చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకునో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. సలాడ్లకూ ఇవి మరింత రుచిని తెచ్చిపెడతాయి. కాబట్టి వీటిని వారానికి కనీసం రెండు సార్లయినా తినటం మేలు.
శరీరానికి కావల్సిన పోషకపదార్థాలను అందించడంలోనే కాదు వివిధ రకాలుగా శరీరంలో చేరిన విషపదార్థాలను తొలగించడంలో చిలుగడ దుంపలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎదిగే పిల్లలకు స్వీట్ పొటాటోను ఉడికించి తినిపించడం వల్ల శరీరంలో ఉన్న విషరసాయనాలు సులభంగా బయటకు పంపిస్తుంది. మరి పెద్దవారిలో ఈ స్వీట్ పొటాటో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి చూద్దాం..
1. విటమిన్ B6(గుండె ఆరోగ్యానికి): చిలగడదుంపల్లో విటమిన్ B6 దండిగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్ B6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి.
2. పొటాషియం(అధిక రక్తపోటు): ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తూ అధిక రక్తపోటును తగ్గించటంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది. చిలగడదుంపల్లో పొటాషియం మోతాదూ అధికంగానే ఉంటుంది.
3. విటమిన్ A(కళ్ళు ఆరోగ్యానికి): చిలగడదుంపల్లో విటమిన్ A లేదా బీటా కెరటిన్ ఎక్కువ. ఇది ఎండకు చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. చూపు తగ్గిపోకుండా చూస్తుంది.
4. విటమిన్ C (పళ్ళు మరియు గమ్స్ హెల్త్): వీటిల్లోని విటమిన్ C రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అంతే కాదు పళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది మరియు పళ్ళనుండి రక్తం కారడాన్ని అరికడుతుంది.
5. విటమిన్ E(చర్మ సౌందర్యానికి): విటమిన్ E మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది. వయస్సు మీద పడనియ్యకుండా చేసి, ముడతలను అడ్డుకుంటుంది.
6. పీచు(జీర్ణవ్యవస్థకు): బంగాళాదుంప, కందగడ్డల్లో కన్నా చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలోని షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.
7. మెగ్నీషియం(మధుమేహానికి): చిలగడదుంపల్లో దండిగా ఉండే సహజ చక్కెరలు రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. అందువల్ల రక్తంలో ఒకేసారి చక్కెర మోతాదు పెరగకుండా చూస్తాయి. ఇలా బరువు పెరగకుండా, నిస్సత్తువ రాకుండా కాపాడతాయి.
8. రోగనిరోధక శక్తి: శరీరంలోకి ఇన్‌ఫెక్షన్లు, వైరస్ వంటి క్రిములు ప్రవేశించకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్ A కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ A కొరవడితే ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు శరీరంపై దాడి చేసి అనారోగ్యం పాల్జేస్తాయి.
9. కేన్సర్: కేన్సర్ కణాలను అణచివేయడంలో కూడా విటమిన్ A చురుకైన పాత్ర పోషిస్తుంది.
10. మాంగనీసు(ఎముకల బలానికి): పిండి పదార్థాల జీవక్రియల్లో చాలా కీలమైన మాంగనీసు కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి. మ్యాంగనీస్ ఎముకల బలానికి బాగా సహాయపడుతుంది.
11. ఒత్తిడి తగ్గిస్తుంది: ఇందులో ఉండే పాంథోనిక్ యాసిడ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో ఉండి విటమిన్ B శరీరానికి కావల్సిన శక్తి సామార్థ్యాలను అంధిస్తుంది.
12. కండర పుష్టికి: శరీరానికి అవసరమయ్యే న్యూటియంట్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మజిల్ గ్రోత్ కు బాగా సహాయపడుతాయి. కాబట్టి ఈ రుచికరమైన, శక్తినందించే స్వీట్ పొటాటోను మీ డైలీ డయట్ లో చేర్చుకోండి.