మహిళలు భర్తల కోసం చేయకూడని పనులు

ఈ ప్రపంచంలో అతి గొప్ప బంధం వివాహబంధమే. మధ్యలో ముడిపడే ఈ బంధం జీవితం చివరికంటా తోడుగా ఉంటుంది. అంతేనా.. జీవితంలో దైర్యం, నమ్మకం, జీవితం మీద ఆశ కలిగించేది ఈ బంధమే. చాలావరకు వివాహ బంధంలో మహిళలు చాలా మారిపోతారు. వస్త్రాధారణ నుండి ఆహారపు అలవాట్ల వరకు ఎన్నో విషయాలలో మారతారు. కొత్తగా పెళ్ళయ్యాక భార్యలు భర్తలను ఇంప్రెస్ చేయడానికి వారికి నచ్చినట్టు మారతారు. భర్తలు కూడా భార్యలను సంతోషపెట్టడానికి ఎన్నెన్నో చేస్తారు. అయితే మొత్తం మీద చెప్పుకుంటే భర్తల కోసం మారిపోయే మహిళలే ఎక్కువ. అదంతా ప్రేమ అని అనుకుంటారు. కానీ భర్తల మీద ఎంత ప్రేమ ఉన్నా సరే కొన్ని పనులు అస్సలు చేయకూడదు. కొన్ని ఇష్టాలు మార్చుకోకూడదు. ఇలా చేస్తే మొదట్లో వారికోసం అంటూ చేసిన పనులు ఆ తరువాత మహిళల జీవితాలకే పెద్ద సమస్యలుగా మారతాయట. అసలు మార్చుకోకూడనివి ఏంటి? చేయకూడనివి ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..

నియంత్రణకు లోను కావొద్దు..

పెళ్ళైన కొత్తలో అమ్మాయిలు భర్తలకు నచ్చినట్టు ఉండటానికి ఇష్టపడతారు. అయితే ఇందులో భాగంగా భర్త ఆ పనులు చేయకు, ఈ పనులు చేయకు, ఆ దుస్తులు వేసుకోకు, ఆ తిండి తినకు, వారితో మాట్లాడకు అలా ఉండకు, ఇలా ఉండకు అని చెబుతూ ఉంటాడు. అవన్నీ వినకపోతే భార్యకు భర్తమీద గౌరవం లేదని, ప్రేమ లేదని అనుకుంటారేమోననే సంకోచంతో మహిళలు ఈ మాటలను గౌరవిస్తారు. ఫలితంగా భర్త చెప్పినట్టు చేస్తారు. మొదట్లో భార్యలు గౌరవం అనుకున్నది కాస్తా ఆ తరువాత ఇబ్బందిగా మారుతుంది. భర్త పూర్తీ భార్య జీవితాన్ని నియంత్రించే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. భర్తకు, అతని ఇంటికి ఎలాంటి ఇబ్బంది కలగనంతవరకు భార్యలు చేసే పని ఏదైనా మానుకోవాల్సిన పని లేదు.

తిట్టడం, చెయ్యిచేసుకునే అలుసు ఇవ్వద్దు..

భార్యలు అంటే భర్త దగ్గర మాటలు పడటానికి, వారి చేతిలో దెబ్బలు తినడానికి దొరికిన ఆప్షన్ కాదు. చాలామంది భర్తలు వారి మానసిన అసంతృప్తిని, ఇతరుల మీద కోపాన్ని భార్యలపైన చూపిస్తుంటారు. తిట్టడం, చెయ్యిచేసుకోవడం మొదలైన విషయాలకు వారికి అవకాశం ఇవ్వద్దు. అదేవిధంగా మహిళలు తమకు ఇష్టం లేకుండా పడక గది కార్యాకలాపాలలో పాల్గొనద్దు. ఇది ఒకసారి  అలవాటైతే జీవితాంతం మహిళలకు ఇష్టం లేని సమయంలో భర్తల చేతుల్లో సెక్స్ డాల్స్ గా మారే ప్రమాదం ఉంది.

దూరంగా ఉండకండి..

చాలామంది మహిళలకు తమ భర్తలు పనిచేసే ఆఫీసు, అతని కొలీగ్స్, అతని స్నేహితులు వంటి విషయాల గురించి పెద్దగా తెలియదు. ఒకవేళ మహిళలు  అడిగినా నీకెందుకు ? అని దబాయించే మగవారుంటారు. కానీ మగవారి స్నేహితులు, ఆఫీసులు కొలీగ్స్, ఇతర పరిచయస్తుల నుండి దూరంగా ఉండద్దు. భర్త మీద అనుమానం కాదు, అతనికి తెలిసిన వారితో టచ్ లో ఉండటం వల్ల కొన్నిసార్లు  కొన్ని పనులు, ఇబ్బందులు చాలా సులువుగా పరిష్కరించుకోవచ్చు.

ఇష్టాల్ని మార్చుకోకండి..

భర్తలు భార్యల మీద కొన్ని విషయాల్లో ఒత్తిడి తెస్తారు. వీటలో ముఖ్యమైనది శరీరానికి సంబంధించినవే. వాళ్లకు నచ్చని దుస్తులు వేసుకుంటే ఎగతాళి చేయడం, వారికి  నచ్చని ఆహారం తింటే లావైపోయావనో, మరే ఇతర కారణంతోనో బాడీ షేమింగ్ చేయడం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా నా పెళ్లాం నేను చెప్పినట్టు వింటుందనో, అతనొక హిట్లర్ మొగుడిలా బంధువులు, స్నేహితుల ముందు బిల్డప్ ఇవ్వడానికో భార్య మీద అజమాయిషీ చేస్తుంటారు. ఇలాంటి వాటికి అస్సలు ఆస్కారం ఇవ్వకండి.

భార్యల్ని ఇష్టపడే భర్తలు ఎప్పుడూ తమ భార్యలను నియంత్రించాలని కోరుకోరు. మరీ ముఖ్యంగా భార్య ఇష్టాలను, కోరికలను గౌరవిస్తారు. ఎవరిముందూ కించపరచరు. తమకోసం ఏమీ మారక్కర్లేదనే విషయాన్ని ప్రవర్తనలోనే స్పష్టం చేస్తారు. భార్యలు పూర్తీగా భర్తలకు అనుకూలంగా మారిపోతే భార్యలకంటూ ఎలాంటి విలువా ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి.

                                                         *నిశ్శబ్ద.