LATEST NEWS
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో తొలి విడత పోలింగ్ ముగిసిన వేళ  కేంద్ర హోంమంత్రి అమిత్ షా  ప్రకటన రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. మొదటి దశలో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 110కి పైగా సీట్లను కైవసం చేసుకోబోతోందని ఆయన   ధీమాగా చెప్పారు.  రాష్ట్రంలో గాలి   మార్పు స్పష్టంగా గోచరిస్తోందన్న అమిత్ షా..  తృణమూల్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ భారీ అంచనా వెనుక గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అమిత్ షా లెక్కలు నిజం కావాలంటే..  ఈ ప్రాంతాల్లో కమలం పార్టీ ఓటు బ్యాంకులో భారీ ఎత్తున  స్వింగ్ రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధికార టీఎంసీ ఓట్ల నుంచి సుమారు 10 శాతం, ఇతరుల నుంచి మరో 5 శాతం ఓట్లు బీజేపీ వైపు మళ్ళితేనే  అమిత్ షా చెప్పిన సంఖ్యలో నియోజకవర్గాలలో బీజేపీ విజయం సాధ్యమవుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నమోదైన అధిక పోలింగ్ శాతం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మాల్దా, జల్పాయ్‌గురి, మేదినిపూర్ వంటి ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడం మార్పుకు సంకేతమని కాషాయ దళం భావిస్తోంది.  ముఖ్యంగా గతంలో టీఎంసీకి అండగా నిలిచిన కొన్ని వర్గాల ఓట్లు చీలిపోవడం.. ముస్లిం ఓట్లలో  విభజన   తమకు కలిసి వస్తుందని కమలం పార్టీ బలంగా నమ్ముతోంది.  మాల్దా వంటి చోట్ల కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ వంటి పార్టీలు టీఎంసీ ఓటు బ్యాంకును దెబ్బతీసి.. అది పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తాయని ఆశిస్తోంది. అయితే, ఈ అంచనాలపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  రాజకీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. 152 సీట్లలో దాదాపు 60 స్థానాలలో  బీజేపీ గట్టి పోటీ  ఎదుర్కొనే అవకాశం ఉంది.   మిగిలిన స్థానాల్లో టీఎంసీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు..  ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న చోట్ల కమలం పార్టీకి ఎదురుగాలి తప్పదంటున్నారు.   అమిత్ షా ఊహిస్తున్నట్లుగా 110 సీట్లు సాధించాలంటే రాష్ట్రంలో ఒక అసాధారణమైన  కాషాయ గాలి వీచాలి. ప్రభుత్వ వ్యతిరేకత  కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. టీఎంసీ ప్రభుత్వంపై ఉన్న అవినీతి ఆరోపణలు, అభివృద్ధి లోపం వంటి అంశాలను బీజేపీ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి తోడు ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి ఆందోళనలు కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించాయని కొందరు అంటున్నారు. ఈ పరిస్థితులన్నీ బీజేపీకి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనేది కాషాయ నేతల వాదన. మొత్తంగా చూస్తే.. బెంగాల్ రాజకీయాల్లో మతపరమైన ధ్రువీకరణ ఎంతవరకు పనిచేస్తుందనేదే ఫలితాలను శాసించనుంది. హిందూ ఓట్లు ఏకపక్షంగా బీజేపీ వైపు మొగ్గు చూపితే అమిత్ షా అంచనాలు నిజం కావచ్చు.. కానీ, టీఎంసీ తన కోర్ ఓటు బ్యాంకును కాపాడుకోగలిగితే మాత్రం పోటీ అత్యంత హోరాహోరీగా ఉంటుంది. అమిత్ షా ప్రకటించిన 110 సీట్ల ధీమా నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే తుది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -సీతారాం కంఠంనేని
తెలంగాణలో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు  కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం (ఏప్రిల్ 25) ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది. ముఖ్యంగా మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్ కు గవర్నర్ నిర్ణయం గొప్ప ఊరటనిచ్చిందని చెప్పుకోవాలి. ఆయన తన పదవిని నిలబెట్టుకోవడానికి అవసరమైన రాజ్యాంగ గడువు ముగియనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ కేబినెట్ గతంలోనే గవర్నర్ కోటా కింద కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ప్రతిపాదించింది. అయితే.. గతంలో జరిగిన న్యాయపరమైన చిక్కులు, గవర్నర్ల మార్పు వంటి కారణాలతో ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి, ఈ నియామకాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ముఖ్యంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అజారుద్దీన్.. ఆరు నెలల లోపు శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికవ్వాలనే నిబంధన ఉండటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.   గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా న్యాయపరమైన స్టేలు రావడం వంటి అంశాలు ఈ ప్రక్రియను ఆలస్యం చేశాయి. సుప్రీంకోర్టులో ఉన్న స్టేలను దృష్టిలో ఉంచుకుని,,  ప్రభుత్వం సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. తాజా నిర్ణయంతో కోదండరాం, అజారుద్దీన్‌లు త్వరలోనే శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ద్వారా ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తింపునిచ్చింది. అలాగే, జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా, మాజీ ఎంపీగా ఉన్న అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం,   మండలికి పంపడం ద్వారా మైనారిటీ వర్గాలకు బలమైన ప్రాతినిధ్యం కల్పించినట్లయింది.   మరోవైపు, అజారుద్దీన్ మంత్రి పదవి విషయంలో ఉన్న గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ గ్రీన్ సిగ్నల్ రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ నెల 30వ తేదీతో ఆయన మంత్రిగా ప్రమాణం చేసి ఆరు నెలలు పూర్తి కానున్నాయి. ఒకవేళ ఈ లోపు ఎమ్మెల్సీగా నియామకం జరగకపోతే..  అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది.  ఇప్పుడు ఆ ముప్పు తప్పినట్లయింది.   గవర్నర్ ఆమోదంతో తదుపరి ప్రక్రియగా సాధారణ పరిపాలన విభాగం (GAD) ఉత్తర్వులు జారీ చేస్తుంది. అనంతరం శాసనమండలి చైర్మన్ సమక్షంలో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనివల్ల రాష్ట్ర కేబినెట్‌లో అజారుద్దీన్ స్థానం సుస్థిరమవుతుంది.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత,  కేసీఆర్ కుమార్తె,  కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్‌) పేరుతో తన పార్టీని ప్రకటించిన కవిత ఆ సందర్భంగా  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో  పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు.  గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే..   ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.  ఈ సందర్భంగా ఆమె తన తండ్రి కేసీఆర్ లక్ష్యంగా గుప్పించిన విమర్శలు సంచలనంగా మారియి.   రాష్ట్రంలో ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదనీ, ఆయనకు  అధికారం ముందు మమకారం తగ్గిపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తాను హెచ్చరించినా, తనను పక్కనపెట్టి  పందికొక్కులను అందలం ఎక్కించారని విమర్శలు గుప్పించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి మంచి పని చేశారన్న కల్వకుంట్ల కవిత..  ఇప్పుడు   రాష్ట్రం కోసం తాను స్వేచ్ఛగా పోరాడతానన్నారు.  సామాజిక తెలంగాణ సాధనే తమ పార్టీ లక్ష్యమని  ప్రకటించిన కవిత..   రెండేళ్లలో కచ్చితంగా అధికారంలోకి వస్తామనీ, తాను రాష్ట్ర ముఖ్యమంత్రిని అవుతాననీ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత పాంచజన్యం పేరిట ఐదు హామీలు ఇచ్చారు.   ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఈ హామీలు ప్రకటిస్తున్నట్లు చెప్పిన కవిత..   ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కూడా ఉచిత విద్య అందించే విధానాన్ని అమలు చేస్తామంటూ మొదటి హామీనీ..  అదేవిధంగా ప్రజలకు  ఏ రోగమొచ్చినా, ఏ దవాఖానాలో అయినా ఉచిత చికిత్స అందిస్తామని రెండో హామీని ప్రకటించారు. ఇక  వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి  రైతే రాజు  అనే నినాదాన్ని నిజం చేస్తామంటూ మూడో హామీనీ,  అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నాలుగో హామీనీ ప్రకటించారు.   తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగాల్సిందేననీ, సామాజిక న్యాయం సాధనకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామంటూ ఐదో హామీ ఇచ్చారు.   
