మెనోపాజ్ తరువాత మహిళలలో దంతాలు ఊడిపోతుంటే ఈ వ్యాధి ఉండవచ్చు..!
రక్తం నుండి వ్యర్థాలను తొలగించడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉండటంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని ప్రమాదకరమైన పదార్థాలను సమర్థవంతంగా ఫిల్టర్ చేయడంలో వైఫల్యం అయితే అది తీవ్రమైన, ప్రాణాంతకమైన పరిస్థితులకు దారి తీస్తుంది. మహిళలలో మెనోపాజ్ తరువాత దంతాలు ఊడిపోవడం అనేది మహిళలలో మూత్రపిండాల సమస్యను కలిగి ఉండే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది నిజమేనా.. దీని వెనుక ఉన్న కారణాలేంటి? తెలుసుకుంటే..
మహిళలలో మెనోపాజ్ తరువాత మూత్రపిండాల పనితీరు క్రమంగా తగ్గుతుంది. మహిళలలో పునరుత్పత్తి హార్మోన్లు తగ్గడం వల్ల ఇది జరుగుతుంది. ఈ పునరుత్పత్తి హార్మోన్లు తగ్గడం వల్ల పొట్ట రావడం, ఊబకాయం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ దీర్ఘకాల మూత్ర పిండ వ్యాధికి కారకాలుగా మారుతాయని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ సమస్యలు ఎముక, గుండె సంబంధ సమస్యలతో పాటూ అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది.
మెనోపాజ్ తరువాత మహిళలలో దంతాలు ఊడిపోవడం అనేది నోటి ఆరోగ్యానికి కూడా ప్రధాన సంకేతం. మధుమేహం, థైరాయిడ్, బోలు ఎముకల వ్యాధి మొదలైన సమస్యలతో ఇవి ముడి పడి ఉంటాయి. ముఖ్యంగా 66 నుండి 79 సంవత్సరాల వయసు గల మహిళలలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు తెలుపుతున్నాయి. మహిళలలో ఖనిజాలు, ఎముక జీవక్రియ రుగ్మతలను నివారించడం దంతాల నష్టాన్ని నివారించడంలో కీలకంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెనోపాజ్ దాటిన మహిళలు నోటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెబుతున్నారు.
*రూపశ్రీ.