Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ మన మనిషి కాదు మరమనిషి.. గుంటనక్కల చేతిలో బందీ.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
posted on: Apr 25, 2026 12:58PM
.webp)
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో తన పార్టీని ప్రకటించిన కవిత ఆ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఈ సందర్భంగా ఆమె తన తండ్రి కేసీఆర్ లక్ష్యంగా గుప్పించిన విమర్శలు సంచలనంగా మారియి. రాష్ట్రంలో ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదనీ, ఆయనకు అధికారం ముందు మమకారం తగ్గిపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తాను హెచ్చరించినా, తనను పక్కనపెట్టి పందికొక్కులను అందలం ఎక్కించారని విమర్శలు గుప్పించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి మంచి పని చేశారన్న కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు రాష్ట్రం కోసం తాను స్వేచ్ఛగా పోరాడతానన్నారు. సామాజిక తెలంగాణ సాధనే తమ పార్టీ లక్ష్యమని ప్రకటించిన కవిత.. రెండేళ్లలో కచ్చితంగా అధికారంలోకి వస్తామనీ, తాను రాష్ట్ర ముఖ్యమంత్రిని అవుతాననీ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత పాంచజన్యం పేరిట ఐదు హామీలు ఇచ్చారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఈ హామీలు ప్రకటిస్తున్నట్లు చెప్పిన కవిత.. ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కూడా ఉచిత విద్య అందించే విధానాన్ని అమలు చేస్తామంటూ మొదటి హామీనీ.. అదేవిధంగా ప్రజలకు ఏ రోగమొచ్చినా, ఏ దవాఖానాలో అయినా ఉచిత చికిత్స అందిస్తామని రెండో హామీని ప్రకటించారు. ఇక వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేస్తామంటూ మూడో హామీనీ, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నాలుగో హామీనీ ప్రకటించారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగాల్సిందేననీ, సామాజిక న్యాయం సాధనకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామంటూ ఐదో హామీ ఇచ్చారు.






