అమ్మా నేనూ ఊహూ కాదు అమ్మా మేము

మేము అంటే మేమే!  మేం ముగ్గురం.. మా శుభ, మా చిన్ని, మా బాబు అని మా అమ్మ ఎప్పుడూ ముద్దుగానూ, అప్పుడప్పుడు  కొంచం  గర్వంగానూ  చెప్పుకునే  అమ్మ పిల్లలం. “ మదర్స్ డే”  కదా!,  అని  నేనొక్కదాన్నే రాసేసుకుంటే పాపం మా చెల్లీ, తమ్ముడూ ఏమయిపోతారు?  వాళ్ళిద్దరినీ నేనే బాగా చూసుకోవాలని, నన్ను చూసే వాళ్ళు మంచీ, చెడ్డా నేర్చుకుంటారనీ అక్కని అయినప్పుడు మొదటిసారీ,  పెద్దక్కని అయినప్పుడు రెండో సారి అమ్మే చెప్పింది.  అందుకే ఇది మా ముగ్గురి తరపునా మా అమ్మకోసం..

" తను ఊపిరి తీసుకోవడం బరువూ, కొండకచో కరువూ అవుతున్నా సరే తన సర్వశక్తులూ ఒడ్డి తనలోని చిన్న ఊపిరికి వేణువులూదే  సహనమూ, శక్తీ  కేవలం అమ్మలకే  సొంతం. అది నేను అమ్మని అయినప్పుడు  నాకు అనుభవంలోకి వచ్చిన సత్యం. అమ్మ అవడానికి తగినంత వయసూ, జ్ఞానమూ లేని వయసులోనే ముగ్గురు పిల్లలకి 'మూలపుటమ్మ ' అయింది  అమ్మ. బాలాత్రిపుర సుందరి కదా మరి!!

అసలు "కోదండ రాముడంట,  అమ్మలారా!  వాడు సర్వ మంగళ (నాన్నమ్మ గారి పేరు) కొమరుడంట " అని పాడుకోకుండానే తన పదమూడో ఏట,  నిజంగానే రాముడి పేరూ, తీరూ ఉన్న నాన్నతో వివాహం. మూడేళ్ళల్లో మొదట నాకూ,  మరో ఐదేళ్ళలో చెల్లికీ,  తమ్ముడికీ  అమ్మవడం సినిమా రీళ్ళలా గబ గబా జరిగిపోయాయి.

వరదగోదారీ,  కోనేటి రాముడి గుడి, పచ్చని వరిచేలూ, కొబ్బరి బొండాలు, అంటు మావిడి తోటలూ, నూపప్పు జీళ్ళూ, సుబ్బారాయడి తీర్థాలూ, వేసవిలో మల్లెలూ, కొత్తావకాయలూ, బొమ్మలపెళ్ళిళ్ళూ, ఒప్పుల కుప్పలు, గొబ్బిళ్ళ పేరంటాలూ... వీటన్నింటి మధ్యనా కమ్మని కలలా,  రంగుల  హరివిల్లులా గడచిన బాల్యం అమ్మలాంటి ఆ కాలపు పిల్లలకే సొంతం. ఆడపిల్లల చదువుకి అందులో పెద్దగా చోటు లేదు.  హైస్కూల్ కి వెళ్ళాలన్న తన కోరికని సత్యాగ్రహం చేసి సాధించుకుంది అమ్మ. అందుకే మాకు మాత్రం ” ఎప్పుడూ చదువే ముందు, మిగతావన్నీతర్వాత” అని చెప్పేది, చదువుతోపాటు అన్నింట్లోనూ ముందుండాలని ప్రోత్సహించేది.

పెళ్ళి అయిన వెంటనే పసితనం పెద్దతనంలోకి మారుతుంది..   ఇంటిపేరూ (ఆకాలంలో), ఉండే ఇల్లూ మారుతుంది..

కట్టూ, బొట్టూ, తీరూ, తెన్నూ మారుతుంది.. నడకా, నడతా, మర్యాదా, మన్ననా మారుతుంది.. చుట్టరికాలూ, బంధుత్వాలూ మారతాయి.. అసలు  పాపాయి పుట్టగానే అమ్మాయే మారిపోతుంది, అమ్మగా..

