అమ్మ అన్నదీ ఒక కమ్మని మాట

అమ్మ గురించి రాయాలి... అసలు ‘అమ్మ’ అనే పదం అంటేనే ఒక మధుర కావ్యం కదా... అమ్మ గురించి రాయాలంటే నాకు ధైర్యం చాలటం లేదు... కేవలం రెండు పేజీల్లో తన గురించి ఏం రాయగలను అని...

మా అమ్మ ఒక చరిత్ర... మా అమ్మ ఒక ప్రకృతి... మా అమ్మ ఒక శ్రమ... మా అమ్మ ఒక త్యాగం... అమ్మ గురించి తలచుకుంటే నా మనసు విషాదమయం అయిపోతుంది. అప్పుడే పన్నెండేళ్ళు అవుతోంది తాను వెళ్ళిపోయి, మా మనసులో దివ్వెగా మిగిలిపోయి...

అమ్మ పేరు శ్రీమతి యాళ్ళ కమలమ్మ. బాధ్యతల కత్తి అంచు మీద నిలబెట్టి అమ్మను అర్థాంతరంగా వదిలేసి వెళ్ళిపోయారు నాన్న... అసలు అమ్మే ఒక పసిపాప... అందుకే తనని ఆ దుఃఖం లోంచి బయటకు లాగటానికి మాకు  మేమే పెద్దవాళ్ళం అయి నడుము కట్టాం... మా బాధను దిగమింగి, తనని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నించే వాళ్ళం...మా బాధ్యతలు మేమే నేరవేర్చుకున్నాము, అక్కా బావల సహకారంతో...వారి అండ దండలతో...

అక్షరాలు తెలియని అమ్మ చదువుకోవాలని ఎంతో తాపత్రయ పడింది... మేము నేర్పితే అన్ని అక్షరాలూ, తన సంతకం తెలుగులో నేర్చుకుని ఆనందపడిపోయింది... కాని చదవటం తనకి చేతకాలేదు. సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ఏ పత్రిక కనపడినా చేతిలోకి తీసుకొని పేజీలు  అన్నీ తిరగేసి, బొమ్మలు చూసి ఆనందపడి పోయేది. అందులో ఉన్న కథలు ఏమిటో చెప్పమని అడిగేది. అందుకే నేనూ, తమ్ముడూ అమ్మకి కథలను చదివి వినిపించే వాళ్ళం. మంచి కథలను విని ఎంతో ఆనందించేది అమ్మ. నేను రాసిన కథలను కూడా చదివించుకొని ఎంతో సంబరపడిపోయేది.  అమ్మ సంతోషం కోసమైనా బాగా మంచి కథలు రాసి పేరు తెచ్చుకోవాలి అనుకునేదాన్ని. ఇప్పుడు కథలు ఎక్కువే రాసాను. తమ్ముడు కూడా రాస్తున్నాడు. కాని చూసి ఆనందించటానికి అమ్మ లేదు నా దగ్గర.

అమ్మకు అక్షరజ్ఞానం లేకపోయినా లోకజ్ఞానం (జనరల్ నాలెడ్జ్) బాగానే ఉంది... అందుకు కారణం రేడియో. ఉదయం భక్తిరంజని మొదలు రాత్రి జైహింద్ వరకూ రేడియో మ్రోగాల్సిందే. అన్ని తెలుగు కార్యక్రమాలు చాలా ఆసక్తి కరంగా వినేది. ముఖ్యంగా స్త్రీల కార్యక్రమాలు, రేడియో నాటకాలు అంటే ఆమెకు పిచ్చి ఇష్టం. తెర మీద సినిమాల కన్నా, ఇంట్లో రేడియోనే ఎక్కువ ఇష్టపడేది ఆవిడ.

చిన్నప్పటినుంచీ చాలా గారాబంగా చూసుకుంది అమ్మ పిల్లలందరినీ. ఎవ్వరినీ నొప్పించేది కాదు. ఎవ్వరికీ పనులూ చెప్పేది కాదు. ఇంటెడు చాకిరీ తాను ఒక్కతే చేసుకునేది. పిల్లలకి పని చెబితే నాన్న ఒప్పుకునే వారు కాదు. ‘వాళ్ళు చదువుకోవాలి, పన్లు చెప్పవద్దు...’ అనే వారాయన. ఆయన మద్దతు చూసుకుని మేమూ ఏమీ చేసే వాళ్ళమే కాదు. ఇప్పుడు బాధగా ఉంది... మళ్ళీ బాల్యం తిరిగి వస్తే, అమ్మకి చాలా సహాయం చేసే అవకాశం వస్తుంది కదాని.

నాకు పెళ్లి అయిన సంవత్సరం వరకూ నాకు విశాఖపట్నం నుంచి  హైదరాబాదు [మావారు ఉన్న చోటు] కి బదిలీ కాలేదు. ఈలోగా డెలివరీ టైం. అసలు ‘బిడ్డ పుట్టే వరకూ నిన్ను ఒక్కసారి కూడా పంపను...’ అనేసింది. ఒక్క పని చేయనిచ్చేది కాదు. ఉదయం టిఫిన్ తో పాటు ఓ సారీ, మధ్యాహ్నం మూడున్నరకి [మాకు షిఫ్ట్ సిస్టం ఉండేది బ్యాంకు లో] ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు మరో సారీ, రాత్రి పడుకునే సమయంలో మరోసారీ ఒక పెద్ద గ్లాసుడు పాలు తాగాల్సిందే... ‘అమ్మా, వద్దమ్మా... చిరాగ్గా  ఉంటుంది...’ అన్నా వినేది కాదు. ‘రేడియోలో ఏం చెప్పారు? గర్భిణీ స్త్రీలకు కాల్షియం చాలా  కావాలని, తల్లికీ, బిడ్డకూ సరిపోయినంత ఉండాలని చెప్పారు కదా... అందుకని మాట్లాడకుండా తాగేయమ్మా...’ అని బ్రతిమాలి తాగించేది. బాబు పుట్టాక వాడిని క్షణమైనా వదిలేది కాదు. నాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒకరినొకరు విడవలేక విడిచి వెళ్ళాము... అమ్మ కూడా తమ్ముడు జాబ్ చేసే దగ్గరికి వెళ్ళిపోయింది. మా ఇల్లు (ఇంట్లో సామాన్లు) మూడుగా విడిపోయింది...

