Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అజారుద్దీన్ మంత్రి పదవికి తప్పిన గండం
posted on: Apr 25, 2026 2:24PM

తెలంగాణలో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం (ఏప్రిల్ 25) ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది. ముఖ్యంగా మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్ కు గవర్నర్ నిర్ణయం గొప్ప ఊరటనిచ్చిందని చెప్పుకోవాలి. ఆయన తన పదవిని నిలబెట్టుకోవడానికి అవసరమైన రాజ్యాంగ గడువు ముగియనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ కేబినెట్ గతంలోనే గవర్నర్ కోటా కింద కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ప్రతిపాదించింది. అయితే.. గతంలో జరిగిన న్యాయపరమైన చిక్కులు, గవర్నర్ల మార్పు వంటి కారణాలతో ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి, ఈ నియామకాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ముఖ్యంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అజారుద్దీన్.. ఆరు నెలల లోపు శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికవ్వాలనే నిబంధన ఉండటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా న్యాయపరమైన స్టేలు రావడం వంటి అంశాలు ఈ ప్రక్రియను ఆలస్యం చేశాయి. సుప్రీంకోర్టులో ఉన్న స్టేలను దృష్టిలో ఉంచుకుని,, ప్రభుత్వం సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. తాజా నిర్ణయంతో కోదండరాం, అజారుద్దీన్‌లు త్వరలోనే శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ద్వారా ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తింపునిచ్చింది. అలాగే, జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా, మాజీ ఎంపీగా ఉన్న అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం, మండలికి పంపడం ద్వారా మైనారిటీ వర్గాలకు బలమైన ప్రాతినిధ్యం కల్పించినట్లయింది.
మరోవైపు, అజారుద్దీన్ మంత్రి పదవి విషయంలో ఉన్న గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ గ్రీన్ సిగ్నల్ రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ నెల 30వ తేదీతో ఆయన మంత్రిగా ప్రమాణం చేసి ఆరు నెలలు పూర్తి కానున్నాయి. ఒకవేళ ఈ లోపు ఎమ్మెల్సీగా నియామకం జరగకపోతే.. అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ముప్పు తప్పినట్లయింది.
గవర్నర్ ఆమోదంతో తదుపరి ప్రక్రియగా సాధారణ పరిపాలన విభాగం (GAD) ఉత్తర్వులు జారీ చేస్తుంది. అనంతరం శాసనమండలి చైర్మన్ సమక్షంలో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనివల్ల రాష్ట్ర కేబినెట్‌లో అజారుద్దీన్ స్థానం సుస్థిరమవుతుంది.


.webp)
.webp)


