చిక్కులు పడే జుట్టుకు చక్కని పరిష్కారాలు!
అమ్మాయిలకు తమ జుట్టు అంటే చాలా ఇష్టం. పొడవాటి శిరోజాలు కావాలని అనుకోని మహిళ ఉండదు. అయితే జుట్టు ఆరోగ్యకరంగా పెరగడం, ఒత్తుగా, పట్టు కుచ్చులా ఉండటం చాలా కొద్దిమందిలోనే కనబడుతుంది. శారీరక అందాన్ని మరించ పెంచే అంశంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే జుట్టు సంరక్షణ విషయంలో దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. అయితే, చాలా తొందరగా చిక్కుబడే జుట్టుతో చెప్పలేనంత నరకం అనుభవిస్తుంటారు ఎంతోమంది. కొందరిలో చిక్కుబడిన జుట్టును విడదీయడం చాలా శ్రమతో కూడుకున్న పనిగా ఉంటుంది. అలాంటి జుట్టును సరిగ్గా చిక్కు తీయకపోతే, అది హెయిర్ డ్యామేజ్ కు, వెంట్రుకలు విరిగిపోవడానికి, జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది. అందువల్ల జుట్టుకు ఏమాత్రం హాని కలిగించకుండా చిక్కు తీయడం ఎంతో నేర్పుతో కూడుకున్నది. ఎక్కువ చిక్కుబడిపోయే జుట్టును తేలికగా ఆరోగ్యంగా చిక్కు తీయడానికి కొన్ని టిప్స్ ఇవే…
వెడల్పాటి పంటి దువ్వెన
ఎక్కువ హెయిర్ ఫాల్ లేకుండా సులువుగా చిక్కు తీయడానికి మొదటి మార్గం పర్ఫెక్ట్ దువ్వెన. వెడల్పాటి పళ్ళు కలిగిన దువ్వెన వాడి చిక్కును సులువుగా తీయవచ్చు.
చిక్కు మీద చమ్మక్:
లీవ్-ఇన్ కండీషనర్ లేదా డిటాంగ్లింగ్ స్ప్రే వంటి వాటిని ఉపయోగించడం వల్ల చిక్కుబడిన జుట్టును చాలా సులువుగా తీసేయచ్చు. వీటిని స్ప్రే చేసి పెద్ద పళ్ళ దువ్వెనతో దువ్వితే సరిపోతుంది.
వేళ్లను ఉపయోగించవచ్చు: దువ్వెన లేదా బ్రష్‌ని చిక్కు తీయడానికి ఉపయోగించే ముందు చిక్కుముడులను వేరు చేయడానికి జుట్టును చేతి వేళ్ళతో చిక్కులు విడదీయాలి.
పాయలుగా విడదీయడం: జుట్టు బాగా చిక్కులుగా ఉన్నప్పుడు దువ్వెనతో పట్టి లాగకుండా జుట్టును చిన్న పాయలుగా విడదీసి మెల్లిగా చిక్కు తీయాలి.
సున్నితంగా ఉండాలి: చిక్కులు విడదీసేటప్పుడు సున్నితంగా ఉండాలి. చిక్కు చాలా ఎక్కువ ఉందని, అది సులువుగా రావడం లేదని చిరాకు, కోపం అసహనంతో జుట్టును పట్టి లాగకూడదు.
చివర్ల నుండి చిట్కా:
జుట్టు చిక్కులు తీసేటపుడు పై నుండి కిందకు దువ్వకుండా మొదట జుట్టు కింద భాగం దువ్వి చిక్కులు తీసుకోవాలి. ఆ తరువాత పైన నుండి కిందకు దువ్వాలి
జుట్టు తడిగా చిక్కులు తీయొద్దు:
చాలామంది జుట్టు తడిగా ఉండగానే జుట్టు లాగడం, దువ్వడం చేస్తుంటారు. ఇది చిక్కులు ఎక్కువ కావడానికి కారణం అవుతుంది. అందుకే జుట్టు పూర్తిగా ఆరిన తరువాతే చిక్కులు తీయాలి.
మరొక విషయం ఏమిటంటే ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, కోపం చిరాకు అసహనం వంటివి ఉన్నా జుట్టు ఎక్కువగా చిక్కులు పడుతుంది. వీలైనవరకు ఇలాంటి వాటికి దూరంగా ఉండి ప్రశాంతగా ఉండటానికి ప్రయత్నించండి.
◆నిశ్శబ్ద.