నిద్రపోయేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హెయిర్ లాస్ పెరుగుతుంది..!

 

హెయిర్ లాస్.. చాలా మంది పొడవాటి జుట్టు కలను నాశనం చేసే సమస్య ఇది.  హెయిర్ లాస్ ఎక్కువగా ఉన్న అమ్మాయిలు వారికి తెలియకుండానే డిప్రెషన్ లోకి వెళుతుంటారు.  హెయిర్ లాస్ కు చాలా కారణాలు ఉంటాయి.  వాటిలో తెలిసీ తెలియక అమ్మాయిలు చేసే కొన్ని పనులు జుట్టు రాలే సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో పడుకునేముందు చేసే  కొన్ని పనులు జుట్టు రాలే సమస్యను అధికం చేస్తాయి.  అవేంటో తెలుసుకుంటే..

తడి జుట్టు..

రోజంతా అలసిపోయినప్పుడు రాత్రి పూట స్నానం చేయడం చాలామంది అలవాటు.  రాత్రి తల స్నానం చేయడం వల్ల తొందరగా తడి ఆరదు.  కొందరు తడి జుట్టుతో అలాగే నిద్రపోతుంటారు.  మరికొందరు వర్షం కారణంగా వర్షంలో తడిచి తల పూర్తీగా ఆరక ముందే తడి జుట్టుతో పడుకుంటూ ఉంటారు.  తడి జుట్టుతో నిద్రపోయినప్పుడు జుట్టు తొందరగా విరిగిపోతుంది.

దిండు కవర్..

దిండు కవర్ విషయంలో జాగ్రత్తలు పాటించేవారు చాలా తక్కువగా ఉంటారు.  సిల్క్ లేదా శాటిన్ దిండు కవర్లు వాడితే అవి జుట్టు రాపిడిని చాలా తగ్గిస్తాయి. కానీ ఇవి కాకుండా కాటన్ తో సహాఇతర దిండు కవర్లు వాడితే అవి జుట్టును చిక్కులు పడేలా చేయడంలో ఎక్కువ  పాత్ర పోషిస్తాయి.

జుట్టు వదిలేయడం..

ఇప్పటి ఫ్యాషన్ కారణంగా చాలా మంది జడ వేసుకోవడం మరచిపోయారు. ఎనీ టైం జుట్టు వదులుగా ఉంచుతారు.  మహా అయితే పోనీ టైల్ వేసుకుంటారు. జుట్టు వదులుగా ఉంచి నిద్రపోతే జుట్టు చాలా తొందరగా చిక్కులు పడుతుంది. అందుకే జుట్టును జడ వేసుకుని అది కూడా మరీ గట్టిగా బిగించకుండా జడ వేసుకుని పడుకోవాలి.

నూనె..

జుట్టుకు నూనె రాసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. వారంలో కనీసం రెండుసార్లు  అయినా జుట్టుకు నూనెతో మసాజ్ చేయాలి.  రాత్రంతా అలాగే ఉంచి ఆ తరువాత ఉదయాన్నే తలస్నానం చేయాలి.  ఇది జుట్టుకు పోషణ ఇస్తుంది. జుట్టు చిట్లకుండా చేస్తుంది.

చిక్కులు..

సాధారణంగా జుట్టు చిక్కులు పడటం సహజం.  ప్రతిరోజూ రెండు పూటలా జుట్టును చిక్కులు లేకుండా ఆరోగ్యంగా సున్నితంగా దువ్వుకోవాలి.  ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది.

                                                          *రూపశ్రీ.