మహిళలలో వెజినల్ యాక్నే ఎందుకొస్తుంది? దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే!
చాలామంది మహిళలు బయటకు మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడే అంశం ప్రైవేట్ పార్ట్స్ గురించి. ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉన్నా, ఏవైనా ఇబ్బందులు తలెత్తినా చాలావరకు మౌనంగా భరించడానికే మొగ్గుచూపుతారు. సాధారణంగా చాలామంది మహిళలలో యోనికి సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో యోని ప్రాంతంలో మొటిమల్లాంటివి రావడం కూడా ఒకటి. అసలు యోని ప్రాంతంలో ఇలా యాక్నే లేదా మొటిమలు ఎందుకొస్తాయి. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? తెలుసుకుంటే..
వెజినల్ యాక్నే కు కారణాలు..
యోని ప్రాంతంలో కూడా సహంజంగానే వెంట్రుకల పెరుగుదల ఉంటుంది. ఈ వెంట్రుకల కుదుళ్లు ఆయిల్, డెడ్ స్కిన్ సెల్స్, బ్యాక్టీరియా తో నిండినప్పుడు సాధారణంగా ముఖం మీద వచ్చే ఎరుపు, వాపును పోలిన మొటిమల్లాంటి గడ్డలు వస్తాయి. ప్రైవేట్ పార్స్ట్ లో గాలి చాలా పరిమితంగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో అధిక తేమ కారణంగా ఆ ప్రాంతంలో వచ్చే మొటిమలు కూడా అంత తొందరగా తగ్గవు. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంటువ్యాధులు, వాపులు మొదలైన సమస్యలకు కారణం అవుతాయి. దీనికి మరొక కారణం. ఆ ప్రాంతంలో చెమట గ్రంధుల నుండి అధికంగా చెమట విడుదల కావడం. ఆ ప్రాంతంలో అవాంచిత రోమాలను తొలగించుకోవడానికి వ్యాక్సింగ్, షేవింగ్ వంటి ప్రక్రియలు ఎక్కువగా చేయడం కూడా దీనికి కారణం అవుతుంది.
ట్రీట్మెంట్ ఏంటంటే..
వెజినల్ ప్రాంతంలో మొటిమలు రావడం అనేది అమ్మాయిలను చాలా ఇబ్బంది పెట్టే అంశం. ఎక్కువ శాతం మంది ఈ సమస్య వచ్చినా బయటకు చెప్పుకోలేరు. కొన్ని రోజుల్లో అవే తగ్గిపోతాయని అనుకుంటూ వాటిని అలాగే భరిస్తారు. అయితే ఇవి తగ్గించుకోవడానికి, ఇకమీదట రాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. యోని ప్రాంతంలో తగినంత గాలి ఆడేలా కాస్త వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవాలి. బిగుతుగా ఉన్నవాటిని నివారించాలి. కాటన్ దుస్తులు అయితే మంచిది. ఆ ప్రాంతంలో ఎక్కువ తేమ ఉండకుండా జాగ్రత్త పడాలి. మొటిమలు వచ్చినప్పుడు వాటిని తగ్గించుకునే క్రమంలో సున్నితంగా వ్యవహరించాలి. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బు, మొటిమల నొప్పి నివారణకు వెచ్చని కంప్రెసర్ లు ఉపయోగించవచ్చు. ఈ మొటిమల ప్రభావం చాలా ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతుంటే మాత్రం చర్మ సంబంధ నిపుణులను కలవడం మంచిది.
ఇక అమ్మాయిలు ఆ ప్రాంతంలో అవాంచిత రోమాల తొలగించుకోవడానికి సేఫ్టీ పద్దతులు ఫాలో అవ్వాలి. ఆహారం విషయంలోనూ, అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొటిమలు వచ్చినప్పుడు అతి జాగ్రత్తతో మొటిమలను ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. శరీరంలో వేడి పెరగడం వల్ల కూడా ఆ ప్రాంతంలో మొటిమలు వస్తుంటాయి. కాబట్టి దీన్ని నిర్మూలించడానికి ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత లేకుండా జాగ్రత్త పడాలి.
*నిశ్శబ్ద.