మహిళలు సిజేరియన్ తరువాత ఇవి తింటే తొందరగా కోలుకుంటారు!


గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం ప్రతి మహిళ జీవితంలో చాలా అపురూపమైన విషయం. ఒకప్పుడు పూర్తీగా నార్మలో డెలివరీలు ఉండేవి. కానీ  నార్మల్ డెలివరీ ద్వారా బిడ్డను కనడానికి కష్టమైనప్పుడు వైద్యులు సిజేరియన్ చేసేవారు. ఇప్పుడైతే అసలు నార్మల్ డెలివరీలు తక్కువైపోయి సిజేరియన్  ఎక్కువైంది. నార్మల్ డెలివరీలో నొప్పులు భరించలేక కొందరు సిజేరియన్ చేయించుకుంటే.. అరుదైన తేదీలు, మంచి ముహూర్తాలు చూసి మరికొందరు సిజేరియన్ ద్వారా బిడ్డను కంటున్నారు. ఏది ఏమైనా సిజేరియన్ లు ఎక్కువైన ఈ కాలంలో మహిళలు సిజేరియన్ కుట్లు, శరీరంలో కలిగే ఇబ్బందుల నుండి తొందరగా కోలుకోవడానికి కొన్ని ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. బాలింతలు తప్పక తినాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకుంటే..

ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి. ప్రసవం తరువాత, కుట్ల కారణంగా బలహీనంగానూ, నొప్పులకు లోనైన కండరాలు త్వరగా కోలుకోవడానికి ప్రోటీన్ బాగా సహాయపడుతుంది.  బీన్స్, నట్స్, గుడ్లు ప్రోటన్ కోసం కొన్ని ఉదాహరణలు.

గర్భం మోయడమనే కారణంగా మహిళలలో ఎముకలు ఒత్తిడికి లోనై  ఉంటాయి. అందుకే కాల్షియం మెండుగా ఉన్న ఆహారాలు తీసుకుంటే ఎముకలు బలంగా మారతాయి. కాల్షియం బాగా అందడానికి కాల్షియం, పాలు, బాదం, గుడ్లు, పనీర్ తీసుకోవాలి.

సి సెక్షన్ అయినా, సాధారణ ప్రసవం అయినా బాలింతలు నీరు పుష్కలంగా తాగడం ఎంతో అవసరం. ఎందుకంటే తల్లిపాలు తగినంత ఉత్పత్తి కావాలంటే శరీరంలో తగినంత నీరు కూడా అవసరం. నీరు పుష్కలంగా తీసుకుంటే సి సెక్షన్ చేయించుకున్నవారు తొందరగా కోలుకునే అవకాశం ఉంది. శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో నీరు సహాయపడుతుంది.

ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. గర్బం మోసిన సమయంలోనూ, ప్రసవం తరువాత వచ్చే మలబద్దకం సమస్యను చెక్ పెట్టడానికి ఫైబర్ సహాయపడుతుంది.

ప్రసవం కారణంగా శరీరం కోల్పోయిన రక్తం తిరిగి ఉత్పత్తి కావడానికి ఐరన్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి. ఖర్జూరం, బీట్రూట్, అంజీర్, ఆకుకూరలు, మునగ ఆకు వంటి వాటిలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది.

ప్రసవం తరువాత పెద్దలు బాలింతలకు వెల్లుల్లి, సొంపు, దనియాలు వంటి వంటింటి  దినుసులను ఆహారంలో భాగం చేసేవారు. ఇవి పాల ఉత్పత్తిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీరం తొందరగా రికవరీ కావడానికి కూడా సహాయపడతాయి. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తాయి.

విటమిన్-ఎ శరీరంలో కణాలను రిపేరీ చేయడంలో సహాయపడుతుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. క్యారెట్, పాలు, ఆకుకూరలలో విటమిన్-ఎ పొందవచ్చు.

సిజేరియన్ చేయించుకున్న మహిళలలు తొందరగా కోలుకోవడానికి కాపర్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.  చేపలు, గింజలు, ఎర్ర కందిపప్పు, గోధుమలు, వాల్నట్స్, వేరుశనగలు  మొదలైనవాటిలో  కాపర్ సంపూర్ణంగా ఉంటుంది.

                                    *నిశ్శబ్ద