ఆమె ప్రశ్నలు భయపెట్టాయి!

‘నాకు ISIS నుంచి చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయి. అయినా మరేం ఫర్వాలేదు. వాళ్ల కింద అవమానంతో బతికేకంటే, గౌరవంగా ప్రాణాలని అర్పించడం మేలు!’ తన చివరిరోజుల్లో రఖియా హసన్‌ అన్న మాటలివి. ఆ తరువాత కొద్ది రోజులకే ఆమె మాటలు నిజమయ్యాయి. గత ఏడాది జులై నుంచే ఆమె కనిపించకుండా పోయినా, ఆమెను తామే చంపేశామని ISIS ప్రకటించింది. రఖియాను చంపేందుకు ISIS ఏ ఆరోపణ అయినా చేసి ఉండవచ్చు కాక. కానీ అసలు కారణం మాత్రం- రఖిమా వారి అణచివేతను ప్రశ్నించడమే!

రఖియా కుటుంబం చిన్నప్పటి నుంచి సిరియాలోని రఖా అనే నగరంలో ఉంటోంది. సిరియా అంటే అలాంటి ఇలాంటి దేశం కాదు. ప్రపంచంలోని నాగరికతల్లో ఒకటైన అసీరియన్‌ నాగరికతకు పురిటిగడ్డ. ఒకప్పుడు అది భూతల స్వర్గం. ఛాందసభావాలకు దూరంగా ఉండే ప్రదేశం. అలాంటి స్వేచ్ఛా ప్రపంచంలో రఖియా కావల్సినంత చదువుకుంది. ప్రతిష్టాత్మకమైన ‘అలెప్పో విశ్వవిద్యాలయం’ నుంచి తత్వశాస్త్రంలో పట్టాను సైతం తీసుకుంది. కానీ 20వ శతాబ్దంలోకి అడుగుపెడుతూనే ఆ దేశంలోకి తీవ్రవాదమూ ప్రవేశించింది. రాజకీయంగా అనిశ్చితంగా ఉన్న పరిస్థితులు, ఇతర దేశాల జోక్యంతో కలుపుమొక్కలాంటి తీవ్రవాదం కాస్తా కోటగోడలా మారిపోయింది.

తీవ్రవాదం ఏదో ఒక మతం పేరుతో ప్రాంతం పేరునో మనగలవచ్చు. కానీ దానికుండే లక్షణం హింస, అణచివేత. ఆ హింసను సిరియా ప్రజలు మౌనంగా భరించారు. ఆ అణచివేత కింద నలుగుతూనే తమ జీవితాలను కొనసాగించారు. అదేమిటని గొంతు పెగిల్చినవారి నోట మాట రాక ముందే, ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎవరో కొద్ది మంది మాత్రం ప్రశ్న మీద ప్రశ్నను సంధిస్తూనే ఉన్నారు. తీవ్రవాదంలో ఉన్న అమానుషానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. వారితో చేతులు కలిపారు ‘రఖియా హసన్‌’. సోషల్‌ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని ఆమె స్వేచ్ఛగా వెల్లడించేవారు.


నిసాన్‌ ఇబ్రహీం పేరుతో రఖియా తీవ్రవాదాన్ని నిర్దాక్షిణ్యంగా విమర్శించేవారు. నగరం మీదకి యుద్ధమేఘాలు కమ్ముకుంటే ‘భగవంతుడా! మా పౌరులను రక్షించు. ఆ మిగతా వారిని పైకి తీసుకుపో’ అంటూ గేలిచేశారు. రఖియా సోషల్‌ మీడియా ద్వారా తన చిన్ననాటి రోజులని తల్చుకునేవారు. తమ కలల సామ్రాజ్యం ఎలా కూలిపోతోందో గుర్తుకి తెచ్చుకునేవారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా ఆమె చేసిన ఇలాంటి పోస్టులన్నీ ఏదో ఒక కోణంలో సిరియా ప్రజల దీనావస్థ గురించి ప్రపంచానికి తెలియచేసేవి. కేవలం తన అభిప్రాయాలు మాత్రమే కాదు, సిరియా దేశంలో రోజూ జరిగే సంఘటనలని సోషల్ మీడియా ద్వారా లోకానికి తెలియచేసేది రఖియా. పత్రికా స్వేచ్ఛ అన్నది ఏమాత్రం లేని ఆ దేశంలో ఆమెలాంటి వారు అందించే వార్తల వల్లే సిరియా గురించి ఇతరులకి తెలిసేది. ఆ రకంగా ఆమె ఓ రచయిత్రి మాత్రమే కాదు, గొప్ప జర్నలిస్టు కూడా!

రఖియాకి తను ఎలాంటివారితో తలపడుతున్నానో తెలుసు. అమెరికా వంటి అగ్రరాజ్యాలకి సైతం చెమటలు పట్టిస్తున్న ISIS (Islamic State of Iraq and Syria)నే తాను రెచ్చగొడుతున్నానని ఆమెకు తెలుసు. కానీ బానిసలా బతకడం కంటే స్వేచ్ఛగా ప్రశ్నించే హక్కునే ఆమె ఎంచుకుంది. ప్రశ్నించడంలో ఉన్న ప్రమాదాన్ని సంతోషంగా స్వీకరించింది. ISIS చేతిలో హతమైన తొలి మహిళా జర్నలిస్టుగా రఖియా చరిత్రలో ఆగిపోయి ఉండవచ్చు. కానీ ఆమె అందించిన స్ఫూర్తిని కొనసాగించేందుకు ఎందరో రఖియాలు ఈపాటికే సిద్ధమైపోయి ఉంటారు. ఏదో ఒకరోజు వారి ప్రశ్నలకు ISIS జవాబు చెప్పక తప్పదు. ప్రజల జీవితాల్లోంచి తప్పుకోకా తప్పదు!

- నిర్జర.