ALSO ON TELUGUONE N E W S
1. 'వారణాసి' ఒక గొప్ప అడ్వెంచర్ మెక్సికోలో జరుగుతున్న 'CCXP 2026' వేదికగా రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న 'వారణాసి' మూవీ గ్లింప్స్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి పంపిన ప్రత్యేక వీడియో సందేశంలో.. ఈ సినిమా ఇండియన్ మైథాలజీ, గ్లోబల్ యాక్షన్ కలయికతో కూడిన ఒక గొప్ప అడ్వెంచర్ అని పేర్కొన్నారు. బలమైన ఎమోషన్స్ ఉంటాయని చెప్పారు. ఇక గ్లింప్స్‌లో మహేశ్ బాబు మునుపెన్నడూ లేని విధంగా.. గడ్డం, పొడవాటి జుట్టుతో రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశారని టాక్. 2. 'స్పిరిట్' షూటింగ్ కు బ్రేక్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఈ నెలలో జరగాల్సిన కీలక షెడ్యూల్.. కొన్ని కారణాల వల్ల మే నెలకు వాయిదా పడింది. దీంతో ప్రభాస్ యూరోప్ వెకేషన్‌కు వెళ్లారు. ప్రభాస్ తిరిగి రాగానే మే మొదటి వారంలో 'స్పిరిట్' కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. కాగా, 'స్పిరిట్' షూటింగ్ వాయిదా పడటం వల్ల, వచ్చే నెలలో ప్రారంభం కావాల్సిన 'కల్కి 2' షూటింగ్ షెడ్యూల్‌లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది.  3. నెవర్ బిఫోర్ లుక్ లో బాలయ్య నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న 'NBK 111' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్య గతంలో ఎన్నడూ చూడని విధంగా చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. బాలయ్య డార్క్ షేడ్స్‌తో కనిపించనున్న ఈ పాత్ర అభిమానులకు స్పెషల్ ట్రీట్‌గా ఉండనుంది. ముంబై నేపథ్యంలో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో బాలకృష్ణ తన మునుపటి సినిమాలకు భిన్నమైన గెటప్, బాడీ లాంగ్వేజ్‌తో అలరిస్తారట.  4. 'ఠాగూర్' విషయంలో రాజశేఖర్ ఆవేదన మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ 'ఠాగూర్' వాస్తవానికి తాను చేయాల్సిన సినిమా అని యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ అన్నారు. తమిళ మూవీ 'రమణ' రీమేక్ హక్కుల కోసం తాను అడ్వాన్స్ కూడా ఇచ్చానని, అయితే స్నేహితులను నమ్మి అగ్రిమెంట్ చేసుకోకపోవడమే తాను చేసిన పెద్ద తప్పని పేర్కొన్నారు. ఆ తర్వాత నిర్మాత ఠాగూర్ మధు భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో.. నన్ను కాదని, ఆ రీమేక్ హక్కులు ఆయనకు ఇచ్చేశారని తెలిపారు. అలా ఆ ప్రాజెక్ట్ చిరంజీవి దగ్గరకు వెళ్లిందని చెప్పారు. 5. 'సతీ లీలావతి' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటించిన 'సతీ లీలావతి' సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో మార్చి 6న విడుదల కావాల్సిన ఈ సినిమా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. భార్యాభర్తల మధ్య తలెత్తే సహజమైన గొడవలు, భావోద్వేగాల నేపథ్యంలో దర్శకుడు తాతినేని సత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పెళ్లి తర్వాత లావణ్య నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. 6. 'డార్లింగ్' వసూళ్ల సునామీ! ప్రభాస్ నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ 'డార్లింగ్' రీ-రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి రోజే రూ. 7 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ చిత్రం, రెండో రోజు కూడా జోరు కొనసాగిస్తూ మరో రూ. 2 కోట్లపైగా రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లోనే రూ. 9 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ప్రభాస్ స్టామినాను మరోసారి నిరూపించింది. రీ-రిలీజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా 'డార్లింగ్' సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 7. వారణాసి బ్యూటీకి అరుదైన గౌరవం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక 'గోల్డ్ గాలా 2026' వేడుకలో ఆమెకు 'గ్లోబల్ వాన్‌గార్డ్' (Global Vanguard) అవార్డును ప్రదానం చేయనున్నారు. . ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన వ్యక్తులు వివిధ రంగాల్లో సాధించిన అసాధారణ విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తారు. సినీ రంగంలో ఆమె సాధించిన అసాధారణ విజయాలు, ప్రపంచవ్యాప్తంగా సామాజిక మార్పు కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. 8. 'జన నాయగన్‌' ఎడిటర్‌ కు బిగ్ షాక్ 'జన నాయగన్‌' సినిమా లీకైన వ్యవహారంలో ఆ చిత్ర ఎడిటర్‌ ప్రదీప్‌ ఇ.రాఘవ్‌పై 'సదరన్‌ ఇండియా ఫిల్మ్‌ ఎడిటర్స్‌' అసోసియేషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ లీకేజీకి ప్రదీప్ ప్రత్యక్షంగా బాధ్యుడు కాకపోయినా, ఆయన అజాగ్రత్త వల్లే ఇది జరిగిందని అసోసియేషన్ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 9. రజినీకాంత్‌కి విలన్‌గా స్టార్ డైరెక్టర్? రజనీకాంత్ 173వ సినిమా గురించి ఒక క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ప్రముఖ డైరెక్టర్ శంకర్‌ను సంప్రదించారని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, రజనీ-శంకర్ కాంబినేషన్‌లో హీరో-విలన్ పోరాటాన్ని వెండితెరపై చూడటం ప్రేక్షకులకు కన్నుల పండుగే అని చెప్పాలి. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. 10. హీరో కుమార్తెను వేధించిన వ్యక్తి అరెస్ట్  బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కుమార్తె సైబర్ వేధింపులకు గురైన కేసులో.. మహారాష్ట్ర పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్న సమయంలో ఓ అపరిచిత వ్యక్తి ఆమెకు అసభ్యకర సందేశాలు పంపగా.. ఆమె వెంటనే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. అక్షయ్ కుమార్ స్వయంగా ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేశారు.  
