గోపీచంద్ జిల్ రివ్యూ
on Mar 27, 2015
మాస్‌ని ఆకట్టుకొంటే సినిమా సేఫ్ జోన్‌లో పడిపోతుందన్న మాట సినీ జనాలు ఎక్కువగా నమ్ముతారు. అందుకే కథ ఎలా రాసుకొన్నా మాస్‌కి నచ్చేలా తీర్చిదిద్దడానికి తాపత్రయ పడుతుంటారు. దానికి ఇప్పుడు స్టైలీష్ నెస్ జోడించడం అలవాటైపోయింది. హీరో స్టైల్‌గా నడుచుకొంటూ వస్తుంటాడు. బ్యాక్ గ్రౌండ్‌లో అదిరిపోయే మ్యూజిక్.. టక్ నలగకుండా, క్రాఫ్ చదరకుండా విలన్లను పిచ్చకొట్టుడు కొట్టేస్తుంటాడు. దాన్నే మన సినిమావాళ్లు స్టైలీష్ మేకింగ్ అంటూ మురిసిపోతుంటారు. అలాంటి కథే.. జిల్ కూడా. లౌక్యంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ని నమ్ముకొని గట్టెక్కేసిన గోపీచంద్.. ఇప్పుడు స్టైలీష్ యాక్షన్ బాట పట్టాడు. ఇంతకీ జిల్ ఎలా ఉందంటే...
జై (గోపీచంద్) ఓ ఫైర్ ఆఫీసర్. అమ్మానాన్న లేరు. పిన్ని, బాబాయ్ (ఊర్వశి, చలపతిరావు) దగ్గర పెరుగుతాడు. ఓ ప్రమాదం నుంచి సావిత్రి (రాశీఖన్నా)ని కాపాడి.. ఆమె ప్రేమలో పడిపోతాడు. మరోవైపు అండర్ వరల్డ్ మాఫియాడాన్ నాయక్ (కబీర్) దగ్గర 1000 కోట్లు కొట్టేసి పరార్ అవుతాడు జనార్థన్ (బ్రహ్మాజీ). జనార్థన్ కోసం నాయక్ మనుషులు అన్వేషిస్తుంటారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకొన్న జనార్థన్‌ని ప్రాణాలకు తెగించి కాపాడతాడు జై. అతను చనిపోతూ చనిపోతూ జైకి ఓ కోట్ ఇస్తాడు. దాంతో పాటు ఏదో చెప్పాలన్న ప్రయత్నం చేస్తాడు. జనార్థన్ చనిపోతూ...1000 కోట్ల రహస్యం చెప్పాడని నాయక్ అనుమానం. అందుకే జైని, అతని మనుషుల్నీ వెంటాడుతుంటాడు. జైకి నిజంగానే 1000 కోట్ల గురించి తెలుసా?? జైని వెంటాడిన నాయక్‌కి ఎలాంటి సమాధానం చెప్పాడు?? చివరికి 1000 కోట్లను ఏం చేశాడు? అనేదే ఈ సినిమా కథ.
ఓ హీరో - ఓ విలన్ - వాళ్ల మధ్య పోరాటం, చివరికి హీరో గెలుపు. ఏ కథని తీసుకొన్నా ఇదే లైన్. జిల్ కూడా అందుకు అతీతంగా సాగలేదు. తనకేమాత్రం సంబంధం లేని విషయంలో హీరో తలదూర్చి.. ఆ ఫలితంగా ఓ మాఫియాడాన్‌ని ఎదుర్కొన్ని. అతని సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేయడం - జిల్ కథ. అయితే ఈ రొటీన్ కథని దర్శకుడు స్టైలీష్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. హీరో, విలన్... ఈ రెండు క్యారెక్టర్లనూ చాలా స్టైలీష్‌గా తీర్చిదిద్ది ఈ సినిమాని ఓ స్టైలీష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మలుద్దామనుకొన్నాడు. అయితే.... వాటిలో యాక్షన్, స్టైల్ తప్ప ఎంటర్‌టైన్‌మెంట్ మిస్సయ్యింది. హీరో - విలన్‌ల మధ్య క్రాష్ మొదలయ్యే సరికి ఇంట్రవెల్ కార్డు పడిపోతుంది. అంటే.. తొలి భాగాన్ని కేవలం కథకు లీడ్ తీసుకోవడానికి మాత్రమే వాడుకొన్నాడన్నమాట. ద్వితీయార్థంలో తొలిభాగం ఆకట్టుకొంటుంది. హీరో, విలన్లు ఛాలెంజింగ్ సీన్లు.. `నీతో ఎవరు మాట్లాడినా చంపేస్తా` అని విలన్ బెదిరించడం... దానికి హీరో సమాధానం ఇవ్వడం ఇవి బాగున్నాయి. అయితే ప్రీ క్లైమాక్స్ పరమవీక్. పతాక సన్నివేశాల్లో ఓ ట్విస్టు ఉందిగానీ.. దాన్ని తెరపై చూపించిన విధానం ఆసక్తికరంగా లేకపోవడంతో అదికాస్త తేలిపోయింది. చివర్లో విలన్‌ని అంతం చేసి, ఆ వెయ్యి కోట్లూ ఛారిటీకి ఇచ్చేసి రొటీన్ గా శుభం కార్డు వేసుకొన్నారు.
