చికాకుగా ఉందా...? ఇల్లు సర్దండి !

మీకు ఎప్పుడైనా కారణం లేకుండా చిరాకుగా అనిపిస్తే ఒక్కసారి ఇల్లు శుభ్రంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అకారణంగా వచ్చే కోపం, చిరాకులకి ఇల్లు శుభ్రంగా లేకపోవటం కూడా ఒక కారణం అంటున్నారు పరిశోధకులు. ఇల్లు శుభ్రంగా పెట్టుకోకపోతే... ఎదో తెలియని చిరాకు, ఒత్తిడి వంటివి మనల్ని ఇబ్బంది పెడతాయట.

మీకు తెలుసా? ఎంత పని ఒత్తిడి ఉన్నా, దొరికిన సమయంలోనే ఇంటిని చక్కగా సర్దుకోవటం, ఎక్కడి వస్తువు అక్కడ పెట్టడం, అవసరమైన వస్తువు కనిపించేలా పెట్టుకోవడం, ఇవన్నీ మన జీవితంపై మనకున్న శ్రద్ధని చూపిస్తాయట. ఎక్కాడు వస్తువులు అక్కడ పడేస్తూ, తిరిగి సర్దుకుంటూ, మళ్ళీ పాడుచేస్తూ ఇలా ఓ పధ్ధతి లేకుండా ఉండే వాళ్ళు ఏం చెయ్యాలో చూద్దామా...!

మన జీవితం ఓ పద్ధతిలో సాగిపోవాలంటే, ముందు ఇంటి నుంచి మొదలు పెట్టమన్నారు పెద్దలు. ఎప్పుడైతే ఇంటిని పొందికగా, చక్కగా సర్దుతూ దానిని రోజు అలాగే శుభ్రంగా ఉంచుకుంటామో, ఆ క్రమశిక్షణ అనేది నెమ్మదిగా మనపై కూడా చూపుతుంది. దీనివల్ల జీవితంలో మనం చేసే అన్ని పనులలో కూడా ఈ క్రమశిక్షణ అనేది అలాగే అలవాటుగా అయిపోతుంది.

విపరీతమైన కోపం లేదా చికాకు వంటివి ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సంఘటనల నుంచి తప్పించుకోవటానికి తక్షణ మార్గం ఏంటో తెలుసా...? చీపురు పట్టుకొని ఇల్లు మొత్తం దులిపెయ్యండి. ఆ పని పూర్తయ్యేలోపు మీ మనసులోని కోపం, చికాకు వంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ విధంగా చేయడం వలన మీకు కోపం, చికాకులు తగ్గిపోతాయి. అదే విధంగా మీ ఇల్లు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా, అందంగా ఉంటుంది. కాబట్టి ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మర్చిపోవద్దు.

 

- రమ