ప్రస్తుతం టాలీవుడ్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పది, ఇరవై కోట్లు అంటేనే పెద్ద సినిమా అనే ముద్ర ఉండేది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ పుణ్యమా అని మేకర్స్ వందల కోట్లు కుమ్మరిస్తున్నారు. వంద కోట్లు అనేది కనీస బడ్జెట్‌గా మారిపోయింది. అయితే కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రాన విజయం వరిస్తుందని గ్యారంటీ లేదని ఇటీవలి కొన్ని ఫలితాలు నిరూపిస్తున్నాయి. స్టార్ పవర్, గ్రాఫిక్స్ హంగులు ఉన్నా సరే.. కథలో బలం లేకపోతే ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారనేది వాస్తవం. భారతీయ సినిమాలోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందిన చిత్రాల్లో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' ఒకటి. రామాయణ గాథను ఆధునిక సాంకేతికతతో వెండితెరపై ఆవిష్కరించాలని దర్శకుడు ఓం రౌత్ దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేయించారు. కానీ, విడుదలైన మొదటి రోజే విజువల్ ఎఫెక్ట్స్ (VFX)పై విపరీతమైన ట్రోలింగ్ ఎదురైంది. పాత్రల రూపకల్పనలో స్పష్టత లేకపోవడం, కథనం నెమ్మదించడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను చవిచూసింది. ప్రభాస్ రేంజ్ మార్కెట్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'గేమ్ ఛేంజర్'పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉండేవి. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం కేవలం పాటలకే సుమారు 75 కోట్లు వెచ్చించారని సమాచారం. అయితే, శంకర్ మార్క్ సోషల్ మెసేజ్ ఈసారి ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. దీంతో భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది. 2025లో వచ్చిన అతిపెద్ద ఫ్లాపుల్లో ఒకటిగా ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లో నిలిచిపోయింది. యువ హీరో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమా కోసం చేసిన కసరత్తులు అంతా ఇంతా కాదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక స్టైలిష్ స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా కోసం సుమారు 80 కోట్లకు పైగా ఖర్చు చేశారు. షూటింగ్ ఆలస్యం కావడం, స్క్రిప్ట్ లోని లోపాల వల్ల ఈ సినిమా కనీస వసూళ్లను కూడా సాధించలేకపోయింది. అఖిల్ కెరీర్‌లోనే ఇది ఒక పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అలాగే విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన 'లైగర్' కూడా భారీ ప్రమోషన్స్ మధ్య విడుదలై, బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. సాధారణంగా భారీ సినిమాలు అనగానే సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ సినిమాల విషయంలో కూడా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ టీజర్లు, ట్రైలర్లు చూసినప్పుడు ఉన్న జోష్.. థియేటర్లలో కథనం పలచబడటంతో కనుమరుగైంది. కేవలం గ్రాఫిక్స్ మీద, ఖరీదైన సెట్టింగుల మీద పెట్టిన శ్రద్ధలో సగం కథ మీద పెట్టి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, సినిమా విజయం అనేది బడ్జెట్ మీద కాకుండా బలమైన కంటెంట్ మీద ఆధారపడి ఉంటుందని ఈ ఫ్లాప్ సినిమాలు మరోసారి స్పష్టం చేశాయి. బాహుబలి, పుష్ప వంటి చిత్రాలు బడ్జెట్ కు రెట్టింపు వసూళ్లు సాధించడానికి ప్రధాన కారణం వాటిలోని ఎమోషన్ మరియు కథనం. రాబోయే కాలంలోనైనా మేకర్స్ కేవలం హంగులకే పరిమితం కాకుండా, ఆడియన్స్ ఆశించే బలమైన కథలతో ముందుకు వస్తారని ఆశిద్దాం. 
కన్నడ నాట మొదలై పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న నటుడు రాకింగ్ స్టార్ యష్. 'KGF' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం తన తర్వాతి చిత్రం ‘టాక్సిక్’ (Toxic) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి, ముఖ్యంగా దర్శకురాలి మేకింగ్ స్టైల్ గురించి యష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా గ్యాంగ్‌స్టర్ డ్రామాలు అంటేనే రఫ్ అండ్ టఫ్ యాక్షన్, భారీ డైలాగులు ఉంటాయని అందరూ అనుకుంటారు. ఇలాంటి కథలను పురుష దర్శకులు మాత్రమే సమర్థవంతంగా తెరకెక్కించగలరనే అపోహను ‘టాక్సిక్’ చెరిపివేస్తుందని యష్ ధీమా వ్యక్తం చేశారు. ఒక మహిళా దర్శకురాలి కోణంలో గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని చూడటం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సినిమాలో రొమాంటిక్ సీన్స్ నుంచి హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ వరకు ప్రతిదీ ‘ఫీమేల్ గేజ్’ (మహిళా దృక్పథం) లో చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లు యష్ స్పష్టం చేశారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పనితీరును ప్రశంసిస్తూ.. ఆమె ఒక అద్భుతమైన రచయిత్రి అని, ఆమెతో కలిసి పనిచేస్తున్న సమయంలో తాను ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటున్నానని యష్ తెలిపారు. యాక్షన్ సీన్లలో ఉండే ఆవేశాన్ని ఎంత బలంగా చూపించారో, అంతే సున్నితంగా ఎమోషన్స్‌ను కూడా ఆమె పండించారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ప్రేక్షకులు చూసి ఉండరని, మేకింగ్ పరంగా సరికొత్త ఒరవడిని ఈ సినిమా సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో యష్ సరసన ఏకంగా ఐదుగురు భామలు కనిపించబోతున్నారనే వార్త ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం చిత్ర యూనిట్ అహర్నిశలు శ్రమిస్తోంది. 'KGF' తర్వాత యష్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో దేశవ్యాప్తంగా సినీ లవర్స్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గీతూ మోహన్ దాస్ గత చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో, ‘టాక్సిక్’ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు క్వాలిటీ సినిమాగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ‘టాక్సిక్’ షూటింగ్ దశలో ఉంది. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది మార్చిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతుండటంతో, మూవీ విడుదల తేదీని జూన్ 4వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. ఈ గ్యాప్‌లో మరిన్ని అప్‌డేట్స్ తో రాకింగ్ స్టార్ తన ఫ్యాన్స్ ను పలకరించనున్నారు. రాబోయే టీజర్ మరియు ట్రైలర్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రముఖ గాయని గీతా మాధురి (Geetha Madhuri) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. నటుడు, గాయకుడు నోయెల్ నిర్వహిస్తున్న  'ఆఫ్ ది రికార్డ్' టాక్ షోలో పాల్గొన్న ఆమె..  సినిమా ఇండస్ట్రీలోని కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో బయటకు రాగానే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో గీతా మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. "తాను కాఫీ షాపులకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ప్రేమ జంటలు కనిపిస్తుంటారని.. కొన్నిసార్లు తెలిసినవాళ్ళే ఇతరులతో కనిపిస్తూ బుక్ అవుతుంటారు" అని తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. "నేను గనుక నోరు విప్పితే చాలా మంది కాపురాలు కూలిపోతాయి" అని అనడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇండస్ట్రీలో బయటకు కనిపించే ఇమేజ్ వేరు, వ్యక్తిగత జీవితాలు వేరు అనే ఉద్దేశంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు గీతా మాధురి ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటుందని ఆరా తీస్తున్నారు. టాలీవుడ్‌లో గీతా మాధురికి మంచి గుర్తింపు ఉండటమే కాకుండా, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోల ద్వారా ఆమెకు ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆమె మాటల్లో ఎంతో కొంత నిజం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతుంటే, షో ప్రమోషన్ కోసం చేసిన సరదా వ్యాఖ్యలే కావచ్చని మరికొందరు భావిస్తున్నారు.  నోయెల్ షోలో గీతా మాధురి చేసిన ఈ వ్యాఖ్యల పూర్తి వివరాలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఆమె వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి.  
