అమ్మలే ఉద్యోగ నిర్వహణలో సమర్థులు

 



పెళ్ళికి ముందు వెయ్యి కాళ్ళ జెర్రిలా ఎన్నిటినో చక్కబెట్టే అమ్మాయిలు, పెళ్ళవగానే ఇల్లు, ఇంట్లోవారి బాధ్యతలతో సతమతమవుతూ అంతగా కెరీర్ మీద దృష్టిపెట్టరని ఓ అపవాదు వుండేది ఒకప్పుడు. అయితే ఈమధ్యకాలంలో అమ్మాయిలు పెళ్ళితో సంబంధం లేకుండా కెరీర్‌లో పైమెట్టుకి అవలీలగా దూసుకుపోతున్నారు. ఇంటి బాధ్యతలని, ఉద్యోగ, వ్యాపారాలని చక్కగా బేలన్స్ చేయగలుగుతున్నారు. కానీ, పిల్లలు పుట్టాక  కొంతమంది అమ్మాయిలు వెనుకడుగు వేస్తున్న మాట మాత్రం నిజం. కెరీరా? పిల్లలా? అన్న ప్రశ్న వస్తే నిస్సందేహంగా పిల్లలకే మా ఓటు అంటూ పిల్లల ఆలనా పాలనకే పరిమితమైపోతున్నారు. పిల్లలు స్కూలుకు వెళ్ళడం మొదలయ్యాక తిరిగి వృత్తి వ్యాపారాలలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ వారినో సమస్య వెంటాడుతోంది.

నాలుగైదేళ్ళ విరామం తర్వాత తిరిగి కెరీర్ మొదలుపెట్టాలంటే కొంత బెరుకుగా వుంటుంది. అవకాశాలు వుంటాయో లేదో, ఉన్నా ఇంతకుముందంత ఎఫీషియన్సీతో పనిచేయగలనో లేదోనన్న అనుమానాలు వేధిస్తాయి. అలా తటపటాయించేవారి కోసమే ఈ వార్త. ఉద్యోగ ప్రకటనతో పాటు కింద అర్హతలు అన్నచోట తల్లులైనవారే అర్హులు అంటూ కనిపిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా! అలా ఆశ్చర్యపోవక్కర్లేదులెద్దు ఇంక. ఎందుకంటే, విదేశాలలో ఈమధ్య తల్లులైన ఆడవారిని పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తున్నారట. అదీ ఆషామాషీ పోస్టులు కాదు. ఓ కార్యాలయాన్ని నడిపించే స్థాయి ఉద్యోగాలకి ఆడవారిని, అందులోనూ తల్లులని ప్రిఫర్ చేస్తున్నారట. అంతేకాదు, కొన్ని సంస్థలైతే మీరు ఇంట్లోనుంచి కూడా పనిచేయచ్చు. ఉద్యోగం మానకండి అంటూ వారి నిబంధనలకి సవరణలుచేసిమరీ ఆడవారిని తమ సంస్థలలో పనిచేయడానికి ఒప్పిస్తున్నారట. ఇంచుమించు ఇదే ట్రెండ్ మన దేశంలోని బహుళజాతి సంస్థలలో కనిపిస్తోందట ఈమధ్య. ఎందుకిలా అంటూ మీకు సందేహం వస్తోందా?

మొన్నామధ్య నిర్వహించిన ఓ అధ్యయనంలో తల్లులుగా పిల్లల బాధ్యతని, కార్యాలయ నిర్వహణని పోలుస్తూ సాగిన ఆ అధ్యయనంలో రెండింటికీ ఇంచుమించు సమాన సామర్థ్యాలు కావాలని తేల్చారు. పిల్లలని, ఇంటిని, ఉద్యోగాన్ని ఇలా ఎన్నోరకాల బాధ్యతలని ఒక్కసారే సమర్థవంతంగా నిర్వహించడంలో స్త్రీలు సహజంగా సిద్ధహస్తులు. పైగా, చేపట్టిన ప్రతి బాధ్యతలో తన శక్తియుక్తులను వందశాతం ఉపయోగిస్తూ న్యాయం చేస్తారని చెబుతున్నారు  ఆ అధ్యయనకర్తలు. అంతేకాదు, మల్టీటాస్క్ అంటారు  చూశారా.. అంటే, ఒకే సమయంలో ఎన్నో విషయాలపై శ్రద్ధ పెడుతూ, చక్కగా నిర్వహించడం మహిళలకే స్వంతం అంటూ కితాబు కూడా ఇచ్చారు.  అంతేకాదు, ప్రతి పనిని తన స్వంత పనిలా బాధ్యతాయుతంగా నిర్వహిస్తారని కూడా వారి అధ్యయనంలో తేల్చిచెప్పారు.  ఇలా ఏరకంగా చూసినా మహిళలు రిస్క్ మేనేజ్‌మెంట్‌లో పురుషులకంటే ఓ అడుగు ముందే వుంటారని వారు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇదండీ ఆ అధ్యయనం మహిళలకి కట్టిన ‘ప్రశంసాపట్టం’.

మహిళల శక్తి సామర్థ్యాల గురించి సాగిన ఈ అధ్యయనంలో తేలిన మరో విశేషం.. ఒంటరి స్త్రీలకంటే పెళ్ళయిన తర్వాత, ఆ తర్వాత తల్లులుగా మారాక మహిళల శక్తిసామర్థ్యాలు, రిస్క్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు మరింత పదును తేలుతాయట. ఎన్నోరకాల ఒత్తిళ్ళ మధ్య  అన్ని పనులలో సమాన ప్రతిభాపాటవాల్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించడమే అందుకు కారణం అని కూడా చెబుతున్నారు వీరు. కాబట్టి సాధించాలనుకునే లక్ష్యాలకి ఇల్లు, పిల్లలు ఏమాత్రం అడ్డుకాదు. పైగా బలం కూడా.

-రమ ఇరగవరపు