కళ్ల చుట్టూ నల్లని వలయాలున్నాయా? ఈ టిప్స్ పాటించి చూడండి!
అమ్మాయిలను చూడగానే ఇట్టే ఆకట్టుకునేది వారి ముఖమే. ముఖంలో కూడా ఎక్కువగా కనులు ఆకర్షిస్తాయి. కానీ నేటికాలంలో జీవినశైలి, ఆహారపు అలవాట్లు, రాత్రిసమయం ఎక్కువగా మేలుకోవడం, గంటల తరబడి డెస్క్ ముందు పనిచేయడం వంటి కారణాల వల్ల కళ్ల చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. వీటినే డార్క్ సర్కిల్స్ అని అంటారు. వీటిని తగ్గించుకోవడానికి అధికశాతం మంది మార్కెట్లో దొరికే బ్యూటీ ఉత్పత్తులను వాడతారు. కానీ ఇంట్లోనే కొన్ని టిప్స్ ఫాలో అయితే కళ్ల కింద ఉన్న నల్లని వలయాలను సులువుగానే తొలగించుకోవచ్చు.
కోల్డ్ కంప్రెస్..
కళ్లమీద చక్రాల్లా కోసిన కీర దోసకాయలు చల్లని స్టీలు స్పూన్లు, చల్లనీళ్లలో ముంచి తీసిన వాష్ క్లాత్ వంటివి కళ్లమీద ఉంచాలి. ఇవి కళ్ల చుట్టూ ఉబ్బిన చర్మాన్ని సాదారణంగా మారుస్తాయి. కళ్లచుట్టూ చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఫలితంగా కళ్లచుట్టూ రక్తనాళాలను చురుగ్గా పనిచేస్తాయి. నల్లని వలయాలు క్రమంగా తగ్గుతాయి.
టీ బ్యాగ్స్..
గ్రీన్ టీ ఇప్పట్లో చాలామంది వాడుతున్నారు. వాడేసిన గ్రీన్ టీ బ్యాగులను ఫ్రిజ్ లో ఉంచాలి. అవి చల్లబడిన తరువాత కళ్లమీద పెట్టుకోవాలి. టీ బ్యాగ్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెఫిన్ కళ్ల చుట్టూ ఉన్న చర్మ రంగును మార్చడంలో సహాయపడాయి. కళ్లచుట్టూ ఉన్న చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఇందుకోసం చమోమిలే లేదా గ్లీన్ టీ బ్యాగ్స్ ఉపయోగించవచ్చు.
బంగాళాదుంప ముక్కలు..
కీరదోస ముక్కల్లానే బంగాళాదుంప ముక్కలను కూడా కళ్లమీద ఉంచుకోవచ్చు. బంగాళాదుంపలలో ఉండే ఎంజైమ్ లు, విటమిన్-సి వాపులను, నలుపును తగ్గిచడంలో సహాయపడుతుంది.
బాదం నూనె..
రాత్రి పడుకునేముందు కొన్ని చుక్కల బాదం నూనెను కళ్లచుట్టూ రాసుకుని సున్నితంగా మసాజ్ చెయ్యాలి.. బాదం నూనెలోని విటమిన్-ఇ కళ్ల కింద ఉన్న సున్నితమైన చర్మానికి పోషణ ఇచ్చి నల్లని వలయాలు తగ్గడంలో సహాయపడుతుంది.
రోజ్ వాటర్..
చాలా తేలికగా లభించేది, అన్ని రకాల బ్యూటీ ట్రీట్మెంట్లల ఉపయోగించేది రోజ్ వాటర్. రోజ్ వాటర్ అలసిన కళ్లను తిరిగి తాజాగా మార్చడంలో సహాయపడుతుంది. కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది. కళ్ల కింద నల్లని వలయాలు తగ్గిస్తుంది.
కలబంద..
మంచి నాణ్యత కలిగిన అలోవెరా జెల్ కళ్లకింద ఉన్న నలుపును పోగొట్టడంలో సహాయపడుతుంది. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని తేమగా, తాజాగా ఉంచడంలో సహాయపడతాయి.
పాలు..
చల్లారిన పాలలో కాటన్ ప్యాడ్ లు ఉంచి వాటిని కాస్త పిండి తేమగా ఉన్నట్టే మూసిన కన్నులపై ఉంచుకోవాలి. సుమారు 15నిమిషాలు ఇలా ఉంచుకున్న తరువాత తీసేయాలి. పాలలోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
జీవనశైలి ముఖ్యం..
కళ్ళ చుట్టూ నల్లని వలయాలు నివారించడానికి లేదా తగ్గించడానికి జీవనశైలి కూడా చాలా ముఖ్యం. రోజూ తగినంత నిద్ర, పోషకాహారం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా పొందడం, రోజూ సరిపడినంత నీరు తాగడం, తీవ్రమైన సూర్యుడి కిరణాలకు కళ్లు నేరుగా ఎక్స్పోజ్ కాకుండా చూడటం ద్వారా కళ్ల కింద నల్లని వలయాలను పరిష్కరించుకోవచ్చు.
*నిశ్శబ్ద.