జిడ్డు చర్మాన్నివదిలించుకోవాలి అంటే.. ఈ టిప్స్ ట్రై చెయ్యండి..!
జిడ్డు చర్మం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. చర్మం ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ చర్మ తత్వాన్ని బట్టి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పొడి చర్మం ఉన్నవారు చర్మం తొందరగా పగుళ్లు రావడం, పొలుసులు రావడం వంటి సమస్యల వల్ల ఇబ్బంది పడితే.. జిడ్డు చర్మం ఉన్నవారు ముఖం జిడ్డుగా ఉంటూ.. మొటిమల కారణంగా ఇబ్బంది పడతారు. అయితే జిడ్డు చర్మం ఉన్నవారు ఈ సమస్యను తొలగించుకోవాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే..
ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్..
జిడ్డు చర్మం ఉన్నవారు ఉపయోగించే ఫేస్ వాష్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ఫేస్ వాష్ ఉపయోగించాలి. సల్పేట్ లేని ఫేస్ వాష్ వాడాలి. ఇది చర్మం నుండి నూనె తొలగించి ముఖం మెరిచేలా చేస్తుంది. మొటిమలు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
మాయిశ్చరైజర్..
జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడాలి. ఇది చర్మం మెరిసే చేయడానికి అలాగే జిడ్డు లేని చర్మానికి సహాయపడుతుంది. తేలికపాటి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే చర్మం పిహెచ్ ను సమతుల్యంగా ఉంచుతుంది.
టోనర్..
టోనర్ వాడటం వల్ల చర్మం లోని నూనెను నియంత్రించవచ్చు. చర్మం రంధ్రాలను శుభ్రంగా ఉంచడంలో కూడా టోనర్ సహాయపడుతుంది. జిడ్డు చర్మానికి అలోవెరా, గ్రీన్ టీ, సాలిసిలిక్ యాసిడ్ కలిగిన టోనర్లు చాలా బాగుంటాయి.
బ్లాటింగ్ పేపర్..
ఎక్కడికి వెళ్లినా హ్యాండ్ బ్యాగ్ లో బ్లాటింగ్ పేపర్ ఉంచుకోవాలి. ముఖం మీద జిడ్డు ఏర్పడినప్పుడు ఈ బ్లాటింగ్ పేపర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మం నుండి అదనపు నూనెను తొలగిస్తుంది. వీటి వల్ల చర్మానికి ఎలాంటి హాని, నష్టం కలగదు.
ఆహారం..
జిడ్డు చర్మం ఉన్నవారు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేయించిన ఆహారాలు, కారంగా ఉండే ఆహారాలు, ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు తీసుకోవడం మానాలి. ఆకుకూరలు, పండ్లు తినడం, పుష్కలంగా నీరు తాగడం చేయాలి. ప్రతిరోజూ డిటాక్స్ వాటర్ తీసుకోవాలి. ముఖ్యంగా శరీరాన్ని లోపల శుభ్రం చేసే ఆహారాలు, పానీయాలు తీసుకోవాలి.
ఫేస్ ప్యాక్..
జిడ్డు చర్మం తొలగించడానికి ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ లు ట్రై చేయాలి. ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ పేస్ ప్యాక్.. లేద వేప ఫేస్ ప్యాక్ వంటివి ఎంచుకోవచ్చు. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. జిడ్డును కూడా తొలగిస్తాయి.
*రూపశ్రీ.