కానీ  అప్పటినించీ  చిత్రంగా  ఏమీ మారదు,  ఒకసారి అమ్మ అయిన తర్వాత ఎప్పుడూ అదే రీతి, రివాజు, అదే ప్రేమా, అదే అనురాగం.. ఎందుకంటే పిల్లలుపెరుగుతారు కానీ  అమ్మలు పెరగరు,  అక్కడే ఆగిపోతారు.    కాదంటారా??  

లేకపోతే...

ఎప్పుడో,  ఏడో క్లాస్  లో ఉన్నప్పుడే పాలు తాగడం మానేసిన నా చేత ఇప్పటికీ రోజూ పొద్దున్నే గ్లాసుడు పాలు తాగించే ప్రయత్నాలు.. " హార్లిక్స్ తాగితే  బలం  శుభడు!  చాలా బాగా కలిపాను ( ఆ సీక్రెట్ వంట ఏమిటో ఈ సారి అమ్మని అడిగి చెప్తాను) అంటూ చెప్పే మాటలూ.    

“ మా పెద్దమ్మాయికి జున్నంటే ప్రాణం అని నీకు ఎప్పుడూ చెప్తాను కదా! అయినా, అది వచ్చినప్పుడు ఎప్పుడూ జున్ను పాలు పొయ్యనే పొయ్యవు!”  అని పాలబ్బాయిని  కోప్పడడం.

“ మీ ఆఫీసు పనిలో పడి జాకెట్లు కుట్టించుకోవు, ఒక ఆది జాకట్టు నాదగ్గరుంచడమ్మా” అంటూ మాకు జాకెట్లూ,  ‘ఈనాడు వసుంధర’  లో ప్రతీ వారం  పిల్లల బట్టల డిజయిన్లు చూసి కొన్ని బట్టలు కొని, కొన్ని ఇంట్లోవి వాడి  చెల్లెలి పిల్లలకి పరికిణీలూ, డ్రెస్సులూ కుట్టుంచడమూ.

“ వడియాలంటే మా బాబుకి ఎంతో ఇష్టం !”  అంటూ బూడిద గుమ్మడికాయని చూస్తూనే మురిసిపోవడం, గబ గబా పప్పు నానేసి వడియాలు పెట్టేయడం.

“ఏమిటో అమెరికా జీవితాలు? పొద్దున్న లేస్తూనే ఉరుకులూ, పరుగులూ.. తిన్నారో, తాగారో కూడా తెలియకుండానే తెల్లవారడాలూ, సందె పడడాలూ.. అందుకే మేము ఇక్కడ ఉన్నప్పుడే మాఇద్దరికీ వీలైనన్ని వంటలూ, పని చెయ్యడం తప్ప ఇంకేం  చెయ్యగలం?” అని తమ్ముడినీ, మరదలినీ చూసి బాధ పడటం.

“పొద్దున్నించీ కొంచం తల నొప్పిగా ఉందమ్మా! “అని ఫోన్ లో చెప్పగానే . " అయ్యో, రాత్రి సరిగా నిద్ర పోలేదేమో? టాబ్లెట్ వేసుకుని, వేడిగా ఏదైనా తాగమ్మా!  అని చెప్పి ఊరుకోకుండా గంటకోసారి ఫోన్ చేసి తగ్గిందో, లేదో? కనుక్కోవడం..

" నువ్వు కధలు ఎంతో బాగా రాస్తావు, క్రమం తప్పకుండా రాస్తూ ఉండు, అస్సలు మానేయద్దు" అని చిన్నపిల్లలకి చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ చెప్పడం. కౌముది లో నా కధ ప్రతీ నెలా చదివి అది నిజంగా బావున్నా,లేకున్నా 'చాలా బాగా రాసావు ' అంటూ మెచ్చుకోవడం..

