మీ హైట్ తక్కువా? ఇలా చీర కడితే పొడవుగా కనిపిస్తారు..!


మనిషి రూపం మనిషి అందాన్ని నిర్ణయిస్తుంది.  ముఖ్యంగా అందానికి మారు పేరుగా చెప్పే అమ్మాయిలు అందంగా కనిపించే విషయంలో ఎక్కడా రాజీ పడరు.  శరీరంలో ఏం తక్కువైనా సరే.. ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి చూపరులను ఆకట్టుకుంటారు.  కొందరు అమ్మాయిలు చాలా పొట్టిగా ఉంటారు. ఇలాంటి వారు ఎలాంటి దుస్తులు వేసినా చిన్న పిల్లల్లా కనిపిస్తారు.  ముఖ్యంగా పెద్దరికానికి మారు పేరుగా చెప్పుకునే చీరను ధరించాలంటే  పొట్టిగా ఉన్న అమ్మాయిలు సతమతం అవుతారు.  కానీ చీర కట్టుకుని అందంగా మెరిసిపోవడం ప్రతి అమ్మాయి కల.  అయితే పొట్టిగా ఉన్న అమ్మాయిలు కొన్ని టిప్స్ పాటిస్తూ చీర కడితే వారి హైట్ ను హైడ్ చేయవచ్చు. అదెలాగో తెలుసుకుంటే..

ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు చీరల సెలక్షన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి.  కంటికి బాగా కనిపించడం కాదు.. తమ ఒంటికి ఏవి నప్పుతాయో.. తమ హైట్ ను ఏవి బాగా కవర్ చేస్తాయో తెలుసుకోవాలి.  హైట్ తక్కువగా ఉన్నవారు బోల్డ్ గా ఉన్న చీరలు,  పెద్ద ప్రింట్లు ఉన్న చీరలు ధరించకూడదు.  ఇలాంటి చీరలు పొట్టిగా ఉన్న అమ్మాయిలను మరింత పొట్టిగా కనిపించేలా చేస్తుంది.

పొట్టిగా ఉన్న అమ్మాయిలు షిపాన్ ఫాబ్రిక్ చీరలు ఎంపిక చేసుకోవడం మంచిది.  ఇవి శరీరానికి అతుక్కున్నట్టు ఉంటాయి.  అందంగా కనిపించేలా చేస్తాయి.  బొమ్మకు కట్టినట్టు చక్కగా ఇమిడిపోతాయి. వేరే చీరలు అయితే కుచ్చిళ్లు,  కొంగు, నడుము భాగంలో సరిగా సెట్ కావు. ఇవి బాగా లావుగా కనిపించేలా చేస్తాయి.  దీని కారణంగా అప్పటికే ఉన్న పొట్టిదనం ఇంకా పొట్టిగా కనిపించేలా చేస్తుంది.  కాబట్టి పొట్టిగా ఉన్నవారు షిఫాన్ ఫాబ్రిన్ ఎంచుకోవాలి.

షిఫాన్ చీరలు కేవలం సాధారణ సమయాలలోనే కాదు.. వేసవి కాలంలో కూడా బాగా సెట్ అవుతాయి.  ఈ ఫాబ్రిక్ తేలికగా ఉంటుంది కాబట్టి వేసవిలో చిరాకు,  అసహనానికి దారితీయవు. పైగా ఈ చీరలు ఎత్తు ఎక్కువగా కనిపించడంలో సహాయపడతాయి.

షిఫాన్ చీర మాత్రమే కాకుండా జార్జెట్ చీర కూడా పొట్టిగా ఉన్నవారికి బాగా సెట్ అవుతుంది. ఎత్తు తక్కువగా ఉన్నవారు చిన్న ప్రింట్లు ఉన్న చీరలను ఎంచుకుంటే మంచిది.

పొట్టిగా ఉన్నవారు బనారసీ సిల్క్, ఆర్ట్ సిల్క్, అస్సాం సిల్క్ వంటి చీరలు కట్టుకోకపోతేనే బెస్ట్.  ఇవి చాలా హెవీగా ఉంటాయి.  హైట్ ను హైడ్ చేయడానికి బదులు ఆ బరువు చీరలు ఇంకా పొట్టిగా కనిపించేలా చేస్తాయి. ఒక వేళ సిల్క్ చీరల మీద ఇష్టం ఉంటే పేపర్ సిల్క్ చీరలను ఎంచుకోవడం బెస్ట్.


                                                  *రూపశ్రీ.