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ (NBK112) పట్టాలెక్కబోతోందని వార్తలు రాగానే నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. కొరటాల శివ సినిమాల్లో హీరోల పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా, అర్థవంతంగా ఉంటాయి. బాలయ్య లాంటి మాస్ హీరోకు కొరటాల మార్క్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని చెప్పవచ్చు. అయితే, ప్రస్తుతం ఈ సినిమా విషయంలో దర్శకుడు కొరటాల ఒక ప్రధాన సమస్యతో సతమతమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ సినిమాల్లో కథ ఎంత ముఖ్యమో, సంగీతం కూడా అంతే కీలకం. గతంలో దేవిశ్రీ ప్రసాద్‌తో ఆయనకు 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' వంటి మ్యూజికల్ హిట్ ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారి 'ఎల్లమ్మ' అనే సినిమా చేస్తుండటం వల్ల.. ఆయన అందుబాటులో లేరు.  మరోవైపు వరుసగా బాలకృష్ణ సినిమాలకు పనిచేస్తూ 'నందమూరి తమన్' అనిపించుకున్న 'తమన్' పేరు పరిశీలనలోకి వచ్చింది. అయితే బాలయ్య సినిమాలకు ఆయన ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నప్పటికీ, పాటల విషయంలో కొంత రొటీన్ అనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా కోసం కొత్తగా ఎవరిని ఎంచుకోవాలనేది కొరటాలకు సవాలుగా మారింది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, 2027 సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర బృందం భావిస్తోంది. అందుకే కొరటాల గత చిత్రం 'దేవర'కు సంగీతం అందించిన అనిరుధ్ పేరు పరిశీలించట్లేదని తెలుస్తోంది. అనిరుధ్ విషయంలో రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి ఆయన షెడ్యూల్స్ చాలా బిజీగా ఉన్నాయి. రెండు ఆయన పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు.  ఈ నేపథ్యంలోనే సినిమా స్పీడ్‌కు ఏమాత్రం బ్రేక్ పడకుండా.. అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతాన్ని అందించే సరైన మ్యూజిక్ డైరెక్టర్ కోసం కొరటాల శివ తీవ్రంగా అన్వేషిస్తున్నారు. బాలయ్య - కొరటాల కాంబోలో సినిమా అనగానే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఆ అంచనాలను అందుకునేలా సరైన సంగీతాన్ని అందించే టెక్నీషియన్‌ను కొరటాల త్వరలోనే ఖరారు చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి. అయితే కూలర్లు వాడేవారు దాని శుభ్రత గురించి మాత్రం అంత శ్రద్ద తీసుకోరు. దీని వల్ల నీరు మురికిగా మారి దోమలు పెరగడానికి ఆవాసంగా మారడమే కాకుండా.. . కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచకపోతే కూలింగ్ కూడా పెద్దగా రాదు.   అయితే కూలర్ లో నీటిని ప్రతిరోజూ శుభ్రం చేయడం అంత ఈజీ ఏమీ కాదు.. కొన్ని కంపెనీల కూలర్లలో నీటిని నింపడం సులువే.. కానీ వాటిలో నీటిని తొలగించడం, శుభ్రం చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే.. అయితే.. కూలర్లలో నీరు ప్రతిరోజూ శుభ్రం చేయకపోయినా కొన్నిరోజుల పాటు నీరు శుభ్రంగా ఉండాలన్నా, తాజాగా అనిపించాలన్నా కేవలం ఒకే ఒక్క చిట్కా అద్బుతంగా పనిచేస్తుంది. అదేంటో తెలుసుకుంటే.. పటిక.. కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచడానికి పటిక చాలా సులభమైన,  ఇంటి చిట్కా. దీనిని నీటిలో వేయడం  వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కూలర్ ట్యాంక్‌లో నీరు తరచుగా ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది, ఇది తొందరగా మురికిగా మారే అవకాశం ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ నీటిలో దోమలు  ఆవాసం ఏర్పాటు చేసుకుని  గుడ్లు పెడతాయి. అయితే కూలర్ ఎక్కువ కాలం పనిచేయాలంటే   దానిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. నీటిలో ఒక చిన్న పటిక ముక్కను వేయడం వల్ల నీటిని శుభ్రపరచవచ్చు.  పైగా దోమల సమస్య కూడా తగ్గుతుంది. కూలర్ ట్యాంక్ లో పటిక వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నీటి స్వచ్చత.. పటిక నీటిలోని దుమ్ము, ధూళి , చిన్న కణాలను బంధిస్తుంది. ఈ కణాలు బరువెక్కి అడుగుకు చేరుకుంటాయి, దీనివల్ల పైన ఉన్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది. దోమలకు చెక్.. పటిక నీటిని శుద్ధి చేయడం వల్ల దోమల గుడ్లు, లార్వాలు సులభంగా వృద్ధి చెందలేవు. దీనివల్ల దోమల సమస్య గణనీయంగా తగ్గుతుంది. దుర్వాసన.. కూలర్ నీటి నుండి ఏదైనా వింత లేదా దుర్వాసన వస్తుంటే, దానిని చాలా వరకు తగ్గించడంలో పటిక సహాయపడుతుంది. బ్యాక్టీరియా..  పటికకు తేలికపాటి యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి, ఇవి నీటిలో ఉండే  హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. నీటి నాణ్యత.. పటిక నీటిని ఎక్కువ సేపు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది, దీనివల్ల కూలర్ ప్యాడ్‌లు త్వరగా పాడవకుండా ఉంటాయి , గాలి చల్లగా ఉంటుంది. పటికను ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. పటికను ఎక్కువ పరిమాణంలో వాడకూడదు. ఒక చిన్న ముక్క సరిపోతుంది. ఎక్కువ పటిక కలపడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా కూలర్‌లోని నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి.                                 *రూపశ్రీ.
  వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి. ఈ కారణంగానే ఇప్పట్లో ప్రతి ఇంట్లో కూలర్లు వాడుతున్నారు.  కాస్త అర్థిక స్థితి ఉన్నవారేతై ఏసీ లు కూడా పెట్టించుకుంటారు. కానీ రానురాను పెరుగుతున్న ఎండలు,  వాటి తాలుకూ వేడి కారణంగా కూలర్లు కూడా సరిపోవడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ.. సాధారణ కూలర్ ను కూడా చక్కగా ఏసీ లాంటి చల్లదనం ఇచ్చేలా చేయవచ్చు.  ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. సాధారణ కూలర్ తో ఏసీ లాంటి చల్లదనం కావాలంటే.. ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుంటే.. సాల్ట్ , ఐస్.. కూలర్  చల్లటి గాలిని అందించాలని  అనుకుంటే, ఐస్ లేదా ఉప్పు నీటిని కలపడం చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇది చాలా ఫేమస్ చిట్కా కూడా.  కూలర్ ట్యాంకులో రాళ్ల ఉప్పు,   ఐస్ క్యూబ్స్ వేస్తారు.  రాళ్ల ఉప్పు ఐస్ క్యూబ్స్ కరగకుండా ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి. దీని వల్ల కూలింగ్ బాగా వస్తుంది. అయితే.. ఇది రెగ్యులర్ గా చేయడం మంచిది కాదు.. ఉప్పు తొందరగా చిలుము పట్టేలా చేస్తుంది. దీని వల్ల కూలర్ లోని మెటల్ భాగాలు తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా వేడి భరించలేని సమయాల్లో ట్రై చేయడం మంచిది. వెంటిలేషన్.. చాలా మంది ఏసీ లాంటి చల్లదనం వస్తుందని ఆశించి,  కూలర్లను మూసి ఉన్న గదులలో వాడుతుంటారు, కానీ ఇది  పెద్ద పొరపాటు. సరైన వెంటిలేషన్ ఉన్నప్పుడే ఎయిర్ కూలర్ సరిగ్గా పనిచేస్తుంది. గదిలో  వేడి గాలి బయటకు పోవడానికి , చల్లని గాలి లోపల ప్రసరించడానికి వీలుగా ఒక కిటికీని లేదా తలుపును తెరిచి ఉంచడం ముఖ్యం. సరైన వెంటిలేషన్ కూలర్ పనితీరును  మెరుగుపరుస్తుంది. శుభ్రత.. కాలక్రమేణా కూలర్ ప్యాడ్‌లపై దుమ్ము, ధూళి పేరుకుపోయి, వాటి కూలింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందువల్ల వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం లేదా మార్చడం ముఖ్యం. కూలర్ చాలా చల్లని గాలిని ఇవ్వాలి అంటే.. కూలర్ లోపల వట్టివేర్లతో తయారు చేసిన మ్యాట్లను  ఉపయోగించాలి. ఇది కూలింగ్ ను మెరుగుపరుస్తుంది. వట్టివేర్ల  గుండా నీరు ప్రవహించినప్పుడు, గాలి చల్లగా, తాజాగా మారుతుంది, మంచి  తేలికపాటి సువాసనను కూడా అందిస్తుంది. పైన పేర్కొన్న చిట్కాలను పాటించడం వల్ల వేసవి కాలంలో కూలర్ ఏసీ లాంటి చల్లదనాన్నిఇస్తుంది.                                     *రూపశ్రీ.
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం, ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం.. వీటితో పాటు కాస్త ఆర్థికంగా బాగున్నవారైతే.. హనీమూన్ కు కూడా వెళ్తారు. పెళ్లయిన మొదట్లో..  కొన్ని నెలలు ఎంతో అద్బులంలా.. అంతా పరిపూర్ణంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ హనీమూన్  అయిపోయాక లేదా పెళ్లైన  రెండు మూడు నెలల తర్వాత.. అసలైన లైఫ్ మొదలవుతుంది.  ఇక్కడే అందరూ ఊహించుకునే పెళ్లి జీవితానికి,  వాస్తవానికి మధ్య చాలా తేడా ఉందని తెలుసుకుంటారు.  అసలు అంగీకరించలేని ఎన్నో విషయాలు బయటపడుతుంటాయి,  ఊహించుకున్న జీవితం చాలా రివర్స్ గా,  డిజప్పాయింట్ గా అనిపిస్తుంది.   పెళ్లి తర్వాత అర్థమయ్యే చేదు నిజాలు కొన్ని ఉన్నాయి. పెళ్ళి తర్వాత  జీవితం గురించి కలలు కనే ప్రతి ఒక్కరూ,  పెళ్లి తర్వాత జీవితాన్ని సినిమాటిక్ గా ఊహించుకునే ప్రతి ఒక్కరూ ఆ చేదు నిజాలను తెలుసుకోవాలి. దీని వల్ల పెళ్లి తర్వాత వారు డిజప్పాయింట్ అయ్యే పరిస్థితి ఎదురవ్వదు.  ఆ చేదు నిజాలు ఏంటో తెలుసుకుంటే..  ప్రేమ అంటే.. పెళ్లికి ముందు,  పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు  ప్రేమ అంటే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ, పొగడ్తలు చెప్పుకోవడమే అనుకుంటారు. నిజానికి చాలామందికి మొదట్లో అవే జరుగుతుంటాయి. కానీ పెళ్లైన రెండు మూడు నెలల తర్వాత సాధారణ  జీవితానికి తిరిగి వచ్చినప్పుడు, ప్రేమలో సరుకులు కొనడం, కరెంటు బిల్లు కట్టడం, బాధ్యతలు పంచుకోవడం కూడా ఉంటాయని మీరు గ్రహిస్తారు.  బయటకు వెళ్లి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని అనుకునేవారు.. పెళ్లైన కొన్ని నెలల తర్వాత.. ఈరోజు రాత్రి భోజనానికి ఏం వండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కేవలం బెడ్ రూమ్ ముచ్చట కాదు.. అది ఇద్దరూ కలిసి బాధ్యతలు పంచుకోవడంలో కూడా ఉంటుంది. పర్పెక్ట్ లైఫ్ పార్టనర్.. పెళ్లికి ముందు కేవలం మాట్లాడుకుంటూ ఉండటం వల్ల తమకు బెస్ట్ పార్ట్నర్ లభించారని అనుకుంటారు.  కానీ పెళ్ళి  తర్వాత  ఒకే ఇంట్లో కలిసి జీవించడం  మనిషిలో నిజ స్వభావాన్ని బయటపెడుతుంది. మనిషి అలవాట్లు, మాటలు,   రోజువారీ ప్రవర్తన, కొన్నిసార్లు అతిగా రియాక్ట్ అవ్వడం,  కోపం చేసుకోవడం, వాగ్వాదం ఇవన్నీ పెళ్లి తర్వాత ఉంటాయి. ఇవన్నీ పర్పెక్ట్ అనే ట్యాగ్ ను చెరిపేస్తాయి.  అయితే..  అందరూ ఒప్పుకోవాల్సన నిజం ఏమిటంటే.. ఎవరూ కంప్లీట్ గా పర్పెక్ట్ గా ఉండరు. ప్రతి ఒక్కరికీ బలాలు ఉంటాయి,  బలహీనతలు ఉంటాయి. రెండింటినీ అంగీకరించాలి. గొడవలు.. పెళ్లి తర్వాత గొడవ పడని భార్యాభర్తలు ఎక్కడా ఉండరు.  గొడవ పడని  భార్యాభర్తలు ఉన్నారని అనుకోవడం కూడా చాలా పొరపాటు.  విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణం. టీవీ రిమోట్ దగ్గర నుండి మొదలుకుని ఎన్నో విషయాలలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలపై వాదనలు ప్రతి వైవాహిక జీవితంలో ఒక భాగమే. డబ్బు.. ప్రేమకు దాని స్థానం ఉంది, అలాగే డబ్బుకు దాని స్థానం ఉంది. పెళ్లి తర్వాత, ఇంటి బడ్జెట్‌ను రూపొందించుకోవడం, ఖర్చులను నిర్వహించుకోవడం, పొదుపు గురించి ఆలోచించడం వంటివి చాలా కీలకమవుతాయి. పెళ్లి తర్వాత దంపతులు తమ ఆర్థిక ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని గ్రహిస్తారు. కొందరు పొదుపు చేయాలనుకుంటే, మరికొందరు ఖర్చు చేయాలనుకుంటారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనా పరులైతే.. ఇద్దరి సంపాదన మీద ఒక్కరే అధికారం చూపించడం  వంటి పరిస్థితులు ఎదురైతే.. అది  వారి బంధంలో పెద్ద చీలికకు దారితీయవచ్చు. కాబట్టి వివాహం తర్వాత డబ్బు గురించి మాట్లాడటం మంచిదే కానీ.. డబ్బు కోసం బంధాన్ని విచ్చిన్నం చేయకూడదు. పర్సనల్ స్పేస్.. పెళ్లికి ముందు స్నేహితులతో మాట్లాడటం నుండి, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం వరకు  పూర్తిగా స్వేచ్ఛగా ఉంటారు. కానీ పెళ్లి తర్వాత మారిపోతుంది. ప్రతి విషయంలోనూ  భాగస్వామిని కలుపుకోవాలి, వారి సౌకర్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు తమకోసం , స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. పైన చెప్పుకున్న విషయాలు చాలా సాధారణమైనవి. కానీ..పెళ్లికి ముందు చాలా జంటలు ఈ విషయాలలోనే ఊహించని అంచనాలు పెట్టుకుని, పెళ్లి తర్వాత చాలా డిజప్పాయింట్ అవుతారు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.                          *రూపశ్రీ.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో తొలి విడత పోలింగ్ ముగిసిన వేళ  కేంద్ర హోంమంత్రి అమిత్ షా  ప్రకటన రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. మొదటి దశలో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 110కి పైగా సీట్లను కైవసం చేసుకోబోతోందని ఆయన   ధీమాగా చెప్పారు.  రాష్ట్రంలో గాలి   మార్పు స్పష్టంగా గోచరిస్తోందన్న అమిత్ షా..  తృణమూల్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ భారీ అంచనా వెనుక గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అమిత్ షా లెక్కలు నిజం కావాలంటే..  ఈ ప్రాంతాల్లో కమలం పార్టీ ఓటు బ్యాంకులో భారీ ఎత్తున  స్వింగ్ రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధికార టీఎంసీ ఓట్ల నుంచి సుమారు 10 శాతం, ఇతరుల నుంచి మరో 5 శాతం ఓట్లు బీజేపీ వైపు మళ్ళితేనే  అమిత్ షా చెప్పిన సంఖ్యలో నియోజకవర్గాలలో బీజేపీ విజయం సాధ్యమవుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నమోదైన అధిక పోలింగ్ శాతం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మాల్దా, జల్పాయ్‌గురి, మేదినిపూర్ వంటి ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడం మార్పుకు సంకేతమని కాషాయ దళం భావిస్తోంది.  ముఖ్యంగా గతంలో టీఎంసీకి అండగా నిలిచిన కొన్ని వర్గాల ఓట్లు చీలిపోవడం.. ముస్లిం ఓట్లలో  విభజన   తమకు కలిసి వస్తుందని కమలం పార్టీ బలంగా నమ్ముతోంది.  మాల్దా వంటి చోట్ల కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ వంటి పార్టీలు టీఎంసీ ఓటు బ్యాంకును దెబ్బతీసి.. అది పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తాయని ఆశిస్తోంది. అయితే, ఈ అంచనాలపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  రాజకీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. 152 సీట్లలో దాదాపు 60 స్థానాలలో  బీజేపీ గట్టి పోటీ  ఎదుర్కొనే అవకాశం ఉంది.   మిగిలిన స్థానాల్లో టీఎంసీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు..  ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న చోట్ల కమలం పార్టీకి ఎదురుగాలి తప్పదంటున్నారు.   అమిత్ షా ఊహిస్తున్నట్లుగా 110 సీట్లు సాధించాలంటే రాష్ట్రంలో ఒక అసాధారణమైన  కాషాయ గాలి వీచాలి. ప్రభుత్వ వ్యతిరేకత  కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. టీఎంసీ ప్రభుత్వంపై ఉన్న అవినీతి ఆరోపణలు, అభివృద్ధి లోపం వంటి అంశాలను బీజేపీ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి తోడు ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి ఆందోళనలు కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించాయని కొందరు అంటున్నారు. ఈ పరిస్థితులన్నీ బీజేపీకి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనేది కాషాయ నేతల వాదన. మొత్తంగా చూస్తే.. బెంగాల్ రాజకీయాల్లో మతపరమైన ధ్రువీకరణ ఎంతవరకు పనిచేస్తుందనేదే ఫలితాలను శాసించనుంది. హిందూ ఓట్లు ఏకపక్షంగా బీజేపీ వైపు మొగ్గు చూపితే అమిత్ షా అంచనాలు నిజం కావచ్చు.. కానీ, టీఎంసీ తన కోర్ ఓటు బ్యాంకును కాపాడుకోగలిగితే మాత్రం పోటీ అత్యంత హోరాహోరీగా ఉంటుంది. అమిత్ షా ప్రకటించిన 110 సీట్ల ధీమా నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే తుది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -సీతారాం కంఠంనేని
తెలంగాణలో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు  కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం (ఏప్రిల్ 25) ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది. ముఖ్యంగా మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్ కు గవర్నర్ నిర్ణయం గొప్ప ఊరటనిచ్చిందని చెప్పుకోవాలి. ఆయన తన పదవిని నిలబెట్టుకోవడానికి అవసరమైన రాజ్యాంగ గడువు ముగియనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ కేబినెట్ గతంలోనే గవర్నర్ కోటా కింద కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ప్రతిపాదించింది. అయితే.. గతంలో జరిగిన న్యాయపరమైన చిక్కులు, గవర్నర్ల మార్పు వంటి కారణాలతో ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి, ఈ నియామకాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ముఖ్యంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అజారుద్దీన్.. ఆరు నెలల లోపు శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికవ్వాలనే నిబంధన ఉండటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.   గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా న్యాయపరమైన స్టేలు రావడం వంటి అంశాలు ఈ ప్రక్రియను ఆలస్యం చేశాయి. సుప్రీంకోర్టులో ఉన్న స్టేలను దృష్టిలో ఉంచుకుని,,  ప్రభుత్వం సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. తాజా నిర్ణయంతో కోదండరాం, అజారుద్దీన్‌లు త్వరలోనే శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ద్వారా ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తింపునిచ్చింది. అలాగే, జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా, మాజీ ఎంపీగా ఉన్న అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం,   మండలికి పంపడం ద్వారా మైనారిటీ వర్గాలకు బలమైన ప్రాతినిధ్యం కల్పించినట్లయింది.   