మీ పిల్లలు చేసే అందమైన పనుల కోసం

మీ ఇంట్లో పిల్లలు అల్లరి బాగా చేస్తుంటారా? మరి అలాంటి పిల్లలకు ఏదైనా పని చెప్తే ఎలా చేస్తారు? ఎదిగే పిల్లలకు పనులను ఎలా నేర్పించాలి? ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దామా!

 

* పిల్లలకు చెప్పిన పని వెంటనే చేయ్యాలనుకోకూడదు. తగినంత సమయం ఇవ్వాలి. అయితే ఎవరైనా మంచినీళ్ళు అడిగితే ఇవ్వడం లాంటివి మాత్రం వెంటనే చెయ్యాలని చెప్పాలి.

* పిల్లలు ఏ పని చేసిన కూడా ముందు ప్రశంసించి తర్వాత నిదానంగా తప్పుల్ని సరిచేస్తూ.." ఇలా చేస్తే బాగుండేది" అంటూ ప్రశాంతంగా చెప్పాలి. ఏదైనా పని చేసి వాళ్ళు విఫలమైతే కోప్పడకూడదు. మళ్ళీ ప్రయత్నించమని చెప్పాలి. అందులోని తప్పులను వారికీ సున్నితంగా చెప్పాలి.

* పిల్లలకు ఏదైనా పని చేయమని చెప్పేటపుడు ప్రేమతో చెప్పండి. ఉదాహరణకు... "కొంచం గది సర్దిపెట్టమ్మా. నువ్వైతే బాగా అందంగా చేస్తావు" అని ప్రేమగా చెప్తే వాళ్ళు కచ్చితంగా చేస్తారు.

* కొన్ని కొన్ని పనులు మనం చేసేటప్పుడు వారికి చూపిస్తూ, దగ్గరుండి వారికి చిన్న చిన్న పనులు నేర్పించడం వల్ల వారికి త్వరగా వస్తాయి. అంటే ఇది ఒక ట్రైనింగ్ లాగా అన్నమాట.

* అలాగే పిల్లలకు పని భారం తెలియకుండా వారితో కబుర్లు చెబుతూ నేర్పించాలి. ఎప్పుడు అలసట అనిపించకుండా ఎలా పని చేయాలో నేర్పితే, అప్పుడు వాళ్ళు నేర్చుకోవడంలో ఉత్సాహం చూపిస్తారు. సంతోషంగా పని కూడా చేస్తారు.

* మీ పిల్లలు చేసిన పనిని మీరు మెచ్చుకోవడమే కాకుండా, ఆ విషయాన్నీ ఇతరులతో పంచుకోండి. తన గదిని తను ఎంత శుభ్రంగా ఉంచుకుంటుందో, ఇల్లును ఎంత బాగా శుభ్రంగా చూసుకుంటుందో అంటూ తన స్నేహితులతో కూడా చెప్పండి.

ఈ విధంగా చేయడం వలన వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతో వారు మరింత పని చేయడానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు.