ఈ అలవాట్లు ఆపకపోతే చిన్న వయసులోనే ముఖం ముసలి వాళ్లలా మారుతుంది..!

అందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా.. ఎక్కువకాలం బ్రతకాలని అందరి డ్రీమ్. కానీ నేటి కాలంలో చాలా రకాలుగా సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే వృద్దాప్యం కనిపించడం చాలా మందిని కలతకు గురి చేస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, చర్మం ముడతలు పడటం చూస్తూ ఉంటాం. ఇలాంటి వారు చాలా ఆత్మన్యూనతా భావం కు లోనవుతారు. కానీ చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు, గీతలతో ఇబ్బంది పడుతున్న వారు నేటి కాలంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీటిని తగ్గించుకోవడానికి చాలా రకాల మార్కెట్ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ ఫలితం అంతగా ఉండదు. ఇలా చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు, గీతలు రావడం రూజువారి చేసే కొమమ్ తప్పుల వల్ల జరుగుతుందట. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటి? వాటి వల్ల చర్మం ఎందుకు తొందరగా వృద్దాప్యానికి గురి అవుతుంది. తెలుసుకుంటే..
చర్మం తొందరగా ఎందుకు వృద్దాప్యానికి గురవుతుంది?
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40% మంది యువకులు ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడం వల్ల ముడతలు, బలహీనత వంటి ఏర్పడి తొందరగా ముసలి వాళ్లలా కనిపిస్తుంటారు. ఎక్కువ చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీర కణాలలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల చర్మం ముడుచుకుపోతుంది. చిన్న వయసులోనే వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి .
చిన్న వయసులోనే వృద్దాప్యం కనిపించడానికి కారణమయ్యే అలవాట్లు..
నిద్ర..
ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి నిద్ర చాలా అవసరం. కానీ నేటి వేగవంతమైన జీవితాల్లో మంచి నిద్ర కరువవుతోంది. ప్రతి రాత్రి కనీసం 7 నుండి 9 గంటల గాఢ నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఈ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మ కణాలు దెబ్బతింటాయి, దీని వలన ముఖంపై ముడతలు త్వరగా కనిపిస్తాయి.
ఆహారం..
ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. జంక్ ఫుడ్, చక్కెర ఆహారాలు చాలా హానికరమైన ఆహారాల లిస్ట్ లో ఉన్నాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్వీట్లను అధికంగా తీసుకోవడం వల్ల శరీర కణాలలో గ్లైకేషన్ అనే ప్రక్రియ పెరుగుతుంది. ఈ ప్రక్రియ చర్మం పొడిబారడానికి కారణమవుతుంది, ముడతలు కనిపించడానికి దారితీస్తుంది.
శ్రమ..
నేటి జీవనశైలిలో శారీరకంగా కష్టపడే పనులు ఏమీ లేవు. కేవలం కూర్చుని చేసే ఉద్యోగాలే ఉన్నాయి. వీటి వల్ల మానసికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల కండరాలు బలహీనం అయ్యి అది చిన్న వయసులోనే ముసలితనానికి దారి తీస్తుంది.
ఒత్తిడి..
ఒత్తిడి నేటి కాలంలో చాలామంది ఎదుర్కునే పరిస్థితి. అయితే ఎక్కువ ఒత్తిడికి గురైతే శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతంది. ఇది చర్మాన్ని ముడతలు పడేలా చేయడం, చర్మం మీద గీతలు రావడం వంటి సమస్యలకు కారణమై చిన్న వయసులోనే ముసలి వాళ్లలా కనబడటానికి కారణం అవుతుంది.
పైన చెప్పుకున్న అలవాట్లను మెల్లిగా మానేయడం వల్ల చిన్న వయసులోనే వృద్దాప్య సమస్యను అధిగమించవచ్చు.
*రూపశ్రీ.


.webp)