మరోవైపు, అజారుద్దీన్ మంత్రి పదవి విషయంలో ఉన్న గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ గ్రీన్ సిగ్నల్ రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ నెల 30వ తేదీతో ఆయన మంత్రిగా ప్రమాణం చేసి ఆరు నెలలు పూర్తి కానున్నాయి. ఒకవేళ ఈ లోపు ఎమ్మెల్సీగా నియామకం జరగకపోతే..  అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది.  ఇప్పుడు ఆ ముప్పు తప్పినట్లయింది.   గవర్నర్ ఆమోదంతో తదుపరి ప్రక్రియగా సాధారణ పరిపాలన విభాగం (GAD) ఉత్తర్వులు జారీ చేస్తుంది. అనంతరం శాసనమండలి చైర్మన్ సమక్షంలో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనివల్ల రాష్ట్ర కేబినెట్‌లో అజారుద్దీన్ స్థానం సుస్థిరమవుతుంది.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత,  కేసీఆర్ కుమార్తె,  కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్‌) పేరుతో తన పార్టీని ప్రకటించిన కవిత ఆ సందర్భంగా  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో  పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు.  గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే..   ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.  ఈ సందర్భంగా ఆమె తన తండ్రి కేసీఆర్ లక్ష్యంగా గుప్పించిన విమర్శలు సంచలనంగా మారియి.   రాష్ట్రంలో ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదనీ, ఆయనకు  అధికారం ముందు మమకారం తగ్గిపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తాను హెచ్చరించినా, తనను పక్కనపెట్టి  పందికొక్కులను అందలం ఎక్కించారని విమర్శలు గుప్పించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి మంచి పని చేశారన్న కల్వకుంట్ల కవిత..  ఇప్పుడు   రాష్ట్రం కోసం తాను స్వేచ్ఛగా పోరాడతానన్నారు.  సామాజిక తెలంగాణ సాధనే తమ పార్టీ లక్ష్యమని  ప్రకటించిన కవిత..   రెండేళ్లలో కచ్చితంగా అధికారంలోకి వస్తామనీ, తాను రాష్ట్ర ముఖ్యమంత్రిని అవుతాననీ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత పాంచజన్యం పేరిట ఐదు హామీలు ఇచ్చారు.   ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఈ హామీలు ప్రకటిస్తున్నట్లు చెప్పిన కవిత..   ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కూడా ఉచిత విద్య అందించే విధానాన్ని అమలు చేస్తామంటూ మొదటి హామీనీ..  అదేవిధంగా ప్రజలకు  ఏ రోగమొచ్చినా, ఏ దవాఖానాలో అయినా ఉచిత చికిత్స అందిస్తామని రెండో హామీని ప్రకటించారు. ఇక  వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి  రైతే రాజు  అనే నినాదాన్ని నిజం చేస్తామంటూ మూడో హామీనీ,  అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నాలుగో హామీనీ ప్రకటించారు.   తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగాల్సిందేననీ, సామాజిక న్యాయం సాధనకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామంటూ ఐదో హామీ ఇచ్చారు.   
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం,  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా కీలకం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో జింక్ కూడా ఒకటి. అయితే చాలామందికి జింక్ లోపం గురించి పెద్దగా అవగాహన ఉండదు.  జింక్ లోపం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది నిజమేనా? జింక్ లోపం గురించి.  జింక్ లోపం వల్ల వచ్చే సమస్యల గురించి వైద్యులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. శరీరానికి జింక్ ఎందుకు అవసరం..  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి , చర్మానికి జింక్ చాలా అవసరం. జింక్ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి , కణజాలాలను బాగు చేయడానికి సహాయపడుతుంది. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చని, చర్మ, కడుపు సమస్యలను కూడా కలిగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. జింక్ లోపం వల్ల వచ్చే సమస్యలు.. జింక్ లోపం శరీరంలో అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. జింక్ లోపం పిల్లలలో పెరుగుదలను నిరోధించగలదు , మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇన్ఫెక్షన్లు.. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. జింక్ లోపం ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల ఫంగస్ , చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. విరేచనాలు.. వైద్యుల ప్రకారం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా అవసరం. జింక్ లోపం జీర్ణవ్యవస్థపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో జింక్ లోపించినప్పుడు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. గాయాలు.. జింక్ లోపం చర్మం, కడుపునే కాకుండా గాయాలను కూడా ప్రభావితం చేస్తుంది. జింక్ లోపం ఉన్నవారిలో గాయాలు నెమ్మదిగా నయమవుతాయి. జింక్ లోపిస్తే కనిపించే లక్షణాలు.. జింక్ లోపం వేగంగా బరువు తగ్గడం, నీరసం , జుట్టు రాలడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. జింక్ పుష్కలంగా లభించే ఆహారాలు.. ఆహారంలో జింక్‌ను చేర్చుకోవడానికి,  గుమ్మడి గింజలు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు గింజలు , రాగులను చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలలో జింక్ ఉంటుంది. అదనంగా,  ఆవాల ఆకుకూర, మాంసం, పప్పుధాన్యాలు, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, పెరుగు, వేరుశెనగలు , గుడ్లను కూడా తినవచ్చు. ఈ ఆహారాలలో కూడా జింక్ సమృద్దిగా ఉంటుంది.                                 *రూపశ్రీ.
