ఎంత మిత్రుడయినా ఇలాంటి విషయం ఏం చెప్పుకోగలడు? జ్యోతి ఇన్నాళ్ళకయినా కాస్త ధోరణి మార్చుకుని ప్రవర్తిస్తుందేమో అన్న అతని ఆశ అడియాస అయింది. పదిరోజులు కాదు. పదిహేనురోజులయినా తనే తగ్గి మాట్లాడాలికాని జ్యోతి పంతం వదలదని అతనికి తెలుస్తూంది.జ్యోతి గుండె రాతిగుండె. కరగదు- కట్టుకున్నందుకు తనే తగ్గి, పంతం వదలాలి. ఎన్ననుకున్నా జ్యోతి తన భార్య. ఎన్నాళ్ళు ఇలా ఎడమొహం, పెడమొహంతో వుండగలరు?
    కష్టమో నిష్టూరమో ఆమెతో కాపురం చెయ్యకా తప్పదు. ఇవాళ ఇలా సినిమాకి తనని తీసుకురాకుండా రాకపోవాల్సింది. జ్యోతికి సినిమాఅంటే పిచ్చి, పిలవలేదని కోపం వచ్చివుంటుంది. సుబ్బారావు మనసు కరగసాగింది. మెత్తబడ్డాడు. యిలా యిలా జ్యోతితో ఎడంగా వుండలేక పోతున్నాడు. సుబ్బారావు మగవాడు. కొత్త భార్యని యింట్లో వుంచుకుని బ్రహ్మచర్యం పాటించడం కష్టంగా వుంది. అయినా జ్యోతిని కాస్త భయపెట్టి లొంగదీసుకోవాలనీ, కఠినంగా వుండి ఆమెని మార్చాలని తనని తాను అదుపులో పెట్టుకున్నాడు గత పదిహేనురోజులుగా - ఈరోజు సినిమా చూస్తుంటే అందులోనూ హీరో హీరోయిన్ ప్రణయ కలహం, ఆ తరువాత ఇద్దరూ రాజీకివచ్చి ఒకరి కౌగిలిలో ఒకరు వదిగిపోవడం చూడగానే సుబ్బారావు చలించాడు ఆ తరువాత సినిమా కూడా చూడాలనిపించలేదు. వెళ్ళిపోదాంమంటే మురారి ఏమంటాడోనని అలా కూర్చున్నాడు.
    పిక్చరు అయ్యాక సుబ్బారావు ఇంట్లో డ్రాప్ చేశాడు మురారి. ఇంటికి వెడుతూ- జ్యోతి ఉద్యోగం చూసిపెట్టమని అడిగిన సంగతి సుబ్బారావుతో చెప్పడమో, మానడమో అతనికి అర్థంకాలేదు. చెప్పద్దని జ్యోతి ఒట్టువేసింది. చెప్పకపోతే సుబ్బారావు తరువాత ఏం అంటాడో! అయినా జ్యోతి ఏదో కోపంతో, ఆవేశంతో అన్నట్టు కనిపిస్తుంది. మరోసారి అడిగితే చూడొచ్చు, భార్యాభర్తల దెబ్బలాటలు ఎన్ని రోజులుంటాయి? ఆలోచించి జ్యోతి మరోసారి అడిగినప్పుడు ఉద్యోగం విషయం ఆలోచించవచ్చని నిర్ణయించుకున్నాడు మురారి.
                                  *        *       *      *
    జ్యోతితో రాజీకి రావాలని, ఇంక విరహం భరించలేక సుబ్బారావు నిర్ణయించుకుని ఇంట్లోకి అడుగుపెట్టాడు.
    సుబ్బారావు ఇంటికి వచ్చేసరికి జ్యోతి ముసుగుతన్ని పడుకుంది. సుబ్బారావు రాగానే విసురుగా తలుపుతీసి గబగబా వంటింట్లోకి వెళ్ళి కంచంపెట్టి వడ్డించి, అన్ని గిన్నెలు దగ్గిర పెట్టి వచ్చి మళ్ళీ ముసుగు బిగించింది.
    సుబ్బారావు అంతా చూస్తూనే వున్నాడు. ఏమన్నా అని మళ్ళీ జ్యోతిని రెచ్చగొట్టడం ఇష్టంలేక మాట్లాడకుండా భోంచేసి తలుపువేసి వచ్చాడు.
    నెమ్మదిగా జ్యోతి మంచంమీద కూర్చుని "జ్యోతీ" అన్నాడు మృదువుగాఆమెమీద చెయ్యివేసి. జ్యోతి ఒక్క తోపు తోసి విదిలించింది.