నట్ట నడివేసవిలో కూడా వేడి నీళ్ళ స్నానం చేయటం నాకు అలవాటు. గోరువెచ్చగా ఉంటే పనికిరాదు. అందుకని నాకు స్పెషల్ గా రెండు తప్పేళాల నీళ్ళు కాచి ఇచ్చేది ఎప్పుడూ... అరిసెలు వండాలన్నా, ఆవకాయ కలపాలన్నా నేను తనకి తోడు ఉండాల్సిందే...

పెళ్లి కాక ముందు, నాన్న పోయాక అమ్మా, తమ్ముడూ, నేనూ కలిసి ఉండే వాళ్ళం కదా... అప్పుడు ఓ సారి యల్టీసీ వాడుకొనే అవకాశం వచ్చింది నాకు. అమ్మా, తమ్ముడూ నాకు డిపెండెంట్స్. అనుకోకుండా ఎయిర్ లో వెళ్ళే అవకాశం. ట్రిప్ కోసం జాగ్రత్తగా ఒక ఐదు వేలు జమ చేసుకొని, విమానం టికెట్స్ బుక్ చేసుకొని, ముగ్గురమూ  వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాం ఫ్లయిట్ లో... విమానం ఎక్కిన అమ్మ ఎంతగానో మురిసిపోయింది.

ఆకాశంలో ఎయిర్ బస్ వెళుతూ ఉంటే మేఘాలను చూసి ఆశ్చర్యానందాలతో తబ్బిబ్బు అయింది... గంటలో బేగంపేట ఎయిర్ పోర్ట్ వచ్చేసింది అంటే, ‘అప్పుడే హైదరాబాదు ఎలా వస్తుంది?’ అంటూ ఆశ్చర్యపోయింది. విమానం లోంచి దిగుతూ ఉంటే వినయంగా నమస్కరించిన ఎయిర్ హోస్టెస్ ని చూసి తనూ ప్రతిగా నమస్కరించి, ‘ఎంత గౌరవమో చూసావా పెద్దలంటే?’ అని చెప్పింది... ఆబిడ్స్ లోని రామకృష్ణా థియేటర్ దగ్గర ఉన్న ‘ఆహ్వానం’ హోటల్ లో స్టే చేసాం అప్పుడు. బిర్లా మందిర్, సాలార్ జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్, టాంక్ బండ్ చూపించాము. ఎంతో మురిసిపోయింది. నిజానికి మేమూ అదే మొదటిసారి హైదరాబాద్ రావటం. అమ్మతో పాటుగా అవన్నీ చూడటం మాక్కూడా ఎంతో ఆనందం కలిగించింది. అప్పటికే నాకు కలం స్నేహితురాలు, ఈనాటి ప్రముఖ రచయిత్రీ అయిన శ్రీమతి వాలి హిరణ్మయీదేవి సహకారంతో సిటీ అంతా చూడగలిగాం అప్పుడు. నాకన్నా, అమ్మా, ఆవిడా బాగా ఆప్తులు అయిపోయారు.  మూడోరోజు నాంపల్లి స్టేషన్ లో గోదావరి రైలు ఎక్కుతూ ఉంటే ఉమ (హిరణ్మయి) ని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంది అమ్మ. ఆ తర్వాత ఎవరితో మాట్లాడినా, ఎవరిని కలిసినా, ‘నేనూ విమానం ఎక్కాను. మా చంటమ్మ నన్ను విమానంలో హైదరాబాద్ తీసుకు వెళ్ళింది కదా...విమానంలో అమ్మాయి నాకు నమస్తే కూడా పెట్టింది...’ అనేది మురిపెంగా... అలా ఏళ్ళ తరబడి అందరికీ చెప్పేది.

అమ్మను చివరి రోజుల్లో సరిగ్గా చూసుకోలేదేమో అనిపిస్తోంది ఎప్పుడూ... నా దగ్గరే చివరి ఏడాది ఉంది... అనారోగ్యంతో మనిషి చిక్కి శల్యమైపోయింది. ఒక్క నాలుగు రోజులు తమ్ముడి దగ్గర ఉండి వస్తానని వాడితో వెళ్లి, మూడో రోజు వెళ్ళిపోయింది. అమ్మను ఇక మేము మళ్ళీ పొందలేము... అమ్మకోసం ఎంత కన్నీరు కార్చినా రాదు. ఇంకా కొంచెం శ్రద్ధ వహించి ఉంటే, ఇంకా బాగా చూసుకుని ఉంటే, అమ్మ ఇంకో పదేళ్ళు అయినా బ్రతికేది కదా... ఈ అపరాధ భావన మాత్రం నన్ను జీవితాంతమూ వదలదు...

అమ్మ గురించి పంచుకోవటానికి ఈ అవకాశం కలిగించినందుకు మీకు ఎన్నెన్నో కృతజ్ఞతలు... ప్రత్యేకంగా మాతృదినోత్సవం అని కాకుండా రోజూ నేను లేవగానే తలచుకోనేది మా అమ్మనే... నా హృదయంలో ఎప్పుడూ కొలువైన దైవం మా అమ్మే...

నండూరి సుందరీ నాగమణి