టీనేజ్ మొటిమలకు చెక్ చెప్పాలంటే...


టీనేజ్ లోకి రాగానే ప్రతి వాళ్ళు ఎదుర్కొనే సమస్యే మొటిమలు. కాని వీటివల్ల అంతగా భయపడాల్సిన పని లేదని చెప్తున్నారు డెర్మిటాలజిస్టులు. అప్పటిదాకా నున్నగా, ముద్దుగా కనిపించే మొహంలో ఎర్రగా కనిపించే ఈ మొటిమలు వాళ్ళ అందానికి ఆనకట్టలుగా కనిపిస్తాయి. కొంతమంది అంతగా పట్టించుకోకపోయినా,మరికొందరు మొటిమల మొహంతో బైటకి వెళ్ళాలంటే తెగ ఇబ్బంది పడిపోతారు.

వయసు పెరుగుతూ 14, 15 సంవత్సరాల వయసు రాగానే శరీరంలో వచ్చే హార్మోన్ ఇమబాలన్స్ వల్ల ఎక్కువగా ఈ సమస్య మొదలవుతుందిట. శరీరంలో వచ్చే మార్పులు ఎదుర్కోవటం ఒక సమస్య అయితే ఈ మొటిమల బాధ ఇంకో సమస్య. దీనికోసం తల్లితండ్రులే కాస్త జాగ్రత్తలు తీసుకుని కొన్ని ఇంటి వైద్యాలు చేయటం వల్ల వాళ్ళ బాధని కొంతైనా తగ్గించగలుగుతారు.

ఈ సమస్య నివారణకి ముఖ్యంగా చేయాల్సింది శుభ్రత పాటించటం. పిల్లలు పడుకునే పిల్లో కవర్స్ వారానికి ఒకసారి మర్చిపోకుండా మారుస్తూ ఉండాలి. వాళ్ళు అస్తమాట్లు మొటిమలని ముట్టుకోకూడదని హెచ్చరించాలి. వాటిని గిల్లటం వల్ల సమస్య ఇంకా పెద్దదవుతుందని చెప్పాలి. బయట తినుబండారాలు తగ్గించాలి. ఈ వయసులో ఎక్కువగా బయట నూనేతో చేసిన పదార్థాలు తినటం వల్ల మొటిమలు ఎక్కువ అవుతాయి.

ఇక వచ్చిన మొటిమలనితగ్గించుకోవటం ఎలాగో చూద్దాం...

బేకింగ్ సోడా - మొటిమల నివారణకు బేకింగ్  సోడా చక్కగా పనిచేస్తుంది. బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి ఆ పేస్టుని వాటి మీద రాసి కాసేపు ఉంచాకా నీతితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఓట్స్ - చర్మంలో ఉన్న సూక్ష్మ రంద్రాలనిశుభ్రపరిచే గుణం ఓట్స్ లో పుష్కలంగా ఉంది. అంతేకాక ఎక్కువగా ఉన్న జిడ్డుని కూడా తగ్గిస్తుంది. ఉడికించిన ఓట్స్ లో 1 స్పూన్ తేనే,1/2 స్పూన్ నిమ్మరసం కలిపి మొటిమలపై రాసి అరగంట తరవాత గోరువెచ్చటి నీటితో కడుగుకుంటే చాలు, సమస్య తగ్గుముఖం పడుతుంది.

ముల్తాని మిట్టి -  మొహం మీద ఉండే మృత కణాలు సులువుగా పోవాలంటే ముల్తాని మిట్టి ఒక మంచి ఉపాయం. రోజ్ వాటర్, చందనం పొడి, ముల్తాని మిట్టి ఈ మూడింటిని సమపాళ్ళలో పేస్టులా కలిపి వాటిని మొహం మీద అప్లై చేసి అది ఆరేవరకు ఆగి నీటితో శుబ్రపరుచుకుంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు.

టూథ్ పేస్టు - ఆశ్చర్యపోయే పని లేదు నిజంగానే టూత్ పేస్టు మొతిమలకి మంచి మందు. రాత్రి పడుకునే ముందు తెల్లగా ఉండే టూత్ పేస్టు మొటిమలపై రాసి మర్నాడు ఉదయం కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే రెండు, మూడు రోజులలోనే మార్పు గమనించచ్చు.

దాల్చిన చెక్క పొడి - ఇంట్లో సులువుగా దొరికే దాల్చిన చెక్క పొడిని మొటిమల నివారణకు వాడచ్చు. రెండు చెంచాల తేనెలో ఒక చెంచా దాల్చీనీ పొడి కలిపి దానిని మొటిమలపై రాస్తే అవి బాగా తగ్గుతాయి.

బొప్పాయి - బొప్పాయి కూడా మొటిమల నివారణకి ఒక మందులా పనిచేస్తుంది. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. పండిన బొప్పాయిని గుజ్జులా చేసి మొహానికి పట్టించాలి, అది పూర్తిగా ఆరాకా గోరు వెచ్చటి నీటితో కడిగేసుకుంటే చాలు మోహంలో మొటిమలు పోవటమే కాదు, నున్నగా కూడా కనిపిస్తుంది.

అరటి తొక్క - అరటిపండు ఆరోగ్యానికి ఎంత మంచిదో దాని తొక్క మొటిమలకు అంత మంచి మందు. అరటి తొక్కతో మొహం మీద గుండ్రంగా రుద్దుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు ఇలా చేసాకా అరగంట ఆరనిచ్చి కడిగెయ్యాలి.

బంగాళదుంప - ఇంట్లో ఉండే ఆలుని పెట్తటి పేస్టులా చేసి మొటిమలపై రాసి ఒక పావుగంట తరువాత కడిగితే మొటిమలు తగ్గుముఖం పడతాయి.

మొటిమలతో బాధపడే వాళ్ళు వారానికి ఒకసారి మొహానికి ఆవిరి పట్టటం మంచిదని చెప్తున్నారు వైద్యులు. అలాగే పచ్చి పాలల్లో దూది ముంచి దానితో మొహాన్ని తుడుచుకుంటూ ఉండాలి. ఇలా చెయ్యటం వల్ల మొహం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి మాయం అయ్యి మొహంలో నిగారింపు వస్తుంది. అలాగే టీనేజ్ లోకి వచ్చిన పిల్లలు ఎక్కువగా నూనేతో చేసిన పదార్థాలు తినటం తగ్గించాలి. ఇలా మొటిమలపై కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టావు.

- కళ్యాణి