వెంట్రుకలు రాగి రంగులోకి మారుతున్నాయా?? ఇదిగో మీకోసమే ఇది..
అమ్మాయిలకు వెంట్రుకలు అంటే ప్రాణం. జుట్టు పొడవుగా పెంచుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకప్పుడు మహిళలకు చాలమంచి కేశసంపద ఉండేది. అయితే రాను రాను అది తగ్గిపోతోంది. జుట్టు తెల్లబడటం, రాగి రంగులోకి మారడం, పలుచగా మారిపోవడం వంటి సమస్యలు మహిళలను వెంటాడుతుంటాయి.
వెంట్రుకలు పలుచగా వున్న స్త్రీలు వారమునకు రెండుసార్లు తల స్నానం చెయ్యాలి. రాత్రులు తేలికగా నూనె వ్రాసుకొని అలాగే వదిలేయవలెను. అప్పుడప్పుడు కొబ్బరి నుండే వేడి చేసి, తలకు మర్దించాలి. వెంట్రుకలు పలుచదనం పోయి దృఢంగా తయారవడానికి పౌష్టిక ఆహారము, బి-కాంప్లెక్సు సమృద్ధిగా తీసుకోవాలి. . కుంకుడుకాయలు రాత్రి నాన పెట్టి, ఉదయము నానిన కుంకుడుకాయలు ఉడికించి ఆ నీటితో తలంటుకోవాలి.
పోషకాహారముతోనే అందమైన జుట్టు సొంతమవుతుంది. ముఖ్యంగా జుట్టు రాగి రంగులోకి మారడం, వెంట్రుకలు రాలిపోవడం మొదలైన సమస్యలకు వెంట్రుకలు నల్లగా, దృఢముగా వుండటానికి పైపై మెఱుగులు ప్రయోజనాన్ని ఇవ్వవు. అందుకే పౌష్టికాహారము తీసుకొనుటలో శ్రద్ధ అధికముగా చూపాలి గుడ్లు, చేప మాంసము, ఆకుకూరలు, పళ్ళు మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి!
వెంట్రుకలు "కెరోటిన్” అనే 'మాంసకృత్తు'ల వలన తయారౌతాయి వెంట్రుకలు నల్లగా, నిగనిగలాడాలంటే....' ఆమ్లతైలము' ఉపయోగించడం మంచిది.
తలంటు పోసుకోవడానికి ఒక గంట ముందుగా ఆమ్లతైలము బాగా దట్టముగా పట్టించాలి. ఆ తరువాత నిమ్మరసమ తీసుకొని, తలకు మర్దన చేయాలి. ఆ తరువాత ఆరనిచ్చి, సీకాయ లేక కుంకుడు కాయతో తలంటు పోసుకోవాలి. దీనివల్ల కొంత కాలానికి వెంట్రుకలు నల్లగా నిగనిగలాడే స్థితికి మారుతాయి. షాంపూ లాంటి 'కెమికలైజ్డ్' పదార్థాలు ఉపయోగించకూడదు. అలాగే ఐరన్, విటమిన్ బి వంటివి ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.
రాగిరంగు వెంట్రుకలు నల్లబడటానికి హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలంటే..
250 గ్రా॥ల "మస్టర్డ్ ఆయిల్" (Mustard oil = ఆవాల నూనె)" ను మరగబెట్టాలి. ఈ నూనె మరిగేటప్పుడు 60 గ్రా॥ల గోరింటాకు తైలాన్ని వేసి, బాగా కలియబెట్టి, బాగా కాచాలి. తరువాత వడగట్టి, సీసాలో పోసుకొని, కొద్ది రోజులు నిలువ వుంచాలి. వెంటనే వాడకూడదు. కొన్నిరోజుల తరువాత ఈ నూనెను తలనూనెగా ఉపయోగిస్తూ వుంటే . మంచి ఫలితాలు కన్పిస్తాయి. ఈ నూనెను ఒక్కసారే ఎక్కువగా చేసుకోకూడదు. కొంచెం కొంచెం చేసుకుని వాడుకుంటూ ఉంటే మంచిది.
అలాగే జుట్టు సంరక్షణకు మరికొన్ని సహజమైన మార్గాలు..
మెత్తగా దంచిన ఉసిరికాయ పై చెక్కులను రాత్రిపూట నీటిలో వేసి, నానపెట్టి వుంచాలి. ఉదయమే ఆ నీటిని తలకు పట్టించి, కొద్దిసేపు ఆరనిచ్చి, ఆ తరువాత తలకు కొబ్బరి నూనె వ్రాసుకోవాలి. ఈ విధానము వలన వెంట్రుకలు నల్లగా మారతాయి.
పైన చెప్పుకున్నట్టే ఉసిరికాయ పై తొక్కను గిన్నెలో వేసి, అందులో "గుంటగలిజేరు" రసము పోసి, ఏడురోజులు నానబెట్టాలి. ఆ తదుపరి ఆ తొక్కలను ఎండించి, చూర్ణముచేసి, పూటకు పావుతులము(2.5grms) చొప్పున తేనెలో కలిపి తింటూవుంటే వెంట్రుకలు తుమ్మెద రెక్కల్లా నల్లబడతాయి. ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది.
మెంతి ఆకులు బాగా నూరి, శిరోజాలకు రాత్రి పడుకొనే ముందు పట్టించి, ఉదయము తల స్నానము చేస్తే వెంట్రుకలు మృదువుగా మారతాయి.
రేగు చెట్టు ఆకులు బాగా నూరి, తలకు పట్టించి, 1-2 గంటలు వుంచి, తల స్నానము చేస్తే .. వెంట్రుకలు బాగా పెరిగి, పట్టులా మృదువుగా వుంటాయి.
ప్రతిరోజూ కొబ్బరినూనె క్రమము తప్పకుండా జుట్టుకు రాస్తూవుంటే..... వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి. వెంట్రుకలు తుమ్మెద రెక్కల్లా నల్లగా వుంటాయి. బాగా పెరుగుతాయి. చాలా మృదువుగా కూడా వుంటాయి.
తలకు నూనె అవసరం లేదు అనే మాట చాలామంది చెబుతారు. కానీ జుట్టు రఫ్ గా మారిపోతుంది. అందుకే జుట్టుకు నూనె పెట్టడం అవసరం.
◆నిశ్శబ్ద.