ఇంట్లోనే నూనెను ఇలా తయారుచేసి వాడితే పొడవాటి జుట్టు మీ సొంతం!
జుట్టు పొడవుగా, మందంగా, ఆరోగ్యంగా పెరగాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ ఇప్పటి జీవనశైలి వల్ల పొడవాటి జుట్టు చాలామందికి కలగానే మిగిలిపోతోంది. చిన్నతనంలో ఒత్తుగా, పొడవుగా జుట్టు ఉన్నవాళ్లు పెద్దయ్యాక తమ జుట్టు ఎందుకు అంత పలుచగా, ఎదుగుదల లేకుండా మారిపోతోందో తెలియక తికమక పడుతుంటారు. జుట్టు పెరుగుదల కోసం బోలెడు రకాల నూనెలు కూడా వాడుతుంటారు. కానీ జుట్టు పెరుగుదలకు ఇంట్లోనే ఈజీగా నూనె తయారుచేసుకుని వాడచ్చు. ఈ నూనెను వాడితే జుట్టు నల్లగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగడం ఖాయం.
నువ్వుల నూనె ఆయుర్వేదంలో చాలా విధాలుగా ఉపయోగిస్తారు. చాలా రకాల ఆయుర్వేద నూనెల తయారీలో నువ్వుల నూనెకు ప్రాధాన్యత ఉంది. నువ్వుల నూనె, మెంతి గింజలు కలిపి వాడటం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. దీని కోసం నూనెను ఎలా తయారుచేయాలంటే..
నువ్వుల నూనెను, మెంతి గింజలను సమాన పరిమాణంలో తీసుకోవాలి. ఈ రెండింటిని ఒక ఇనుప కడాయిలో వేసి సన్నని మంట మీద ఉడికించాలి. దీన్ని కనీసం 5 నుండి 10 నిమిషాలు ఉడికిన తరువాత స్టౌ ఆఫ్ చేయాలి. నూనె చల్లబడిన తరువాత వడగట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ నూనెను తలస్నానం చెయ్యడానికి గంట ముందు తలకు అప్లై చెయ్యాలి. గంట తరువాత గాఢత లేని షాంపూ లేదా కుంకుడు కాయ రసంతో స్నానం చెయ్యాలి. ఇది జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. తెల్లజుట్టు రాకుండా చేస్తుంది. జుట్టు పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది. దీన్ని వారంలో 2 నుండి 3 సార్లు అప్లై చేయవచ్చు.
నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, కాల్షియం, ప్రొటీన్లు మంచి మొత్తంలో ఉంటాయి. ఈ నూనె నుండి అమైనో ఆమ్లాలు, విటమిన్లు B, E, K కూడా లభిస్తాయి. నువ్వుల నూనెను ఆయుర్వేద ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ నూనెను ఉపయోగించడం వల్ల సెల్ డ్యామేజ్ తగ్గుతుంది, జుట్టు రాలడం ఆగిపోతుంది, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది, స్కాల్ప్‌కు హైడ్రేషన్ అందిస్తుంది, ఈ నూనె ప్రభావం సూర్యుడి హానికరమైన కిరణాల నుండి జుట్టును రక్షించడంలో పనిచేస్తుంది. ఇది చుండ్రు సమస్యను తొలగిస్తుంది.
మెంతి గింజలు జుట్టుకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మెంతి గింజలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి, జుట్టు మందాన్ని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ గింజల్లో ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. జుట్టుకు మేలు చేసే అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. హెయిర్ ఫాల్ అరికట్టడం, జుట్టు పెరుగుదలను పెంచడమే కాకుండా, మెంతి గింజలను తలపై అప్లై చేయడం వల్ల జుట్టు తొందరగా నెరసిపోయే అవకాశాలను తగ్గిస్తుంది. మెంతి గింజలు స్కాల్ప్ నుండి చుండ్రును తొలగించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
*రూపశ్రీ.