కొబ్బరి నూనెలో ఇవి మిక్స్ చేసి రాస్తే చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతం..!
జుట్టుకు ఉపయోగించే నూనెలలో కొబ్బరినూనె వాడే వారు అధికశాతం మంది ఉంటారు. కొబ్బరి నూనె మరీ చిక్కగా లేకుండా తేలికగా ఉంటుంది. దీన్ని జుట్టుకు అప్లై చేసిన తరువాత జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ కనిపిస్తుంది. సాధారణంగా కొబ్బరినూనెను తలకు పెట్టుకుని అలాగే ఉంచుకుంటారు. మరుసటి రోజు లేదా రెండు రోజుల తరువాత తలస్నానం చేసేవారు కూడా ఉంటారు. మరికొందరు మాత్రం కొబ్బరినూనెను తలకు పెట్టుకుని ఒక గంట ఆగి తలస్నానం చేస్తుంటారు. పై పద్దతులలో ఎలా చేసినా జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో ఇది సహాయపడుతుంది. అయితే సరైన కేశ సంరక్షణ లేకపోవడం, జుట్టు పలుచగా ఉండటం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా జుట్టు పెరుగుదల సరిగా లేక నిరాశ పడేవారు కూడా ఉంటారు. ఇలాంటి వారు కొబ్బరినూనెలో కొన్ని పదార్థాలు మిక్స్ చేసి తలకు పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎంతో మంది అమ్మాయిలు కలగనే పొడవాటి జుట్టు, నడుము వరకు పెరిగే జుట్టు ఈ చిట్కాల వల్ల సాధ్యమవుతుంది. ఇంతకీ ఇందుకోసం ఏం చేయాలంటే..
జుట్టుకు కొబ్బరినూనె..
కొబ్బరినూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. జుట్టుకు పోషణ ఇస్తాయి. కొబ్బరి నూనెలో కొన్ని పదార్థాలు మిక్స్ చేస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి.
వేప..
కొబ్బరినూనెలో వేప ఆకులను మిక్సీ వేసి కలపాలి. ఈ నూనెను తలకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు పెరుగుదల అద్భుతంగా ఉంటుంది. లేకపోతే కొబ్బరి నూనెలో వేప విత్తనాల నూనె కూడా కొద్దిగా కలిపి అప్లై చేసుకోవచ్చు. ఈ నూనె చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వారంలో రెండు సార్లు ఈ కాంబినేషన్ వాడుతుంటే జుట్టు పెరుగుదల చూసి ఆశ్చర్యపోతారు. అంతేకాదు.. ఈ నూనె వాడటం వల్ల జుట్టు మందంగా కూడా మారుతుంది.
దాల్చిన చెక్క ..
కొబ్బరి నూనెలో దాల్చిన చెక్క పొడిని కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టుకు మెరుపు వస్తుంది. అంతేకాదు జుట్టు రాలడం ఆగాక ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడుతుంది.
కరివేపాకు..
జుట్టుకు కొబ్బరినూనె, కరివేపాకు కాంబినేషన్ ను చాలా ఏళ్ళ క్రితం నుండి వాడుతున్నారు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడతాయి. కరివేపాకును కొబ్బరినూనెలో కలిపి వాడటమే కాకుండా ప్రతిరోజూ నాలుగైదు పచ్చి కరివేపాకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే జుట్టు పెరుగుదల అద్భుతంగా ఉంటుంది.
*రూపశ్రీ.