‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ని ఇలా అధిగమించాలి

 



గుప్పెట పట్టుకున్న ఇసుక గుప్పెట మూసి తెరిచేలోగా ఎలా జారిపోతుందో తెలీనట్టే, కాలం క్షణాలు, నిమిషాలు, రోజులుగా, సంవత్సరాలుగా మారి కదిలిపోవడం కూడా ఎలా జరుగుతుందో తెలీదు. నిన్న మొన్న పసివాళ్ళుగా పారాడిన పాపాయి ఈరోజు కాలేజీ చదువుకు వచ్చిందంటే అబ్బ.. రోజులు ఎలా గడిచిపోయాయో కదా అనిపిస్తుంది. మా నాయనమ్మ అంటుండేది.. ‘‘ఇంతకాలం ఎలా గడిచిందో తెలీలేదు’’  అంటే, అంత తీరికలేని పనిలో వున్నట్టట. అదే, రోజు గడవటం లేదు అంటే అంత ఖాళీగా వున్నట్టట. అందుకేనేమో కదా పిల్లలు పుట్టి, పెరిగి, పెద్దయ్యే వరకు అమ్మకి సమయం తెలీదు. నెలలు, సంవత్సరాలు పరుగులు పెడతాయి. పిల్లలు చదువు ముగించుకుని ఉద్యోగాల కోసం దూరంగా వెళ్ళినా, ఆడపిల్లలు పెళ్ళి చేసుకుని అత్తవారింటికి వెళ్ళినా కాలం ముల్లు నెమ్మదిగా తిరగడం మొదలుపెడుతుంది.

ఎంతో ఓపిక, శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం అన్నీ మెండుగా వుండే సమయం బాధ్యతల మధ్య చేజారిపోయాక, ఆ బాధ్యతలన్నీ తీరిపోయి కాలం ముల్లు నత్తనడక నడిచేటప్పుడు ఏం చెయ్యాలో తోచదు. ఏం చెయ్యటానికి ఉత్సాహం రాదు. ఇప్పుడు మీ జీవితాన్ని మీకు నచ్చినట్టు మలచుకోండి. రోజుల్ని మీకు ఇష్టమైనట్టు గడపండి అని ఎవరైనా చెబితే ఒకోసారి కోపం కూడా వస్తుంది. ఎలా సాధ్యం? ‘ఇష్టం’ అనే మాట మరచిపోయి సంవత్సరాలు గడచిపోయాయి. పైగా ఇప్పుడు కొత్తగా ఏదో చేసి సాధించి, నిరూపించుకునేది ఏం వుంది కనక అనిపిస్తుంది. ఈమధ్యకాలంలో ఇంటర్ పూర్తిచేస్తూనే చదువుల పేరుతో పిల్లలు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో తెలీక, పిల్లల్ని వదిలి వుండటానికి అలవాటు పడలేక ఎందరో తల్లులు మానసిక ఇబ్బందులకు గురవుతున్నారట.

‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటారు పిల్లలు పెద్దయి దూరంగా వెళ్ళాక తల్లుల మానసిక స్థితిని. కొందరు ఆ పరిస్థితిలో తమని తాము ఎలా సంభాళించుకోవాలో ముందుగానే ఆలోచించి పెట్టుకుంటే, మరికొందరు అప్పటి ఆ సమయాన్ని ఎలా గడపాలో మార్గాలు అన్వేషిస్తారు. ఇలా ఆ ఖాళీ సమయాన్ని అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నించే వారికి ఇబ్బంది లేదు. కానీ, ఆ ఖాళీ సమయాన్ని చూసి బాధపడేవారు రోజురోజుకీ శారీరకంగా, మానసికంగా క్రుంగిపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, దేనిపైనా మనసు నిలపలేకపోవటం వంటి ఇబ్బందులకు గురవుతున్నట్టు చెబుతున్నారు నిపుణులు. ఆ స్థితి అలాగే కొనసాగితే వారి శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత దెబ్బ తింటుందని, దాని నుంచి బయటకి రావటానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

పిల్లలు దూరంగా వెళ్ళిన వెంటనే ఏం చేయాలో తోచదు. వారి ఆలోచనలతో గడపటం కంటే వీలయితే దగ్గరి స్నేహితులతో బయటకి వెళ్ళటం, చుట్టాలు, తెలిసిన వారి ఇళ్ళకి వెళ్ళి వారిని పలకరించడం వంటివి చేస్తుంటే అందరిమధ్య సమయం గడవటమే కాక, ఉల్లాసం కలుగుతుంది కూడా. ఆ తరువాత కావలసిన సామగ్రి కొనటానికి స్వయంగా ఒక్కరు బజారుకి వెళ్ళటం, ఇంటిని రీమోడలింగ్ చేయడానికి కొత్తకొత్త ఇంటీరియర్ చిట్కాలు ప్రయత్నించడం వంటివి కూడా సమయాన్ని తెలియనివ్వవు. అలాగే మొక్కల పెంపకం కూడా చక్కగా ఉపయోగపడుతుందిట మానసిక స్వాంతన చేకూరడానికి.

బాధ్యతలు ఎప్పుడు తీరతాయి. పిల్లలు ఎప్పుడు వాళ్ళ జీవితాలలోకి అడుగుపెడతారా అని  ఎదురుచూస్తుంది తల్లి. పిల్లలు చిన్న వయసులో వున్నప్పుడు, తీరా వారు పెద్దయి దూరంగా వెళ్ళినప్పుడు కొంగు పట్టుకు తిరిగే పాపాయి ఏదంటూ మనసు కష్టపెట్టుకుంటుంది. పరిగెట్టే కాలంలో మన పరుగు ఆగింది. ఇక ఇప్పుడు పిల్లల పరుగు మొదలైందని గుర్తిస్తే పిల్లలపై బెంగ కొంచెం తగ్గుతుంది. ఎప్పుడో వచ్చిపోయే అతిథుల్లా పిల్లలు దూరంగా వెళ్ళిపోయారని బాధపడేకంటే, వారితో చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తూ, ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించాలి. ఒక ఋతువు వెనక మరో ఋతువు వస్తూనే వుంటుంది. ఆ ఋతువుకు తగ్గట్టు మనల్ని మనం సన్నద్ధం చేసుకోవటమే జీవితం.. ఏమంటారు?

-రమ ఇరగవరపు