయని చెప్తూ, బాక్సాఫీస్ లెక్కల్ని కూడా తిరగరాసిన సినిమా ప్రతిఘటన. ఈ సినిమాతోనే విజయశాంతి స్టార్ హీరోయిన్ గా మారారు.
కర్తవ్యం
తెలుగుతో పాటు తమిళంలో కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమా కర్తవ్యం. నిజాయితీ కల ఒక మహిళా పోలీసాఫీసర్, ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది. వాటిని ఎదిరించి ఎలా నిలబడింది అనేదే చిత్రకథ.
అరుంధతి
అనుష్కతో పాటు ఇండస్ట్రీలోని ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల గతిని కూడా మార్చిన సినిమా ఇది. జేజమ్మగా అనుష్క విశ్వరూపం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. హీరో ప్రాధాన్యం లేకుండా వచ్చిన ఈ సినిమా, ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడం విశేషం.
మంత్ర
హర్రర్ నేపథ్యంలో కేవలం హీరోయిన్ చుట్టూ తిరిగే కథతో వచ్చిన చిన్న సినిమా మంత్ర. చిన్నసినిమాగానే వచ్చినా, వసూళ్లులో మాత్రం పెద్ద సినిమాగా నిలిచింది.
ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంకా అనేక సినిమాలు మహిళా ప్రాధాన్యతతో మనముందుకొచ్చాయి. ఫలితాలసంగతి పక్కన పెడితే, స్త్రీలకు ప్రాముఖ్యతనిచ్చి, ఈ సినిమాలను తెరకెక్కించిన దర్శక నిర్మాతలను మెచ్చుకుతీరాల్సిందే. టాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాల్సిందే. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