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ అవసరం లేకుండా కొద్దిమోతాదులో అందుతుంది.  అయితే  అన్ని రకాల కూరగాయలను ఇనుప పాత్రలో వండకూడదు.  . కొన్ని కూరగాయలు ఐరన్ పాత్రలో వండినప్పుడు రియాక్షన్ జరిగి వాటి రుచి, రంగు లేదా పోషక విలువల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.  ఆహారం  నాణ్యత , రుచిని కోల్పోకుండా ఉండేందుకు, ఐరన్ పాత్రలు వాడే ప్తి ఒక్కరూ వాటిలో వండకూడని కూరగాయలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. టమోటా.. టమోటాలు వంటల్లో ఎక్కువగా ఉపయోగించే  కూరగాయ. టమోటాలలో ఆమ్లం అధిక మొత్తంలో ఉంటుంది, ఇది ఐరన్ తో చర్య జరుపుతుంది. దీనివల్ల కూరగాయ రంగు ముదురుగా మారవచ్చు , కొద్దిగా వగరు రుచిని కలిగి ఉండవచ్చు. ఎక్కువసేపు వండటం ఈ ప్రభావాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. అందువల్ల, టమోటా వంటి  కూరగాయలను స్టీల్ లేదా నాన్-స్టిక్ పాన్ లేదా బౌల్స్ లో వండాలి. పాలకూర.. పాలకూర వంటి ఆకుకూరలు ఐరన్ ప్రభావానికి గురైనప్పుడు వాటి  ఆకుపచ్చ రంగును కోల్పోయి, ముదురు రంగులోకి లేదా నల్లగా మారవచ్చు, దీనివల్ల అవి తినడానికి పనికిరావు. రుచిలో కూడా కొద్దిగా మార్పు ఉంటుంది. ఆకుకూరలను అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలలో వండటం ఉత్తమం. చింతపండు.. చింతపండు ఉపయోగించి వండే  కూరను ఇనుప పెనంలో వండకూడదు. వీటిలో ఉండే ఆమ్లాలు ఇనుముతో చర్య జరిపి ఆహారం రుచిని మార్చి, దానికి లోహపు రుచిని ఇస్తాయి. ఇది అనారోగ్యకరమైనదిగా కూడా పరిగణించబడుతుంది. అందువల్ల, స్టీల్ లేదా నాన్-స్టిక్ పెనాన్ని ఉపయోగించాలి.  కేవలం చింతపండు మాత్రమే కాకుండా నిమ్మకాయ,  మామిడికాయ వంటివి కూడా ఐరన్ పాత్రలలో వండకూడదు. పెరుగు వంటలు.. పెరుగుతో చేసిన కూర లేదా పెరుగు గ్రేవీ వంటి కూరగాయల వంటకాలను ఇనుప పెనంలో వండినప్పుడు వాటి రుచి భిన్నంగా ఉంటుంది. పెరుగులోని పులుపు ఇనుముతో కలిసి కొద్దిగా చేదును కలిగిస్తుంది. అంతేకాకుండా రంగు ముదురుగా మారవచ్చు , కూరలో కొద్దిగా నలుపు కనిపించవచ్చు. నిమ్మకాయ.. కూరగాయలకు నిమ్మరసం కలపడం వల్ల వాటికి కొద్దిగా పులుపు, రుచి వస్తుంది, కానీ అది ఐరన్ తో  చర్య జరిపి రుచిని పాడుచేసే అవకాశం ఉంది.  దీనివల్ల ఆహారానికి లోహపు, వగరు రుచి వస్తుంది, కాబట్టి నిమ్మరసాన్ని ఎల్లప్పుడూ వంట చేసిన తర్వాత, తినడానికి ముందు మాత్రమే కలపాలి. ఎక్కువ నీటి శాతం కలిగిన కూరలు.. అధిక నీటి శాతం ఉన్న కూరగాయలను ఐరన్ పెనంలో వండినప్పుడు వాటి రంగు, ఆకృతి మారవచ్చు. ఈ కూరగాయలను ఎక్కువ సేపు వండితే నల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని రసాయనాలతో చర్య జరపని పాత్రలలో వండటం మంచిది.                               *రూపశ్రీ.
  ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్య నుండి కళ్లకు ఉపశమం కలిగించడానికి చాలా మంది బ్లూ లైట్ కళ్లద్దాలు వాడుతున్నారు.  ప్రస్తుతం ఈ బ్లూ లైట్ కళ్లద్దాల వినియోగం చాలా ఎక్కువైంది కూడా.  అయితే, ఈ కళ్లద్దాలు నిజంగా  కళ్లకు రక్షణ కవచంలా పనిచేస్తాయా? , లేక ఇవి కేవలం ఒక ట్రెండ్‌లో భాగమా? కంటి సంరక్షణ నిపుణులు దీని గురించి ఏం చెప్తున్నారు? తెలుసుకుంటే.. బ్లూ లైట్ ఎఫెక్ట్.. నీలి కాంతి అనేది ఒక రకమైన అధిక శక్తి గల కాంతి. ఇది కేవలం డిజిటల్ స్క్రీన్‌ల నుండే కాకుండా, సూర్యరశ్మి నుండి కూడా వెలువడుతుంది. మనం గంటల తరబడి స్క్రీన్‌లను చూస్తూ ఉన్నప్పుడు, కళ్ళు పొడిబారడం, చికాకు, అలసట , తలనొప్పి వంటి కంటి సమస్యలను ఎదురవుతాయి. ఇలా కంటి సమస్యలు రావడాన్ని  డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని అంటారు. ఈ సమస్యలకు స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతియే ప్రధాన కారణమని చాలా మంది భావిస్తారు. బ్లూ లైట్ గ్లాసెస్.. మార్కెట్లో లభించే బ్లూ లైట్ గ్లాసెస్, వాటి ప్రత్యేక లెన్సులు నీలి కాంతిని కళ్ళలోకి చేరకుండా అడ్డుకుంటాయని బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెబుతారు. నీలి కాంతి మనిషిలో నిద్ర హార్మోన్లను ప్రభావితం చేస్తుంది కాబట్టి, ఇది కంటి ఒత్తిడిని తగ్గించి, నిద్రను మెరుగుపరుస్తుందని కంపెనీలు వాదిస్తున్నాయి. అయితే శాస్త్రీయంగా ఇది నిరూపణ కాలేదు.  బ్లూ లైట్ గ్లాసెస్ అమ్మకం దారులు చెప్పే విషయాలను పరిశోధనలు సమర్థించడం లేదు. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే.. బ్లూ లైట్ గ్లాసెస్  కంటి అలసటను తగ్గించడంలో అంత ప్రభావవంతంగా ఉండవు.  కంటి నొప్పి , పొడిబారడానికి అసలు కారణం బ్లూ లైట్ కాదు,  విరామం లేకుండా తదేకంగా  స్క్రీన్‌ను చూడటం ద్వారానే అసలు సమస్య వస్తోంది , కూర్చున్నప్పుడు  తప్పు పొజిషన్ లో కూర్చోవడం,  స్క్రీన్‌ను చూస్తున్నప్పుడు తక్కువగా కనురెప్పలు వాల్చడం వంటివి కళ్లకు అలసట, పొడిబారడం వంటి సమస్యలు తెచ్చిపెడతాయి. అందువల్ల, కేవలం కళ్లజోడు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యను పూర్తిగా తొలగించలేము. బ్లూ లైట్ గ్లాసెస్ పనికిరావా? బ్లూ లైట్  కళ్లద్దాలు ధరించడం వల్ల కొంతమందికి కొంత సౌకర్యం కలగవచ్చనేది నిజమే. ముఖ్యంగా రాత్రి పొద్దుపోయే వరకు తమ మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లపై పనిచేసే వారికి కొంత ఉపశమనం లభించవచ్చు లేదా వారి నిద్ర పోవడానికి ఎక్కువ రిస్క్ లేకుండా ఈ బ్లూ లైట్ కళ్లద్దాలు కాస్త హెల్ప్ చేయవచ్చు.   కానీ పూర్తి కంటి రక్షణకు ఈ కళ్లద్దాలు పెట్టుకోవడం  ఏకైక పరిష్కారంగా భావించడం సరికాదని వైద్యులు చెబుతున్నారు.                                    *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.