మెరుపుతీగలా మెరిసిపోతారు ఇలా చేస్తే...


ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు?? అని సినిమాలలో హీరో పాట పాడితే.. హీరోయిన్ తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతుంది. ఆమె అందం కూడా నిజంగానే చూపరులను ఆకట్టుకుంటూ మెరుస్తూ ఉంటుంది. హీరోయిన్లు తాము అందంగా కనిపించడానికి పడని పాట్లు ఉండవంటే నమ్మండి. చర్మాన్ని, శరీర ఆకారాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటేనే వారికి అవకాశాలు వచ్చేది. అయితే అందమంటే హీరోయిన్లే కాదు. సాధారణ అమ్మాయిలు కూడా హీరోయిన్ అంత అందంగా ఉండచ్చు. సహజంగానే కాస్త ఖరీదైన బట్టలు వేసుకుని, ఖరీదైన వస్తువులు పెట్టుకుని, మంచి మేకప్ వేస్తే ప్రతి అమ్మాయీ హీరోయిన్ లాగే ఉంటుంది. కానీ… ఈ పూతలు పూయడం, ట్రీట్మెంట్ లు ఇవ్వడం వంటివి వదిలేసి సహజంగా అందంగా మెరిసిపోతే ఎంత బావుంటుంది కదా…


ప్రతి అమ్మాయి మనసులో ఏదో ఒక సందర్భంగా అనుకునే ఉంటుంది ఈ మాట. అయితే అలా అనుకోవడం అత్యాశ ఏమి కాదు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా.. ఎలాంటి కృత్రిమ పూతల జోలికి వెళ్లకుండా అద్భుతమైన దేహకాంతిని సొంతం చేసుకోవచ్చు..


ఎలాగంటే..ఇదిగో ఇలా…


◆విటమిన్ ఎ ను పుష్కలంగా కలిగి ఉండి, కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే దుంప  కూరగాయ క్యారెట్. ఇది సహజంగానే ఆకర్షణగా ఉంటుంది. ఈ క్యారెట్ ను కూరల్లోనూ, స్వీట్ చేయడానికి, జ్యుస్ చేసుకుని తాగడానికి, మరికొందరు నేరుగా డైటింగ్ పేరుతో తినడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ క్యారెట్ ను ఇలా కాకుండా విభిన్నంగా ఉపయోగిస్తే కాంతులీనే చర్మం సొంతమవుతుంది.


క్యారెట్ ను బాగా ఉడికించాలి. ఆ తరువాత బాగా మెదిపి గుజ్జులాగా చేయాలి. ఈ గుజ్జును శరీరమంతా పట్టించి అరగంట సేపు ఆరనివ్వాలి. ఈ గుజ్జు బాగా ఆరిన తరువాత కొన్ని పాలు తీసుకుని ఈ ఎండిన క్యారెట్ గుజ్జుమీద కొద్ధికొద్దిగా పాలు వేసి మర్దనా చేస్తూ క్యారెట్ గుజ్జును తొలగించాలి. దీని తరువాత సాధారణంగా స్నానం చేయాలి. స్నానానికి ఎలాంటి సోప్ ఉపయోగించకూడదు. ఇలా చేస్తుంటే చర్మం మృదువుగా మారి మంచి రంగులోకి వస్తుంది.


◆కొరియన్ స్కిన్..


సాధారణంగా ఇప్పట్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొరియన్ ప్రాంత అమ్మాయిల్లా చర్మం కావాలంటే ఇలా చేయండి అలా చేయండి అంటూ బోలెడు టిప్స్ చూపిస్తూ ఉంటారు. అయితే కొరియన్ స్కిన్ కావాలంటే కింది చిట్కా ఫాలో అవ్వాలి.


బఠానీ పువ్వులు ( బఠానీ కాయలు కాయడానికి ముందు పువ్వులు కాస్తాయి) తీసుకుని వాటిని ఎండబెట్టి పొడి చేయాలి, ఓట్స్ పొడి తీసుకోవాలి, ఇందులో పన్నీరు కలిపి మెత్తగా గుజ్జులాగా చేయాలి. దీన్ని శరీరమంతా పట్టించి బాగా ఆరిన తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తే రబ్బరు బొమ్మలగా కొరియన్ స్కిన్ సొంతమవుతుంది.


◆అందరికీ అందుబాటులో దొరికేది బొప్పాయి కాయ.  బాగా పండిన బొప్పాయి కాయను తీసుకుని పొట్టు తీసేసి బాగా మెదిపి గుజ్జు చేయాలి. బొప్పాయి కాయ గుజ్జును శరీరమంతా పట్టించి ఆరిపోయిన తరువాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే… క్రమంగా చర్మంలో జీవం పెరుగుతుంది. చర్మం మీద మచ్చలు, మంగు, మొటిమల తాలూకూ గుర్తులు వంటివి అన్నీ పోయి చర్మం స్పష్టంగా తయారవుతుంది.


◆నారింజ కాయ గురించి తెలియనిది ఎవరికి?? తింటాం తొక్కలు పడేస్తాం. అయితే ఈ నారింజ తొక్కలను కూడా ఉపాధి వనరుగా మార్చేసుకున్నాయి నేటి వ్యాపార పోకడలు. నారింజకాయ తొక్కను ఎండబెట్టి పొడిచేసి నిలవచేసుకోవాలి. నారింజ తొక్క పొడి, ఓట్స్ పొడి, పాలమీగడ మూడింటిని సమాన భాగాలుగా తీసుకుని బాగా కలిపి శరీరమంతా పట్టించాలి. సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీర చర్మం నునుపుగా, కాంతివంతంగా తయారవుతుంది.


పై చిట్కాలు పాటిస్తే హీరోయిన్ లాగా మీరూ తయారవుతారు అందంగానూ… మెరిసిపోతూనూ…


                                  ◆నిశ్శబ్ద.