మా అమ్మ

అమ్మంటే ఇష్టం, ప్రేమ ఉండనిదెవరికి? మనల్ని కని, పెంచి విద్యా బుద్దులు నేర్పే తొలి గురువు అమ్మేగా. మా అమ్మ శ్రీమతి మహీధర దుర్గాంబ గారి గురించి పంచుకొనేందుకు మీ ముందుకు వచ్చాను.దేశానికి రాజైనా కన్నతల్లికి పాపడే. నా వరకూ అమ్మంటే ప్రేమా,అనురాగం, ఆప్యాయతలతో బాటూ క్రమశిక్షణ, వ్యక్తిత్వం ఉన్నతమైన భావాలను ఉగ్గుపాలతో బాటే రంగరించి పోసిన మహా మనిషి... ఆమె చదువుకోలేదు కానీ చదువు విలువ బాగా తెలిసిన , చదువును గౌరవించి , ప్రేమించే తత్వం... అలాగే ఎంత ప్రేమగా పెంచినా క్రమశిక్షణ దగ్గరకొస్తే ' మిలటరీ డిసిప్లీనే '  అలా అని ఏనాడూ కొట్టడం, తిట్టడం, అరవడం లాంటివి చెయ్యలేదు కళ్ళెర్రజేసి ‘ఊఊ’ అదంటే చాలు, అసలు మమ్మల్ని ఆడుకోవడానికి ఎప్పుడైనా బయటకు పంపితేగా ... సెలవలైనా సరే ఇంట్లోనే నేనూ మా తమ్ముడూ ఆడుకోవడమే, బహుశా అందుకేనేమో ఎప్పుడూ గుడిపాములా ఇంట్లో ఉండడమే కానీ బయటకెళ్ళడం పెద్దగా ఇష్టం ఉండదు.

కానీ నాకు బాగా జ్ఞాపకం ఒక్కసారి మాత్రం అమ్మ చేతిలో దెబ్బలు తిన్నాను, మరి మా తమ్ముడు దొరికితేగా అందుకే ఇద్దరి వంతూ నాకే పడ్డాయి ఎందుకంటారా, బాగా చిన్నప్పుడు మా అన్నయ్య ఉద్యోగరీత్యా మేము ఏలూరు దగ్గర దెందులూర్ లో ఉండేవాళ్ళం. అన్నయ్య స్కూల్ లో చదివే ఓ అమ్మాయి ఓ సెలవనాడు అన్నయ్యని అడిగి అమ్మని ఒప్పించి మమ్మల్నిద్దరినీ వాళ్ళింటికి తీసికెళ్ళింది, వాళ్ళది చాలా పెద్ద ఇల్లు, చక్కగా పెద్ద తోటా... నాకు చిన్నప్పటినుండీ మొక్కలన్నా పువ్వులన్నా పిచ్చి, అందుకే ఓ చక్కటి ముద్దమందార మొక్కా అది వాలిపోకుండా ఉండడానికి (పాతగానే) ఓ వెదురుకర్ర ఇచ్చి సాయంత్రం బాగా చీకటిపడే దాకా ఉంచి అప్పుడు దిగబెట్టింది ... అంత ఆలశ్యం చేసినందుకు అప్పటికే అమ్మకి బాగా కోపం వచ్చి ఆ పిల్ల వెళ్ళే దాకా ఆగి, నా చేతిలో ఉన్న ఆ వెదురు కర్రతోనే బాగా బడితెపూజ చేసింది, మా తమ్ముడు దొరకకుండా తప్పించుకు పారిపోయాడు. ఆ తరువాత తనే దగ్గరకు తీసుకుని, దెబ్బలకు వెన్న రాసిందిలెండి. అప్పట్లో ఫోన్ లు లేవుగా మేం అంత ఆలశ్యం చేసేసరికి బాగా కంగారు పడిపోయింది పాపం ... మరి మాది తప్పేగా.   చదువులేదు, సంపాదన లేదు ... ఆస్తిపాస్తులనేవి ముందేలేవు ... నాకూ మా తమ్ముడికి ఊహ తెలిసేసరికే మా నాన్నగారు చనిపోయారు. పెద్ద పిల్లలయిన అన్నయ్యా , అక్కా మా తాతగారి దగ్గర ఉండి చదువుకున్నారు , ( పితామహులు శ్రీ మహీధర వేంకటరామశాస్త్రి గారు) అమ్మ ఇద్దరు చిన్నపిల్లలతో మా ఇంకో తాతగారింట్లో (అమ్మ నాన్నగారు శ్రీ గొడవర్తి వేంకట సుబ్రహ్మణ్యం  గారు )

ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు రాస్తున్నానంటే ఎటువంటి ఆలంబనా లేని అమ్మ కళ్ళలో ఏ రోజూ కన్నీళ్ళు , బాధా, దుఖం ,అసహాయతా కనిపించలేదు. తను తిందోలేదో, మాకు ఏ లోటూ చెయ్యలేదు ,తను తినేదాంట్లోంచే ఇంటికి ఎవరొచ్చినా ఆదరంగా పెట్టడమే తెలుసు, ఎవరినీ ఏ రోజూ ఏ సాయం అర్ధించలేదు, ఎవరి దగ్గరనుంచీ ఏమీ ఆశించలేదు... అలాంటి వ్యక్తిత్వం ఉన్న తల్లి కడుపున పుట్టడం ఎంత అదృష్టం... అనుక్షణం మా ఉన్నతి కోసం తపించేది, తన పిల్లలు అన్నింటా ముందుండాలనీ, అందరిలో ఉన్నతంగా ఉండాలనీ ఆశించేది ... ఒక్క క్షణం ఆమె వృధాగా గడిపేది కాదు మమ్మల్ని గడపనిచ్చేదీ కాదు ...  ఇప్పటికీ నాకు ప్రతి నిముషం ప్రోడక్టివ్ గా ఉండాలనే పిచ్చి , అది ఎంతగా అంటే ఒక్కొక్కసారి నా మెంటాలిటీ మీద నాకే విసుగు వస్తుంది ... మనం మనుషులం కానీ మరమనుషులం కాదు కదా ... అప్పుడూ నేను మా అమ్మనే తిట్టుకుంటా , ఎందుకంటే నా మీద ఉన్నది ఆవిడ ప్రభావమేగా ... కానీ అప్పుడప్పుడనిపిస్తుంది ఆవిడే కనక బ్రతికి ఉంటే ఈపాటికి నేను కెరీర్ పరంగా కానీ , ప్రవృత్తి పరంగా కానీ ఎంతో కొంత ప్రగతి, ఉన్నతి సాధించి ఉండేదాన్నేమో కదా అని. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏం చదువుతున్నావని అడిగి అస్తమానం అదే ఎందుకు నీకు కెమిస్టరీ అంటే భయంగా అది చదువు అనేది ... ఇలా తనకు అసలు ఆ సబ్జెక్ట్స్ ఏవీ తెలియక పోయినా, మానిటర్ చేసేది, ఒక్క చదువే కాదు సంగీతం, ఆటలు, పాటలు కుట్ట్లు అల్లికలు అన్నీ నేను నేర్చుకోవాలి, ఆఫీస్ లో అలసిపోయి వచ్చినా కొంచెం సేపు సేదదీరి సంగీతమో, కుట్ట్లో ఏదో ఒకటి చెయ్యలి కానీ పగలు అస్సలు నిద్రపోనిచ్చేదే కాదు.

తనకు తెలియనిది , అఖరలేనిదీ లేదు మా స్నేహితులూ, కొలీగ్స్ ఎవరు ఇంటికి వచ్చినా వాళ్ళు ఏం చదివారో అడిగేది  ఇంకా పై చదువులు చదవమనీ, ప్రమోషన్ పరీక్షలు వ్రాయమనీ ఇలా ...  నేను ఎప్పుడూ సరదాగా అనే దాన్ని వాళ్ళను 'ఇంటరాగేట్' చెయ్యకే పాపం మన ఇంటికి రావాలంటే హడలిపోతున్నారు అని.దానికి ఆవిడనేది నేనేం వాళ్ళని దుంగలెత్తమన్నానా దూలాలెత్తమన్నానా, వాళ్ళ మంచికేగా చెబుతుంటా అని. వాళ్ళు కూడా పాపం స్పోర్టివ్ గా తీసుకుని మా అమ్మంటే చాలా అభిమానంగా ఉండే వాళ్ళు.    నాకు తెలిసి ఆవిడ సమయాన్ని వృధా చెయ్యడం కానీ, చేసే వాళ్లని ఉపేక్షించడం కానీ నే చూడలేదు ... ముప్పై ఏళ్ళ చిన్న వయసులో భర్తని పోగొట్టుకుని ఎటువంటి ఆలంబనా లేకుండా పిల్లలని అభివృద్దిలోకి తేవడమనే మహాయజ్ఞం అంత సులువని నేననుకోను. అప్పట్లో ఫేమిలీ పెన్షన్ నెలకి ముపై,నలబై రూపాయలో ఎంతో వచ్చేది దానితోటే ఎంతో జాగ్రత్తగా అన్ని అవసరాలూ తీర్చుకుని పైగా ఎంతోకొంత పొదుపు చేసేది, చదువుకోకపోయినా ఆర్ధిక శాస్త్రం, మేనేజ్మెంట్ పక్కాగా ఉండేది.   అంత ప్లానింగ్ , పద్దతి, తెలివీ ఉన్న అమ్మే కనుక చదువుకుని మంచి ఉద్యోగంలో ఉంటే కచ్చితంగా సమాజానికి ఎంతో కొంత మేలు జరిగి ఉండేది.ఆమె నా రోల్ మోడల్, ఆమె నా హీరో. ఆమె ఉన్నప్పుడు ' నయాగరా జలపాతంలా ఉండే నేను ... ఇప్పుడు చలనం లేక మందగొడిగా ' తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ' అన్నట్లు అయిపోయా ... చిన్నప్పుడెప్పుడూ  ‘అమ్మ కావాలనీ ‘ఏడవలేదు ఎందుకంటే ఆమె నీడలా కూడానే ఉన్నా కనుక ఇప్పుడు

