Facebook Twitter
మధు మాసం!!

మధు మాసం!!

 

 

 

 

 

 

 

 

 

 

శిశిరంలో చలిపులి గజదొంగగారు
నిత్యంతనువంతా తీవ్రంగా తడిమేస్తూ
సిరిసంపదలేం దోచుకోబోయారో
దౌర్జన్యాల దాష్టికాలేంజేయబోయారో!

ఆడంబరంగా అగుపించే ఆస్తుల్ని
సర్వంగోల్పోయామని రాల్చుకొనిజూపిస్తూ
ఓడుబోడులమని అరకానీకిగొరగామని
తుషారబ్బట్టలు పొగమంచు దుప్పట్లప్పుదెచ్చుకుని!

వాసంతానేం తెలియని ధైర్యమో తరులకి
భద్రంగా బోషాణంలో దాచిన నగానట్రలు
రంగురంగుల సొగసైన చీనాంబరాలు
ఒక్కొక్కటిగా తీసిపట్టుకొచ్చిపెట్టుకున్నట్టు!

కొమ్మకొమ్మకీ చిక్కటి చిగుర్ల పట్టువస్త్రాలు
జూకాల్లా తరుశాఖలకివ్రేలాడ్తూ లేకాయలు
వివాహానికి నవవధువు ముస్తాబవుతూ
వజ్రవైడూర్యాలు కెంపుపచ్చల్ధరించినట్టు!

అద్భుతహొయల విరులమేయసౌందర్యసిరులు
మధుమాసపురేడు సూరీడ్నిజూసుకొనేమో
రవిదొర చలిదొంగని బందీజేశాడేమోనంటూ
వాసంత సొబగులు వేనోళ్ళ పొగుడుతూ కోయిలలు!

- రవి కిషోర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్