జుట్టుకు రంగు వేస్తుంటారా...ఈ జాగ్రత్తలు మీ కోసమే!
జుట్టుకు రంగు వేయడం ఇప్పట్లో చాలా సాధారణం. చాలావరకు తెల్లజుట్టును కవర్ చేయడానికి జుట్టుకు రంగు వేస్తుంటారు. మరికొందరు జుట్టు రాగి రంగు లేదా ఇతర రంగులు వేసుకుంటూ ఉంటారు. అయితే ఫ్యాషన్ మీద అభిరుచి ఉన్నవారు ఒక వైపు తెల్ల జుట్టును కవర్ చేస్తూనే ఫ్యాషన్ ఐకాన్ గా కనిపించడం కోసం నలుపును కాకుండా ఇతర రంగులను ఎంచుకుంటూ ఉంటారు. నలుపు అయినా, ఇతర రంగులు అయినా జుట్టుకు వేసిన తరువాత అవి వీలైనంత తొందరగా పోతుంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టుకు రంగు ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. స్టైలిష్ లుక్ ను కూడా ఇస్తుంది. మరికొన్ని సార్లు జుట్టుకు వేసే రంగుల విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. వీటి గురించి తెలుసుకుంటే..
జుట్టుకు రంగు వేయడానికి ఉపయోగించే రంగులలో చాలా రకాల రసాయనాలు ఉంటాయి. ఇవి జుట్టును నిర్జీవంగా మారుస్తాయి. జుట్టు తొందరగా పొడిబారి, సాధారణ సమయాలలో టెంకాయ పీచులా చాలా రఫ్ గా అనిపిస్తుంది. ఈ సమస్యలు ఉండకూడదంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలి.
జుట్టుకు రంగు వేసిన తరువాత చాలామంది వెంటనే తలస్నానం చేస్తుంటారు. మరికొందరు ఒకరోజు అలా గ్యాప్ ఇచ్చి తలస్నానం చేస్తుంటారు. కానీ జుట్టుకు రంగు వేసిన తరువాత మూడు రోజుల పాటు అలాగే ఉండాలి. ఆ తరువాతే తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు వేసుకున్న రంగు ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.
జుట్టుకు రంగు వేసిన తరువాత తలస్నానం చేసేటప్పుడు రసాయనాలు లేని షాంపూను ఉపయోగించాలి. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జుట్టుకు వేసుకున్న రంగు తొందరగా వదిలిపోకుండా నిలిపి ఉంచుతుంది. జుట్టుకు మెరుపును కూడా ఇస్తుంది.
కొందరికి రోజూ తలస్నానం చేయడం లేదా రోజు విడిచి రోజు తలస్నానం చేయడం అలవాటు ఉంటుంది. కానీ షాంపూతో ప్రతి రోజూ తలస్నానం చేస్తుంటే జుట్టు రంగు తొందరగా వదిలిపోతుంది. జుట్టు కూడా దెబ్బతింటుంది.
తలస్నానం తరువాత జుట్టుకు కండిషనర్ పెట్టడం కొందరికే అలవాటు ఉంటుంది. కానీ కండీషనర్ ఉపయోగించడం వల్ల జుట్టుకు తేమ అందుతుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టుకు మెరుపును కూడా ఇస్తుంది.
ఎక్కువసేపు తలను తడపడం వల్ల కూడా తలకు పెట్టుకున్న రంగు తొందరగా వదిలిపోతుంది. అందుకే జుట్టును నీటిలో ఎక్కువసేపు పదే పదే కడగకూడదు. అలాగే ఎక్కువ వేడిగా ఉన్న నీటిని కూడా ఉపయోగించకూడదు.
జుట్టుకు రంగు వేసుకోవడం పట్ల ఇష్టం ఉన్నా సరే.. పదే పదే రంగు వేయకూడదు. ఇది జుట్టును బలహీనపరుస్తుంది. జుట్టు రాలిపోవడానికి, పలుచగా మారడానికి కారణం అవుతుంది.
*రూపశ్రీ.