ముఖ చర్మం రంధ్రాలు తగ్గించడం ఎలాగో తెలుసా?

కొందరికి ముఖం మీద చర్మం రంధ్రాలలా కనబడుతుూ ఉంటుంది. ఇది చర్మ గంధ్రులు తెరచుకోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ తెరచుకున్న రంధ్రాల కారణంగా మొటిమలు, మచ్చలు, దుమ్ము, ధూళి పేరుకోవడమే కాదు.. చర్మం చాలా తొందరగా ముడుతలు పడినట్టు, వృద్దాప్యం మీద పడినట్టు అనిపిస్తుంది. చర్మం మీద ఉన్న ఈ ఓపెన్ పోర్స్ ను తగ్గించడం కష్టమే కానీ అసాద్యం మాత్రం కాదు. చాలా మంది వీటని తగ్గించుకోవడానికి వాణిజ్య ఉత్పత్తులను వాడుతుంటారు.  ఇవి వాడినంత సేపు చర్మం బిగుతుగా, రంధ్రాలు లేకుండా ఉంటుంది. కానీ తరువాత మళ్లీ మొదటికి వస్తుంది.  అలా కాకుండా ఇంటి పట్టునే సులువైన చిట్కాలతో ఈ ఓపెన్ పోర్స్ ను తగ్గించుకోవచ్చు.  అందుకోసం ఫాలో కావాల్సిన చిట్కాలు ఇవీ..

ఐస్..

ఓపెన్ పోర్స్ తగ్గించుకోవడానికి మంచు ముక్కలు బాగా సహాయపడతాయి. ఒక క్లాత్ లో మంచుముక్కలు ఉంచి ఆ క్లాత్ ను 15 నుండి 30 సెకెన్ల పాటు ముఖ చర్మం మీద ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మాన్ని బిగుతుగా చేయడం, చర్మ రంధ్రాలు మెల్లిగా తగ్గడం జరుగుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్..

నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్ ను సమాన భాగంలో తీసుకోవాలి. దీంట్లో కాటన్ బాల్ ముంచి ఈ ద్రావణాన్ని ముఖమంతా పట్టించాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత ముఖాన్ని కడిగేయాలి.  యాపిల్ సైడర్ వెనిగర్ లో  ఉండే అస్ట్రింజెంట్ గుణాలు చర్మ రంధ్రాలను బిగుతుగా చేయడంలో సహాయపడతాయి.

గుడ్డు తెల్ల సొన..

గుడ్డులో ఉండే తెల్లసొన చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. గుడ్డు తెల్ల సొనను చర్మానికి అప్లై చేసి 15నిమిషాల పాటు అలాగే ఉండాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. గుడ్డులోని తెల్లసొనలో ఉండే ప్రోటీన్లు చర్మాన్ని బిగుతుగా మార్చడంలో, రంధ్రాలను చిన్నగా చేయడంలో సహాయపడతాయి.

టమోటా  మాస్క్..

మిక్సీలో టమోటా వేసి  పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ వేయాలి. 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. టమోటాలో ఉండే సహజ ఆమ్లత్వం చర్మ రంధ్రాలను బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది.

బేకింగ్ సోడా స్క్రబ్..

కొద్దిగా బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి వృత్తాకారంగా చర్మం మీద స్క్రబ్ చేయాలి. ఆ తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. మృతకణాలను తొలగిస్తుంది.  మూసుకుపోయిన చర్మరంధ్రాలను క్లియర్ చేస్తుంది.

గ్రీన్ టీ..

గ్రీన్ టీ చర్మానికి చాలా మేలుచేస్తుంది. కాటన్ బాల్ ఉపయోగించి  గ్రీన్ టీని ముఖానికి అప్లై చెయ్యాలి. ఆ తరువాత 15 నిమిషాలు అలాగే ఉంచి   ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ రంధ్రాలను బిగించి జిడ్డును తగ్గించడంలో సహాయపడతాయి. రంధ్రాలను బిగుతు చేస్తాయి.

కలబంద..

స్వచ్చమైన కలబంద తెరుచుకున్న రంధ్రాలను తిరిగి సాధారణం చెయ్యడంలో సహాయపడుతుంది. కలబంద గుజ్జును అప్లై చేసి 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. కలబందలో ఉండే గుణాలు చర్మం రంగును మెరుగుపరుస్తాయి.  రంధ్రాలను బిగుతుగా ఉంచుతాయి.

                                                    *నిశ్శబ్ద.