కడుపు నొప్పంటే వేడి అన్నం లో నేతిలో వేయించిన వాము వేసి అన్నం కలిపి పెట్టడం,  మనకి కాలు నొప్పంటే తను కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం. మా పిల్లలెప్పుడూ అల్లరే చెయ్యలేదు, ఈ కాలం వాళ్ళల్లా పెంకితనాలూ, మంకుపట్లూ ఎరగరు అని ఆనందించడం..

“మనిషన్నాకా కాస్త దేవుడంటే భయం, భక్తీ ఉండాలి. రోజూ పొద్దున్నే లేచి దీపం పెట్టుకోండి, రోజూ ఏదైనా అమ్మవారి స్త్రోత్రాలు చదువుకోండి”  అని చెప్పడం..

ఇవన్నీ  ఎందుకు ఎప్పుడూ మారవు????
అన్నింటికంటే ముఖ్యంగా " తల్లి కళ్ళు దెయ్యం కళ్ళు, మంచి చీరలు, కొత్త బట్టలూ కట్టుకుని ఎంత బావున్నారో? నా దృష్టే తగిలేస్తుంది అంటూ ఉప్పూ, తడిగుడ్డా తెచ్చి దిష్టి తియ్యడం, " ఇంత పెద్దవాళ్ళం అయ్యాం, మాకింకా దిష్టి ఏమిటమ్మా?" అని నవ్వితే, " అలా నవ్వకండి, మీకు తెలీదు. నరుడి దిష్టికి నళ్ళరాళ్ళు పగులుతాయి అంటారు" అంటూ కంగారు పడడం..

ఇవన్నీ ఎందుకు మారవు? ఎలా మారకుండా నిత్య నూతనంగా ఉంటాయి? ఆ కళ్ళల్లో పిల్లలెప్పుడూ పెద్దవారయినట్టు ఎందుకు కనపడదు? మన ప్రతీ ఇష్టమూ, అయిష్టమూ, బాధ పడిన సందర్భమూ, గెలిచి ప్రతీ విజయమూ,  మనతో గడిపిన ప్రతీ క్షణమూ ఆ మనసుకి మరపు రాదెందుకు?

ఎందుకంటే ఒక్కసారి అమ్మ అయ్యాకా ఆ పేగు బంధం మారదు, ఆ ప్రేమ, అనురాగం, అభిమానం ఏమీ, ఏమీ మారవు.. పిల్లలు పెద్దవారయ్యేకొలదీ ఆ ప్రేమ పెరుగుతుందే తప్ప తరగదు. అది తోడిన కొద్దీ ఊరే నీటి చెలమ.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే "పండుకిది ఇష్టం, వాడు అమ్మమ్మా,  అంటూ ఎంతో ప్రేమగా ఉంటాడు, బంగారుకొండ” అని మా అబ్బాయి గురించీ,”ఆడపిల్లలకి జుట్టే అందం “ అని బారెడంత జడ ఉన్న మా చెల్లెలి పెద్దకూతుర్ని చూసీ మురిసిపోవడం. “ఇదేం మాట్లాడుతుందో నాకర్ధం కానే కాదు” అని చిన్నదాన్ని  చూసి ముద్దుగా విసుక్కోవడం. దాని ముద్దు మాటలు, వీడియోలు చూసి మురిసి పోవడం తర్వాత మెట్టు. అది అమ్మ కి అమ్మ అయిన అమ్మమ్మ ఆనందం. పేరులోనే రెండు అమ్మలని పొదువుకున్న ఆత్మీయబంధం కదా మరి!!అమ్మ ప్రేమలో ఎప్పుడూ, ఏదీ మారదు.. ఎందుకంటే అమ్మ హృదయం మారదు.. ఆ ప్రేమకి సంవత్సరానికి ఒక రోజు కేటాయిస్తే సరిపోదు, జన్మంతా అనుభవించినా తరగనిది, జీవితమంతా వెన్నంటి నడిచేది అమ్మ ప్రేమ మాత్రమే. ఈ మదర్స్ డే సందర్భంగా మా అమ్మకు మా ముగ్గురి తరపునా ఎన్నో వేల శుభాకాంక్షలు. ఆ ప్రేమకి వేల వేల కృతజ్ఞతలు..

వేదుల సుభద్ర. (ప్రముఖ రచయిత్రి)