మానసిక సమస్యలకు చెక్ పెట్టాలంటే

 

 

ఒత్తిడి ..ఎంతటి వారిని అయినా చిత్తు చేసేస్తుంది . అందులోను మహిళల విషయం లో ఈ ఒత్తిడి మరింత ప్రభావాన్ని చూబిస్తుంది , ఎందుకంటే వారు ఎన్నో విధాలుగా నిత్యం ఒత్తిడికి గురి అవుతూనే వుంటారు , అందులోను , ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగినిలు కంటే గృహిణులు గా ఇంట్లో వుండే మహిళలలోనే ఒత్తిడి ఎక్కువ అట. సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలలో ఒత్తిడి ఎక్కువగా వుంటుంది అనుకుంటారు. కాని తాజాగా చేసిన ఒక అధ్యయనం లో ఇంటికే పరిమిత మయిన మహిళలలోనే  ఒత్తిడి ఎక్కువ అని తేలింది. హార్మోన్ల స్తాయి ని లెక్కించి వారి ఒత్తిడిని అంచనా వేసారు. చివరికి వారు తేల్చిన విషయం ఏంటంటే ఎవరయినా , ఎప్పుడు అయినా తను చేసే పనికి తగిన గుర్తింపు కావాలని కోరుకుంటారు.

ఉద్యోగినులకి అయితే శ్రమకి తగిన జీతం , పదోన్నతలు, ప్రశంసలు వంటివి వుంటాయి. కాని గృహిణులుగా ఎంత బాధ్యతతో వున్నా వారికి చిన్నపాటి గుర్తింపు కూడా ఉండదు. పైగా వారు చేసే పనిని కూడా ఎవరు కష్టమయినదిగా గుర్తించరు. దానితో పనికి గుర్తింపు లేకపోవటం అన్నది వారిని చాలా మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది అని తేలింది. పైగా ఉమ్మిడి కుటుంబాలలో ఉండే మహిళలలో ఈ ఒత్తిడి మరింత అధికంగా వుండటం గుర్తించారుట. చేసే పనికి చిన్నపాటి గుర్తింపు కుటుంబ సబ్యుల నుంచి దొరికితే వారిలో అసహనం, కోపం, వత్తిడి వంటివి తగ్గుతాయని , దానివలన ఇతర అనారోగ్యాలు కూడా తగ్గుతాయని వీరు గట్టిగా చెబుతున్నారు.

చిన్న పాటి ప్రశంస మహిళల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని అధ్యయనాలు చెబుతున్నా కూడా  , ఇప్పటికి ఆ ప్రశంస దొరకటం కష్టం గా వుంది అంటే ...ఆ సమస్యకి పరిష్కారం గట్టిగా ఆలోచించాల్సిందే. నిపుణులు ఈ విషయం లో మహిళలకి కొన్ని సూచనలు చేస్తున్నారు. అవి ఏంటంటే

1. మొదటిగా, మిమ్మల్ని మీరు ప్రేమించు కొండి
2. మీతో మీరు కొంత సమయం గడపండి
3. మీకోసం మీరు ఆలోచించటం మొదలు పెట్టండి

ఎప్పుడు అయితే మీ గురించి మీరు ఆలోచించటం మొదలు పెడతారో , ఆత్మవిశ్వాసం మీ స్వంతం అవుతుంది . అప్పుడు బయట వ్యక్తుల ప్రశంసల కోసం ఎదురు చూడరు . వారినుంచి ప్రశంస దొరికినా , లేకపోయినా కూడా ఆనందం గానే వుంటారు. ఈ చిన్న విషయాన్ని గమనిస్తే చాలు ...ఎన్నో మానసిక సమస్యలు కి చెక్ చెప్పినట్టేనట.