    సుబ్బారావు నవ్వాడు.
    "ఇంకా కోపం పోలేదా? పదిహేనురోజులు అయింది" అన్నాడు ఆమె మీదకి వరిగి.
    జ్యోతి మరోసారి విదిలించింది. కాని సుబ్బారావు గట్టిగా ఆమె చెయ్యి పట్టుకుకుని-
    జ్యోతి! ఇలా మనం దెబ్బలాడుకోవటంవల్ల మనసులు పాడవడం మినహా ఏం ప్రయోజనం లేదు. హాయిగా ఆనందంగా వుండాల్సిన సమయం అంతా వృధాచేస్తున్నావు. ఏది ఇటు చూడు" అన్నాడు లాలనగా.
    జ్యోతి విసురుగా తలెత్తి తీక్షణంగా చూసింది.
    "మీరు వెళ్ళండిక్కడనించి. ముందు నన్ను వదలండి. నన్ను ముట్టుకోవద్దు" కఠినంగా ఆజ్ఞాపిస్తున్నట్లుంది.
    "ఊహు- వదలను. ఎందుకంత కోపం? ఏదో అయిపోయింది. ఇద్దరికిద్దరం ఏదో అన్నాం, అనుకున్నాం. జరిగినవి మరిచిపో. ఇంత కోపం వద్దు జ్యోతీ" సుబ్బారావు ఆమెను కౌగిలిలోకి లాక్కుంటూ అన్నాడు.
    జ్యోతి ఒక్క ఉదుటున అతన్ని తోసి పక్క దిగిపోయింది.
    "....మీకు సిగ్గులేకపోయినా నాకుంది. నన్ను అన్ని మాటలు అనికొట్టారు. అవన్నీ మరిచిపోతానా?
    ఇవాళ.... ఇవాళ నన్ను పిలవనైనా పిలవకుండా సినిమాకి వెళ్ళిపోయారు. ఇదంతా మరిచిపోతాననుకున్నారా ఏం? నేను ఇప్పుడు గుర్తువచ్చానా?
    వెళ్ళండిక్కడనుంచి, పౌరుషంవుంటే నన్ను ముట్టుకోకుండా వుండండి. మీకు కాకపోయినా నాకు అభిమానం, సిగ్గు వున్నాయి. నన్ను ఇలా ట్రీట్ చేసిన మిమ్మల్ని -మిమ్మల్ని ఐహేట్ యూ - ఎగసిపడుతున్న గుండెలతో ఆవేశంగా అంది జ్యోతి.
    సుబ్బారావు ముఖం నల్లబడింది.
    "జ్యోతీ!...." అన్నాడు కోపంగా. అంత పౌరుషంగా జ్యోతి మాట్లాడేసరికి అతని పురుషాహంకారం దెబ్బతింది.
    "ఏం? అరుస్తే నాకేం భయంలేదు. ఏం చేస్తారో చెయ్యండి. మిమ్మల్ని పెళ్ళాడినపుడే నా బతుకు నాశనం అయింది. ఇంక కొత్తగా నష్టపోవడానికి ఏమీలేదు. ఖర్మకొద్దీ మీ పాలపడినపుడే నా ఆశలు, ఆనందాలు పోయాయి.
    ఇంక ఈ జన్మంతా ఇలాగే వుంటాను. వంటింట్లోనే పడి ఏడుస్తాను. నాకింత తిండి పడేస్తున్నారనికదూ? మీరింత ఆధికారం చెలాయించారు నామీద? మీరు పడేసే తిండి ఆమాత్రం నేనెక్కడయినా సంపాదించుకోగలను అన్నది గుర్తించండి.
    ఇంకా అన్నిమాటలు అన్నా మీ ఇంట్లో గతిలేక పడున్నాననికదూ అంత అలుసు అయిపోయాను? గతిలేక కాదు. ఏదో లోకంకోసం సహిస్తూన్నాను."
    అర్థం పర్థం లేకుండా ఒకదానికొకటి పొంతనలేకుండా నోటికేదివస్తే అది మాట్లాడుతున్న జ్యోతిని చూసి కోపంకంటే ఆశ్చర్యం ఎక్కువ వచ్చింది సుబ్బారావుకి.
    "జ్యోతీ!" కోపం వస్తున్నా అణచుకొని "ఏమిటా మాటలు? ఏదో కోపంతో అన్నాను. అయిపోయిందానికి ఎందుకు గొడవ? పోనీ తప్పు నాదే. క్షమించు" అన్నాడు.