అమ్మంటే అమృతమేనా అంతకు మించింది కాదూ

అమృతం అమరత్వాన్నివ్వచ్చు..కానీ..జీవితంలో తారసపడే అన్ని రుచులనూ ఆస్వాదించడం, యెదురయ్యే ఆటుపోట్లను తట్టుకోవడం యెలాగో తెలిపేది అమ్మే కదా..

అయిదుగురు అన్నగార్ల తర్వాత అపురూపంగా పుట్టి, పుట్టింటిలో అస్తారుబస్తంగా పెరిగిన పిల్ల ఒక పెద్దింటికి పెద్దకోడలై, ఆ వంశాన్ని అమృతమయం చేసి, అక్కడందరికీ తలలో నాలుకలా మెలిగిన మా అమ్మగారు  పద్మావతి గురించి యేమని చెప్పగలను? యెంతని చెప్పగలను?

యెప్పటెప్పటివో జ్ఞాపకాలు అవిరామంగా మనసును కలచివేస్తుంటే ఒక్కొక్కటీ విడదీసుకుంటూ, చాలా చాలా కొద్దిగా మాత్రమే చెప్పాలంటే కష్టమే. పుస్తకాలను చేతబట్టి చదువు నేర్వకపోయినా జీవితాన్ని క్షుణ్ణంగా చదివిన ఆవిడ చెప్పిన కొన్ని జీవితసత్యాలు అక్షరసత్యాలనే అనిపిస్తాయి.

అందులో ఒకటి.. మన అన్నం మనం తిన్నా యెదుటివారికి బెదరాలి..అన్నారు ఓసారి మా అమ్మగారు.. అంటే యేవిటీ అనడిగాను. దానికి సమాధానంగా.. మనం ఆకలిగా వున్నప్పుడు  పిలిచి యెవరూ అన్నం పెట్టరు కానీ మనం ఆపదలో వున్నప్పుడు మాత్రం మాటలనడానికి ప్రతివారూ ముందుంటారు, అందుకే యే పని చేస్తున్నా మనని పదిమంది గమనిస్తున్నారు అన్న స్పృహతో వుండాలి అని చెప్పారు. యెంత సత్యం ఆ మాట.

మరోటి.. కట్టూ బొట్టూలో కాస్త తేడా వచ్చినా ఊరుకునేవారు కాదు. నీ కట్టూబొట్టూ చూసి నువ్వెవరి పిల్లవో తెలియాలి అనేవారు.

అన్నింటికన్నా నాకు యిప్పటికీ బాగా గుర్తుండిపోయేదేవిటంటే..

ఆ రోజుల్లో మా బంధువుల్లోనే నాకంటే వయసులో చాలా పెద్దయిన హైస్కూల్ దాటని ఆడపిల్లలు కొంతమంది వుండేవారు.  వాళ్లంతా ప్రతియేడూ ఆంధ్రామెట్రిక్ అనే పరీక్షకి వెడుతుండేవారు. వాళ్లకి పెళ్ళిసంబంధాలు చూస్తున్నప్పుడు మా అమ్మాయి మెట్రిక్ చదువుతోంది అని చెప్పేవారు వాళ్ల తల్లితండ్రులు. యెప్పుడు పెళ్ళి కుదిరితే అప్పుడు చదువు ఆపెయ్యడమే. అంటే ఆడపిల్లలకి జీవితంలో పెళ్ళికున్న ప్రాముఖ్యం మరి దేనికీ వుండేదికాదు.

నాకైతే పధ్నాలుగేళ్ళకే ఎస్.ఎస్.ఎల్.సి. అయిపోయింది. అ తర్వాత ఒకేడాది పి.యు.సి., మరో మూడేళ్ళు డిగ్రీ.. అంటే పధ్ధెనిమిదేళ్ళకే డిగ్రీ చేతికి వచ్చేసేయొచ్చన్న మాట. అలాంటప్పుడు ఒకరోజు నేను డిగ్రీ పరీక్ష రాయడానికి వెడుతూ, “ పరీక్షకి వెళ్ళొస్తానమ్మా.. “ అని చెప్పాను మా అమ్మగారితో. అప్పుడు ఆవిడ నాతో “యిదిగో చూడూ.. ఈ పరీక్ష పాసయ్యేలా రాయకు. ఫెయిలైపో..” అన్నారు. నాకు ఒక్కక్షణం ఆవిడన్న మాట అర్ధంకాలేదు. యెవరైనా పిల్లలు పరీక్ష రాయడానికి వెడుతుంటే  పెద్దవాళ్ళు “బాగా రాయమ్మా..” అంటారు కానీ యిలాగ ఫెయిలవమని అంటారా.. నాకు కోపంతోపాటు ఒకవిధమైన దుఃఖం కూడా వచ్చేసింది. “అదేంటమ్మా.. పరీక్షకి వెడుతుంటే అలా అంటావూ?” అన్నాను. అప్పుడు మా అమ్మగారు నెమ్మదిగా, “అదికాదమ్మా, నువ్విలా గబగబా డిగ్రీ పూర్తి చేసేసేవనుకో.. నీకు వయసెక్కువని పెళ్ళిసంబంధంవాళ్ళు అనుకుంటారు. అదే డిగ్రీ చదువుతూ వున్నావనుకో.. ఇంకా చిన్నపిల్లే..చేసుకోవచ్చు అనుకుంటారు. ఆ మెట్రిక్ కి కట్టేవాళ్లని చూడూ.. ఇంకా చిన్నవాళ్లనే అనుకుంటున్నారు..అదే నువ్వు డిగ్రీ తెచ్చేసుకున్నావనుకో.. వయసెక్కువనుకుంటారు. మంచిసంబంధాలన్నీ పోతాయి..” అన్నారు.

మా అమ్మగారి తర్కానికి నాకు తల తిరిగిపోయింది. అప్పుడైతే అలా అన్నందుకు అమ్మ మీద చిరాకు పడ్డాను కానీ  తర్వాత నేనూ అమ్మనయ్యాక కానీ  అందులో వున్న ఆంతర్యం బొధపడలేదు. కూతురిని జీవితంలో బాగా స్థిరపరచడానికి తల్లి పడే ఆతృత ఆ తర్వాత కానీ తెలీలేదు. కూతురికి మంచి కుటుంబజీవితం యేర్పడాలన్న ఆ తల్లి ఆరాటం, దానికోసం తాపత్రయపడే అమాయకత్వం తల్చుకుంటే యిప్పటికీ వళ్ళు జలదరిస్తుంది.

అందుకనే అమ్మ అమ్మే.. అమ్మ యేమన్నా అది తన పిల్లల భవిష్యత్తు బంగారం కావాలనే. ఈ రోజు మేమందరం యింత బాగున్నామంటే ఆ చల్లనితల్లి ఆశీర్వచనమే. ఈ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మని మరోసారి గుర్తు చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా వుంది.

జి. యస్. లక్ష్మి. (ప్రముఖ రచయిత్రి)