ఫాంటసీ ప్లే మంచిదే!

 

పగటికలలు ఆరోగ్యానికి ఎంతో మంచివని నిపుణులు చెబుతూ వుంటారు. అంటే, ఊహలలో విహరించడం. నిజ జీవితంలో చేయలేమనుకునే పనులని ఊహలలో నిజం చేసుకోవడం. ఈ పద్ధతి వల్ల టెన్షన్ తగ్గి కొంత మానసిక సంతృప్తి, విశ్రాంతి కూడా లభిస్తాయని అంటున్నారు నిపుణులు. ఇది పెద్దలకే కాదు... పిల్లలకీ వర్తిస్తుంది. అయితే వారికి తెలిసి చేసే పని కాదు. తెలియకుండానే వారి మనసులలోని భయాలనో, అసహనాన్నో, అయిష్టాన్నో, ఇష్టాన్నో వారి ఊహాజనితత ఆటల ద్వారా బయటపెడుతుంటారు. పిల్లల ఆటపాటల్ని దగ్గరగా గమనించే తల్లిదండ్రులందరికీ ఇది అనుభవమే. పిల్లలు టీచర్ ఆట, అమ్మ ఆట, డాక్టర్ ఆట అంటూ రకరకాల పాత్రాలను పోషిస్తూ, ఆ పాత్రల్లా ప్రవర్తిస్తూ ఆడుతూవుంటారు. అలాగే సూపర్ మేన్, హనుమాన్ అంటూ తమని తాము అతి బలవంతులుగా ఊహించుకుంటూ విన్యాసాలు చేస్తూ వుంటారు. అయితే, ఇవన్నీ పిల్లల ఆటలేనని కొట్టిపారేయడానికి  లేదు అంటున్నారు పిల్లల మనస్తత్వవేత్తలు.

 



నిజానికి సూపర్ మేన్, హనుమాన్ వంటి ధీరోదాత్త పాత్రలని అభియనించే పిల్లలు అతి పిరికితనం కలిగి వున్నవారో, అలాగే బిడియస్తులో కావచ్చు. వారిలోని ఆ లక్షణాలని జయించడానికి వారికి తెలియకుండా వారు చేసే ప్రయత్నమే ఆ ఆటలు. వారు పదేపదే నేను ఇలా చేస్తాను.. అలా చేస్తాను అని చెబుతుంటే ఆ విషయంపై పిల్లలు ఎక్కువ వత్తిడికి గురవుతున్నారని గ్రహించాలని అంటున్నారు నిపుణులు. చీకటంటే భయపడే ఓ కుర్రాడు ఈ గదిలో నుంచి ఆ గదిలోకి ఒక్కడే వెళ్ళలేని వాడు వాడి ఆటలలో భాగంగా ‘‘నేను విమానమెక్కి దూరంగా వున్న కొండపైకి వెళ్తున్నాను. రాక్షసుడు వస్తే ఫైట్ చేసి పడేస్తాను’’ అంటాడు. అంటే మనసు మూలలలో వాడిలోని భయాన్ని జయించడానికి వాడు పెద్ద ప్రయత్నమే  చేస్తున్నాడు. అది ఈ విధంగా వాడి ఆటలో బయటపడుతోంది అని అర్థం. టీచర్ ఆట ఆడుతూ పిల్లల్ని కొట్టడం, అమ్మ ఆట ఆడుతూ అందర్నీ విసుక్కోవడం వంటివి ఆ పాత్రలోని నిజమైన వ్యక్తుల ప్రవర్తన పట్ల పిల్లల మనసులో వున్న వ్యతిరేకతనితెలియపరుస్తాయి. ‘ఫాంటసీ ప్లే’ అని పిలవబడే ఈ ఊహాజనిత ఆటలు కేవలం పిల్లల మానసిక బలహీనలతనే కాదు. వారిలో గాఢంగా దాగున్న ఆశలు, వారి బలాలని కూడా బయటపెడతాయి.

 



‘‘నేను పెద్దయ్యాక డ్రైవర్ని అవుతా’’ అని ఓ పిల్లాడు అన్నాడనుకోండి. ఆ తల్లిదండ్రులు వెంటనే ‘‘నోర్ముయ్’’, ‘‘పిచ్చివాగుడు’’ ఏ డాక్టరో అవుతానని అనక అని అరిచి పిల్లాడి నోరు మూసేస్తారు. కానీ, అది చాలా పెద్ద పొరపాటు అంటున్నారు పిల్లల మనస్తత్వవేత్తలు. ఎందుకంటే ‘‘డ్రైవర్’’ అవుతాననో, ఇంకేదో పిల్లాడు చెబుతుంటే, అది వాడి ఇష్టం అని గ్రహించాలి. నిజానికి ఆ ఇష్టాలు రోజుకొకటి చొప్పున మారుతుంటాయి కూడా. అయినా వాటిలో చిన్నప్పుడు వాడు తెలిసీ తెలియక వ్యక్తం చేసిన ఓ విషయంపై ఇష్టం వాడి మనసులో పెరిగి పెద్దదయ్యే నిజమైన సందర్భాలూ వుంటాయి. ఏ పైలెట్టో అవ్వొచ్చు డ్రైవర్ అవుతానన్న కుర్రాడు.

నిజానికి చిన్నతనంలో పిల్లలు ఆడుకునే ఆటలన్నీ వారి ఊహాజ్ఞానాన్ని వృద్ధిపరిచేవే. ఎక్కడో విన్న ఓ కథకు మరిన్ని మార్పులు, చేర్పులు చేసి పిల్లలు ఆటలాడటం మనకి తెలిసిందే. ‘‘ఫాంటసీ ప్లే’’ పిల్లల ఊహాపరిజ్ఞానాన్ని బయటపెడుతుంది. ఇది ఒకవిధంగా వారి మానసికాభివృద్ధికి సహాయపడే ఓ ప్రక్రియ. ఇది గ్రహించకుండా తమ కల్పనాశక్తిని వ్యక్తం చేస్తున్న పిల్లలు ఆడుకునే ఆటలను పెద్దవాళ్ళు నిరుత్సాహపరచకూడదు. వీలయితే పెద్దలూ అందులో చేరి  వాటిని ప్రోత్సహించాలి. లేదా చూసీ చూడనట్టు వదిలేయాలి. అంతేకాని పొంగుతున్న పాలమీద చన్నీరు పోసినట్టుగా వారి ఉత్సాహాన్ని నీరుగార్చకూడదు. అలా చేస్తే పిల్లలలోని కల్పనాశక్తి అడుగంటిపోయే ప్రమాదం వుంది. వారి ఆలోచనలు, భావాలు పదును తేలవు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.



సహజంగా పిల్లలు ఆడుకునే ‘‘ఫాంటసీ ప్లే’’ని ప్రయత్నపూర్వకంగా వారితో ఆడించే ప్రయత్నం కూడా మంచిదే అంటున్నారు నిపుణులు. అంటే. ‘‘నువ్వు నీకు నచ్చిన పాత్ర చేసి చూపించు’’ అని అడగటం, నువ్వే హీరోవి అయితే ఏం చేస్తావ్ అని అడిగి వారి మనసులోని మాటలు పైకి చెప్పించడం, వారు విన్న కథలలోని పాత్రలని అనుకరించమని ప్రోత్సహించడం వంటివి పిల్లల ఊహాశక్తికి పనిచెబుతాయి. అంతేకాదు, పిల్లల్లో భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంచుతాయి. ‘‘ఫాంటసీ ప్లే’’ పిల్లల ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు అంటున్నారు నిపుణులు. మరి ఆలోచిస్తారు కదూ!