శీతాకాలంలో జుట్టు బాగా రాలుతుందా.. ఇలా చెక్ పెట్టండి!
చలికాలంలో చర్మ సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే కేవలం చర్మ సంబంధ సమస్యలు మాత్రమే కాకుండా జుట్టు సంబంధ సమస్యలు కూడా చలికాలంలో ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా చుండ్రు సమస్య ఎక్కువ కావడం, జుట్టు రాలడం ప్రధానంగా ఉంటుంది. చల్లని గాలుల కారణంగా తల చర్మం చాలా పొడిగా మారుతుంది. జుట్టు కూడా పొడిగా తయారవుతుంది. పైగా ఈ చలికాలంలో నీరు తాగడం తగ్గుతుంది. ఈ కారణంగా తల చర్మం పొడిబారి తొందరగా జుట్టు బలహీనం అవుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చలికాలంలో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ఆయిల్ మసాజ్..
కనీసం వారానికి ఒకసారి తలకు ఆయిల్ మసాజ్ చేయాలి. దీని వల్ల తల చర్మంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. జట్టు పొడిబారడాన్ని నిరోధిస్తుంది. ఇందుకోసం కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె మొదలైన నూనెలతో జుట్టుకు మసాజ్ చేయాలి. జుట్టు కుదుళ్లలోకి నూనె ఇంకడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నూనెలు జుట్టుకు పోషణను ఇస్తాయి. జుట్టును బలంగా మారుస్తాయి.
తలస్నానం..
తలస్నానం చేయడంలో చాలామంది చేసే తప్పు నీరు ఎంచుకునే విధానం. చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేస్తుంటారు. దీని వల్ల తల చర్మంలో ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. అందుకే ఎంత చలిగా ఉన్నా తల స్నానానికి గోరు వెచ్చగా ఉన్న నీటిని మాత్రమే వాడాలి.
కండీషనింగ్..
కండీషనింగ్ అనేది జుట్టును చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. వారానికి ఒకసారి డీప్ కండీషనింగ్ చేసుకోవాలి. ఇది జుట్టుకు తేమను అందించి జుట్టును మృదువుగా ఉంచుతుంది. జుట్టు పొడిబారే సమస్యకు చెక్ పెడుతుంది.
హెయిర్ మాస్క్..
జుట్టు రాలడాన్ని ఆపాలన్నా, జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా మారాలన్నా హెయిర్ మాస్క్ లు చక్కగా సహాపడతాయి. ఇందుకోసం గుడ్డు, పెరుగు, తేనె లేదా కలబందతో తయారు చేసిన హెయిర్ మాస్క్ ను అప్లై చేయాలి. ఇవి జుట్టుకు పోషణను ఇచ్చి దృఢంగా మారుస్తాయి.
ఆహారం..
జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్దిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. సమతుల ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తీసుకునేది శాకాహారం అయినా, మాంసాహారం అయినా శరీరానికి తగిన పోషణ అందేలా జాగ్రత్త పడాలి. ఇది జుట్టు ఆరోగ్యానికి చక్కగా సహాయపడుతుంది.
ఒత్తిడి..
మంచి ఆహారం, కేశ సంరక్షణ తీసుకున్నా సరే.. జుట్టు రాలుతోందంటే అది మానసిక ఒత్తిడి వల్ల అనే విషయాన్ని గ్రహించాలి. ఏ విషయాల వల్ల అయినా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. యోగ, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడికి కారణమయ్యే విషయాలు, వ్యక్తులకు కాస్త దూరంగా ఉంటూ యోగ, ధ్యానం చేస్తుంటే తొందరగా దాన్నుండి బయటపడతారు.
ప్రొటెక్షన్..
చలికాలంలో చల్లని గాలులు జుట్టును, చల చర్మాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తలను, జుట్టును కప్పి ఉంచాలి.
ఉల్లిపాయ రసం..
ఉల్లిపాయ నేటికాలంలో జుట్టు సంరక్షణ కోసం చ ాలా రికమెండ్ చేయబడుతోంది. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేస్తుంటే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు నల్లగా, మందంగా మారుతుంది. కనీసం వారానికి ఒకసారి అయినా జుట్టుకు ఉల్లిపాయ రసం పెట్టుకోవాలి. చలిగాలుల కారణంగా ఇబ్బంది పడేవారు కాస్త ఎండ ఉన్న సమయంలో పెట్టుకుని ఒక అరగంట నుండి గంట సేపు ఎంత సమయం వీలైతే అంతసేపు పెట్టుకుని తరువాత జుట్టు కడిగేయాలి. ఇది మంచి ఫలితాలు ఇస్తుంది.
*రూపశ్రీ.