కళ్ల కింద నల్లని వలయాలు ఉన్నాయా? ఇలా ఈజీగా వదించుకోవచ్చు..!

 


కళ్ల కింద నల్లని వలయాలు చాలామందిని ఇబ్బందికి గురిచేస్తాయి.  ఈ నల్లని వలయాలు అమ్మాయిలను వయసు పైనబడినట్టు చూపెడతాయి. అంతేనా ముఖం ఎంత బాగున్నా, ఎంత అందంగా ఉన్నవారు అయినా నల్లని వలయాల కారణంగా వికారంగా కనిపిస్తుంటారు. ఈ నల్లని వలయాలు వదిలించుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే బ్యూటీ క్రీమ్ లు వాడుతుంటారు. కానీ వీటి వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఇంట్లోనే ఈజీగా నల్లని వలయాలు ఎలా వదిలించుకోవచ్చు.  అదెలాగంటే..

దోసకాయ ముక్కలు..

దోసకాయలు చల్లదనాన్ని ఇవ్వడంలోనూ,  చర్మాన్ని కాంతివంతం చేయడంలోనూ దోహదపడే లక్షణాలు కలిగి ఉంటాయి.

తాజా దోసకాయను మందపాటి ముక్కలుగా చేసి, వాటిని 30 నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. చల్లబడిన దోసకాయ  ముక్కలను  మూసిన కళ్లపై  ఉంచి 10-15 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. సరైన ఫలితాల కోసం దీన్ని రోజుకు రెండుసార్లు చేయాలి.


టీ బ్యాగ్స్..

గ్రీన్ లేదా బ్లాక్ టీ  బ్యాగ్‌లలో  ముఖ్యంగా కెఫీన్  వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో,  డార్క్ సర్కిల్‌లను తగ్గించడంలో సహాయపడతాయి.

రెండు టీ బ్యాగ్‌లను వేడి నీటిలో కొన్ని నిమిషాలు ఉంచాలి.  టీ బ్యాగ్‌లను తీసివేసి వాటిని 20 నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.  చల్లబడిన  టీ బ్యాగ్‌లను  మూసిన కళ్లపై 15-20 నిమిషాలు ఉంచాలి.  తర్వాత చల్లటి నీటితో  ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  దీన్ని రోజూ ఫాలో అవుతుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

బంగాళదుంప ..

బంగాళదుంపలలో సహజ బ్లీచింగ్ ఏజెంట్లు,  విటమిన్లు ఉంటాయి.  ఇవి నల్లటి వలయాలను తగ్గించడంలో  సహాయపడతాయి.

ఒక పచ్చి బంగాళాదుంపను తురుమి  రసం తీయాలి.  బంగాళాదుంప రసంలో రెండు కాటన్ బాల్స్‌ను నానబెట్టి వాటిని  మూసిన కళ్లపై ఉంచాలి.  ఈ కాటన్ బాల్స్ ను  10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో  ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా కాటన్ బాల్స్ ను ఉంచడమే కాకుండా వీటికి బదులుగా నేరుగా  బంగాళాదుంప ముక్కలను కళ్ళపైన ఉంచవచ్చు. మెరుగైన  ఫలితాల కోసం ప్రతిరోజూ ఈ రెమెడీని ప్రయత్నించాలి.


ఆల్మండ్ ఆయిల్, తేనె..

బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.  ఇది చర్మాన్ని పునరుజ్జీవింపజేయడంలో సహాయపడుతుంది. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

అర టీస్పూన్ తేనెలో కొన్ని చుక్కల బాదం నూనె కలపాలి.  పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని  కళ్ల చుట్టూ రాసి మృదువుగా మసాజ్ చేయాలి.  రాత్రంతా అలాగే ఉంచి ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.  మెరుగైన ఫలితాల కోసం దీన్ని రోజూ ప్రయత్నించాలి.


టమోటో, నిమ్మరసం..


టొమాటోల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది డార్క్ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.  నిమ్మరసం బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది.


ఒక టీస్పూన్ తాజా టమోటా రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి.  ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్‌తో డార్క్ సర్కిల్స్‌ పై అప్లై చేయాలి. ఇది కళ్లలో పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.  10 నిమిషాలు దీన్ని అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మెరుగైన ఫలితాల కోసం రోజుకు రెండుసార్లు దీన్ని ఫాలో కావాలి.

                                         *రూపశ్రీ.