వీపు భాగం నల్లగా.. ఎబ్బెట్టుగా ఉందా?? ఇలా చేస్తే నలుపు పోతుంది!
అందంగా కనిపించాలని కోరుకోకుండా ఎవరూ ఉండరు. ఖరీదైన జీవితం కలిగిన వారి నుండి, సాధారణ కుటుంబాల్లో అమ్మాయిల వరకు అందరూ అందంగా తయారవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇప్పటి ఫాషన్ ప్రపంచంలో సాధారణ అమ్మాయిలకు కూడా సరిపోయేలా తక్కువ ధరకు లభించేలా ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులో ఉంటున్నాయి. వీటిని వేసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అలాంటి డ్రెస్సులలో వీపు భాగం ఎక్పోజ్ అయ్యేవిధంగా ఉండే దుస్తులు ఉంటున్నాయి. చీరకట్టు మహిళలు వివిధ రకాల డిజైనింగ్ బ్లౌజులు వేసుకోవడం నుండి, ఎన్నో రకాల దుస్తులు ఇందులోకే వస్తాయి.
అయితే.. చాలామంది వీపు భాగం గురించి మొదటి నుండి అంత శ్రద్ధ పెట్టరు. ఈ కారణంగా వీపు భాగం చాలామందికి నల్లగా మారిపోయి ఉంటుంది. ఇలాంటి వారు ఫ్యాషన్ దుస్తులు వేసుకోవాలంటే కాస్త ఇబ్బంది పడతారు. వీపుకు ఉన్న నలుపు పోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి..
మన ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉండేవాటిలో నిమ్మకాయ కూడా ఒకటి. నోరు బాగలేనప్పుడు కాస్త పుల్లపుల్లగా బాగుంటుందని, నీరసం అనిపించినప్పుడు ఉత్సాహం ఇస్తుందని, వేసవి తాపాన్ని తగ్గిస్తుందని, పులిహోర కలుపుకోవాలని.. ఇలా కారణాలు ఏమైనా నిమ్మకాయను మనకు ఉన్న లింకు లంకె బిందె అంత పెద్దది. అలాంటి నిమ్మకాయను ఉపయోగించి వీపు భాగంలో నలుపును మాయం చేయొచ్చు.. పార్లర్ లలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకుని ట్రీట్మెంట్ కు ధీటుగా నిమ్మకాయంతో ఇంట్లోనే మ్యాజిక్ చేయచ్చు ఇలా..
నిమ్మకాయ, కలబంద
నిమ్మకాయ మరియు కలబందతో వీపు తెల్లబడటానికి మంచి చిట్కా ఉంది. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో రెండు నిమ్మకాయల రసాన్ని పిండాలి. దీని తర్వాత దానికి రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ కలపాలి. తాజా కలబంద ఉంటే అది ఉపయోగించవచ్చు. రెండింటినీ మిక్స్ చేసి వీపుపై బాగా మసాజ్ చేయాలి. కొంత సమయం తర్వాత కడిగేయాలి.
నిమ్మకాయ సెనగపిండి
సెనగపిండి మన వంటింట్లో ఎప్పుడూ ఉంటుంది. నిమ్మరసానికి దీన్ని జతచేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. ఇందుకోసం ఒక టేబుల్‌స్పూన్ శెనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పిండాలి. దానికి రెండు చెంచాల పెరుగు, ఒక చెంచా రోజ్ వాటర్ కలపండి. ఇప్పుడు వీపుపై అప్లై చేసి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. మెల్లిగా స్క్రబ్ చేస్తూ దీన్ని తొలగించాలి.
నిమ్మకాయ-ఎర్రకందిపప్పు
ఎర్రకందిపప్పును బ్యూటీ చిట్కాలలో బాగా వాడుతారు. దీన్ని నిమ్మకాయంతో కలిపి మంచి పలితాన్ని రాబట్టుకోవచ్చు. ముందుగా మూడు టేబుల్ స్పూన్ల ఎర్రకందిపప్పు పొడిని ఒక గిన్నెలో తీసుకోవాలి. దానికి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపండి. ఒక చిన్న చెంచా కలబంద, పెరుగు జోడించాలి. అన్నీ బాగా కలిపిన తర్వాత వీపుపై అప్లై చేసి బాగా ఆరనివ్వాలి. స్క్రబ్బింగ్ చేసిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
నిమ్మరసం-బియ్యం పిండి
బియ్యపు పిండిని వీపు శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు , ముందుగా ఒక గిన్నెలో బియ్యప్పిండిని తీసుకొని దానికి రెండు చెంచాల పెరుగు వేయండి. దానిపై నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ బియ్యం పిండి ప్యాక్‌ని వీపు భాగంలో అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కడిగేయాలి.
ఈ టిప్స్ పాటిస్తే వీపు భాగంలో ఉన్న నలుపు పోతుంది. కేవలం వీపు బాగంలోనే కాదు. మోచేతులు, మోకాళ్ళు, మెడ, పెదవుల చుట్టూ ఉన్న భాగం.. ఇలా అన్ని ప్రాంతాలలో వీటిని ఉపయోగించచ్చు.
◆నిశ్శబ్ద.