ఇది వరకటి సినిమాలకంటే గోపీచంద్ స్టైలీష్‌గా కనిపించాడు. అందంగానూ ఉన్నాడు. అయితే స్టైల్‌గా కనిపించే ప్రయత్నంలో మరీ బిగుసుకుపోయి నటించాడు. డాన్సుల్లో కొంచెం కష్టపడినట్టు తెలుస్తోంది. ఇన తనకు అలవాటైన ఫైట్స్‌లో ప్రతాపం చూపించాడు. రాశీఖన్నా కాస్త అల్లరి చేసింది. ఎక్స్‌పోజింగ్‌కు మొహమాటపడేది లేదని ఈ సినిమాతో మరోసారి స్పష్టం చేసింది. లిప్‌లాక్‌ల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది గానీ.. ఈ సినిమాలో అంత సీన్ లేదు. కబీర్ నటన ఆకట్టుకొంటుంది. చాలా స్టైలీష్ గా కనిపించాడు. తెలుగు సినిమాకి మరో విలన్ దొరికినట్టే. పోసానిది రొటీన్ కామెడీ. ఇక చెప్పుకోదగిన ప్రతిభ చూపించిన వాళ్లెవరూ లేరు.
సినిమాని రిచ్‌గా తీయాలన్న ప్రయత్నం జరిగింది. నిర్మాణ విలువలు అడుగడుగునా కనపడతాయి. యాక్షన్ దృశ్యాలపై బాగా ఫోకస్ పెట్టారు. అవన్నీ మాస్‌కి నచ్చొచ్చు. శర్వణన్ కెమెరా పనితనం ఆకట్టుకొంటుంది. సెకండాఫ్‌లో పోసాని ఎపిసోడ్ ట్రిమ్ చేయొచ్చు. పాటలు అతి పెద్ద మైనస్. ఒక్కటీ రిజిస్టర్ కాదు. ఆర్.ఆర్ కూడా చెప్పుకోదగిన స్థాయిలో లేదు. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తూ, నాఅంత బరువు ఉంటే సరిపోదు.. అవతల కూడా నేను అయ్యుండాలి అనే డైలాగ్ కేక. ఇలాంటి డైలాగులు మరో నాలుగైదు పడినా ఎమోషన్ బాగా పీక్‌కి వెళ్లేది. దర్శకుడికి ఇదే తొలి ప్రయత్నం. యాక్షన్ ఘట్టాలు, పెళ్లి చూపుల సీన్ బాగా హ్యాండిల్ చేశాడు. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా ఓకే. అయితే.. మిగిలిన విభాగాలపైనా దృష్టి పెట్టాల్సింది.
లౌక్యం తరవాత గోపీచంద్ మళ్లీ తన పాత ఫార్ములాలోకి వెళ్లిపోయాడు. వినోదం బాగా మిస్సయ్యింది. యాక్షన్ సీన్స్‌ని స్టైలీష్ గా చూడాలనుకొన్నవాళ్లు ఈ సినిమాకి వెళ్లొచ్చు. అంతకు మించి.. మరేమైనా ఆశిస్తే.. జిల్ మిమ్మల్ని.. థ్రిల్ చేయలేదు.