'అమ్మ కావాలని ఏడవాలని ఉంది ... కానీ ఎంత ఏడ్చినా రాదుగా ... ఆ దేముడే కనక ప్రత్యక్షమై వరం ఇస్తే నే కోరేదొకటే మా అమ్మను మళ్ళీ నాకిచ్చెయ్యమని ... మీకు తెలుసా నేను మా అమ్మను తలుచుకోవడమే మానేసా ... ఎందుకంటే తలుచుకుంటే ఆ బాధను తట్టుకోవడం నా వల్ల కావడం లేదు ... అమ్మ 2003 దసరా , మహర్నవమి నాడు చనిపోయింది , సుమారు పుష్కరం దాటుతున్నా నా మనసు అలవాటుపడలేదు... అందుకే నేను అసలు తలచుకోవడమే మానేసా. ఇంకో విషయమండోయ్ నా పిల్లల చిన్నప్పుడు వాళ్ళను మా అమ్మే పెంచింది ( నేను ఉద్యోగానికి వెళ్ళిపోతాగా) మరీ ముఖ్యంగా మా పెద్దబ్బాయిని, చిన్నవాడి టైం కి ఆవిడ ఓపికా అయిపోయింది, మా ఆయనా మా అమ్మా మంచి స్నేహితుల్లా ఉండేవారు ... నాకు కూడా చెప్పకుండా వాళ్ళిద్దరూ బోలెడన్ని విషయాలు మాట్లాడేసుకునే వారు, నాకు అసూయ కలిగేలా ... ఇంకొక ముఖ్య విషయం రాయకుండా ఇది ముగిస్తే నాకు చాలా పాపం వస్తుంది అందరిపిల్లలలోకీ మా అమ్మకు నేనంటే ప్రత్యేకమైన ప్రేమ,అభిమానం చిన్నప్పటి నుండీ కాస్త అర్భకంగా ఉండేదాన్ననీ నాకు మా పిల్లల చిన్నప్పుడు మెనంజిటిస్ వచ్చి బ్రతుకుతానన్న ఆశ లేనప్పుడు ఆవిడా మా ఆయనా నన్ను కంటికి రెప్పలా కాపాడడం గుర్తొస్తే నాకు మనసంతా అనిర్వచనీయమైన భావంతో నిండిపోతుంది అలాంటి అమ్మను చివరిసారి మేం చూసేటప్పటికి ... మేం వెళ్ళేసరికే నిర్జీవమైన సంగతి గుర్తొస్తే నా గుండె చెరువైపోతుంది... ఒక్కసారి కాలం వెనక్కు వెళ్ళి ఆమె ప్రాణాలతో ఉండగా మమ్మల్ని చూసి ' అమ్మా మేం వచ్చాం ' అన్న మాటలు ఆమెతో చెప్పగలిగితే ఎంత బాగుండునూ. ప్చ్... అలా ఎందుకు జరగాలి?   ఆమె మనిషీ, మనసూ, జ్ఞాపకాలూ అన్నీ అందమైనవే ... అందుకే నేను ఎన్ని జన్మలకైనా ( నిజంగా అవి అంటూ ఉంటే) ఆ తల్లికే కూతురిగా పుట్టాలని మనసా కోరుకుంటూ ... ఈ అక్షరాంజలి అమ్మకే అంకితం.

మీనాక్షీ శ్రీనివాస్.