పెసరపప్పుతో ఇలా చేస్తే చాలు.. మచ్చలేని ముఖం మీ సొంతమవుతుంది..

పెసలు తెలుగు రాష్ట్రాలలో తక్కువగా ఉపయోగిస్తుంటారు. మహా అయితే పెసరట్టు, లేదంటే పులగం కోసం మాత్రమే పెసలు ఉపయోగిస్తారు. పాయసం అయినా, పొంగలి అయినా, పప్పు అయినా, సలాడ్ అయినా పొట్టుతీసిన పెసరపప్పు వినియోగిస్తారు. పెసలు గొప్ప పొష్టికాహారం మాత్రమే కాదు, శరీరంలో వేడి తగ్గించి చలువ చేస్తుంది. అయితే కేవలం ఆరోగ్య పరంగానే కాదు. సొందర్యం కోసం కూడా పెసలు అధ్బుతంగా పనిచేస్తాయి. పెసలను ఆయుర్వేదంలో  పప్పుల రాణి అని పిలుస్తారు. కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు వంటి వాటితో పోలిస్తే పెసరపప్పు ఎంతో శ్రేష్టం. ఇక పెసరపప్పును ముఖాన్ని మెరిపించడానికి ఉపయోగించవచ్చు. ముఖం మీద మచ్చలు, మంగు, నలుపు వంటివన్నీ పోయి ముఖం అందంగా తయారుకావడానికి పెసరపప్పు ఉపయోగించి తయారుచేసుకునే 5ఫేస్ ప్యాక్ లు ఉన్నాయి.  అవెలా తయారుచేసుకోవాలో తెలుసుకుంటే..

సన్ టాన్ తొలగడానికి..

సన్ టాన్ ముఖం రంగును పాడు చేస్తుంది. ఇది తొలగించడానికి పెసరపప్పు, పెరుగు పేస్ ప్యాక్ వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసిన పెసరపప్పు పొడి నాలుగు స్పూన్లు, పెరుగు రెండు స్పూన్లు తీసుకోవాలి. రెండింటిని మిక్స్ చేసి ముఖానినకి పేస్ ఫ్యాక్ వేసుకోవాలి. 10నిమిషాల తరువాత దీన్ని కడిగేసుకోవాలి. సన్ టాన్ తొలగడమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది.

అవాంఛిత రోమాలు తొలగడానికి..

ముఖం మీద అవాంచిత రోమాలు ఉన్నట్టేతే ఈ పేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల వాటిని తొలగించుకోవచ్చు. నాలుగు స్పూన్ల పెసరపప్పును నానబెట్టాలి. బాగా నానిన తరువాత వీటిని గ్రైండ్ చేయాలి. ఇందులో రెండు స్పూన్ల నారింజ తొక్కల పొడి, రెండు స్పూన్ల గంధపు పొడి  కలపాలి. ఇది బాగా గట్టిగా ఉంటే ఇందులో కాసిన్ని పాలు జోడించాలి. మందంపాటి పేస్ట్ గా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖం మీద పట్టించి 10నిమిషాల తరువాత దీన్ని రబ్ చేస్తూ తొలగించాలి. ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖం మీద అవాంచిత రోమాలను తొలగిస్తుంది.

డ్రై స్కిన్ కోసం..

డ్రై స్కిన్ ఉన్నవారు ఏ పేస్ ప్యాక్ వాడితే ముఖం అందంగా మారుతుందనే విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. రెండు టేబుల్ స్పూన్ల నానబెట్టిన పెసరపప్పును గ్రైండ్ చేయాలి. దీంట్లో కొద్దిగా పచ్చిపాలు వేయాలి. ఒకవేళ పెసరపప్పు గ్రైండ్ చేసేటప్పుడే పాలు జోడించవచ్చు. దీన్ని మెత్తని పేస్ట్ లా చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15నిమిషాల తరువాత ముఖం కడుక్కోవాలి. ఈ ప్యాక్ డ్రై స్కిన్ ఉన్నవారికి చక్కని ఫలితాన్ని ఇస్తుంది.  ముఖ చర్మాన్ని తేమగా,మృదువుగా మారుస్తుంది.

చర్మాన్ని కాంతివంతం చేయడానికి..

 వాడిపోయిన చర్మాన్ని తిరిగి తాజాగా, కాంతివంతంగా మార్చడంలో ఈ ఫేస్ ప్యాక్ సమర్థవంతంగా పనిచేస్తుంది. నానబెట్టిన రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పును గ్రైండ్ చేయాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె, ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని పేస్ ప్యాక్ వేసుకోవాలి. 15నిమిషాల తరువాత ముఖం కడుక్కోవాలి. ఇది చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది. ముఖానికి కాంతిని ఇస్తుంది.

మొటిమలు తగ్గడానికి..

చాలామందికి మొటిమలు ప్రధాన సమస్య. ఈ సమస్య తొలగడానికి ఈ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. 4స్పూన్ల పెసరపప్పు పేస్ట్ లో రెండు స్పూన్ల నెయ్యి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత ముఖం కడిగేయాలి. దీన్ని రెగులర్ గా ఫాలో అవుతూ ఉంటే ముఖం మీద మొటిమలు, మచ్చలు, మంగు వంటివన్నీ తొలగిపోతాయి. ముఖం చాలా తాజాగా కనిపిస్తుంది.

(Note: ఇంట్లోనే మెత్తగా  గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు  పొడి అయినా వాడచ్చు. లేదా.. నానబెట్టిన పెసరపప్పు ను గ్రైండ్ చేసుకుని అయినా ఈ పేస్ ప్యాక్ లలో ఉపయోగించుకోవచ్చు.)

                                *నిశ్శబ్ద.