కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ రహస్యం.. నివారణోపాయం!
మహిళల ముఖం ఎంత అందంగా ఉన్నా కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఉండటం వల్ల చెప్పలేనంత చిరాకు, విసుగు మాత్రమే కాకుండా ముఖారవిందాన్ని మొత్తం పాడు చేస్తుంటాయి. ఈ నల్లని వలయాలు పోగొట్టుకోవాలని మహిళలు చేసే ప్రయత్నాల గురించి ఎంత చెప్పినా తక్కువే… అయితే చేసే పని ఏదైనా దానికి తగినట్టు చేస్తున్నామా లేదా అనేది ఎంతో ముఖ్యం. సమస్య ఏమిటో తెలియకుండా వైద్యుడు మందు ఇవ్వడు అన్నట్టు.. సమస్యకు కారణం తెలియకుండా కనిపించిన చిట్కా పాటించడం కూడా తప్పే… కళ్ళ చుట్టూ వచ్చే నల్లని వలయాలకు కారణం ఏమిటి?? ఎందుకొస్తున్నాయి ఈ నల్లని వలయాలు.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి ముందు.
కళ్ళచుట్టూ నల్లని వలయాలకు కారణాలు:-
కళ్ళు, ముక్కు, పెదవులు ఈ అవయవాల చుట్టూ ఉండే చర్మం సహజంగానే సున్నితంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కళ్ళ కింద చర్మం ఎక్కువ సున్నితంగా ఉంటుంది. ఈ అవయవాల చుట్టూ ఉన్న ప్రాంతాలలో సబ్ క్యుటేనియస్ ఫ్యాట్ అనే పదార్థం ఉంటుంది. విపరీతంగా అలసట కలిగించే పనులు చేసేవారికి, పోషకాహార లోపంతో బాధపడేవారికి, రక్తహీనత కలవారికి, కళ్ళు, ముక్కు, పెదవుల ప్రాంతంలో ఉండే ఈ పదార్థం తగ్గిపోయి అక్కడి చర్మం కాస్త లోపలికి పోతుంది. అయితే… కళ్ళ చుట్టూ ఉండే చర్మం మరింత సున్నితం కాబట్టి అక్కడి చర్మం చాలా తొందరగా ప్రభావానికి గురవుతుంది. ఫలితంగా కళ్ళచుట్టూ చర్మం నల్లబడుతుంది. ఇదే నల్లని వలయాలుగా మారుతుంది.
ఈ కారణం తెలుసుకోకుండా పై పూతగా చర్మానికి చెప్పలేనని క్రీమ్ లు ఉపయోగిస్తారు మహిళలు. కానీ దీనికి పాటించాల్సిన పద్ధతులు వేరుగా ఉంటాయి…
దీనికోసం రెండు రకాల పద్ధతులు పాటించాలి.. ఒకటి లైఫ్ స్టైల్.. రెండు.. నాచురల్ టిప్స్..
లైఫ్ స్టైల్…
లైఫ్ స్టైల్ అంటే తీసుకునే ఆహారం, అలవాట్లు మొదలైనవాటిలో మార్పు చేర్పులు చేసుకోవడం.
తీసుకునే ఆహారంలో విటమిన్ ఎ,బి,సి పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.
అలసట కలిగినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. అంతేకానీ అలసట కలుగుతున్నా అలాగే పని చేయకూడదు.
సమయానికి ఆహారం తీసుకోవాలి. అలాగే సమయానికి నిద్ర కూడా ఎంతో అవసరం. రోజులో తగినంత నిద్ర లేకపోతే కళ్ళు అలసిపోతాయి. మరీ ముఖ్యంగా సిస్టం ల ముందు పనిచేసేవారు స్క్రీన్ లైటింగ్ వల్ల కళ్ళ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది. కళ్ళను చల్లని నీటితో అప్పుడప్పుడు కడగాలి. చేతులను రుద్దుకుని అందులో పుట్టే వేడిని సున్నితంగా కళ్ళకు తగిలేలా తుడవాలి. వీలైనంత ఎక్కువగా స్క్రీన్ నుండి దృష్టిని మళ్లించాలి.
శరీరానికి తగినంత వ్యాయామం ఉంటే శరీరం అలసిపోవడం వల్ల నిద్ర కూడా బాగా వస్తుంది. కాబట్టి వ్యాయామం చేయాలి.
చిట్కాలు..
టీ డికాక్షన్ లో కాటన్ ముంచి తరువాత కాస్త పిండేసే తడిగా ఉన్న ఆ కాటన్ ను కళ్ళ మీద ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ లో సగం స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు కళ్ళచుట్టూ రాసుకోవాలి.
ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే టమాటా రసం కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా తీసుకోవాలి. ఇవి రెండూ సమానంగా తీసుకుని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలిమ్ ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
విటమిన్ ఇ ఆయిల్ ను కళ్ళ కింద రాస్తున్నా మంచి ఫలితం ఉంటుంది.
పై రెండు విధానాలు పాటిస్తే తొందరలోనే కళ్ళచుట్టూ నల్లని వలయాలు మాయమైపోతాయ్..
◆నిశ్శబ్ద.