Facebook Twitter
గురుతొకటి (కవిత)



గురుతొకటి

 

మతపు ముసుగొకటి అవసరం
ఇదే లొసుగులున్న ఈ ప్రపంచపు లౌకికస్వరం
మారణ కాండలకు కావాలిగా ఆ భాస్వరం!
ఉన్నా లేడనిపించే
లేకపోయినా ఉన్నాడనపించే
ఆ వింత విధాతనెతకడానికి ఎన్నో దార్లు!
పుట్టుకతోనే పురిటివాసనకంటే వేగంగా
గిట్టుక లేని ఛాందసవాదాల కౌగిలిలో..
నీకు నువ్వు రాసుకొని,
నవ్వులరిగిపోయేలా గీసుకొనే,
మతతత్వపు మత్తు సిరాని
మరింత జల్లుతూ స్వాగతిస్తారు!
మహోన్నత లోకానికి మరపు రాని
మాయల మతపు వర్ణాన్ని విరచిస్తారు!
మనిషిగా పుట్టాక తప్పదేమో,
గత జన్మపు పాపపు అప్పేమో,
ఈ మతపు గుర్తులు..
మానవత్వం పై!
మనిషనే గుర్తొకటుందని ఎవరు గుర్తుచేస్తారో..
ఈ గుంభన సత్యాన్ని ఎవరు గుర్తిస్తారో..
గుర్తొకటి వేస్తారు..
గుర్తొకొటి... నీపై!!!!
 

 

Raghu Alla