అందంగా కనిపించడం కోసం అమ్మాయిలు చేసే ఈ పనులు కొంప ముంచుతాయి తెలుసా...
అందం అంటే అమ్మాయిలు, అమ్మాయిలంటే అందం.. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఒప్పుకుంటారు. ఆడవాళ్ల కోసం రాజ్యాలే కూలిపోయాయి. అంత పవర్ ఉంది అందానికి, ఆడవారికి. అలాంటిది అందం పెంచుతామంటూ సాగే వాణిజ్య ఉత్పత్తులు, వ్యాపారాలకు మంచి ఊపు రాకుండా ఉంటుందా? స్వతహాగా అందంగా తయారు కాలేని వారికి ఇదిగో మేమున్నాం అంటూ బ్లూటీ పార్లర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడేమో వీధికి ఒక బ్యూటీ పార్లర్ వెలిసింది. చాలా మంది అందంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్ కు వెళితే.. కొందరేమో డబ్బు దండగ అని ఇంట్లోనే బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే బ్యూటీ ట్రీట్మెంట్ లో భాగంగా ఫేషియల్ చేయడం, ముఖానికి ఆవిరి పట్టడం సహజంగా చేసేదే. కానీ ఇలా ఫేషియల్ చేయడం, ముఖానికి ఆవిరి పట్టడం వంటివి చేయడం చాలా పెద్ద మిస్టేక్ అంటున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. దీని గురించి తెలుసుకుంటే..
చర్మ సంబంధిత సమస్యలు వంటి చిన్న చిన్న విషయాల గురించే అమ్మాయిలు చాలా ఆందోళన చెందుతారు. వీటిని సరిచేయడానికి, కొన్నిసార్లు బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కొన్నిసార్లు ఆవిరి తీసుకుంటారు. కానీ ఈ రెండూ పరిమితిని మించితే అవి చర్మానికి హాని కలిగిస్తాయి. ఆవిరి చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రంధ్రాలను శుభ్రం చేయడానికి సులభమైన మార్గం. కానీ ఏదైనా అతిగా తీసుకోవడం హానికరం. ముఖానికి ఎక్కువ ఆవిరి పట్టుకుంటు ఉంటే దాన్ని వెంటనే ఆపడం మంచిది. ఎందుకంటే ఇది చర్మ రంధ్రాలను పెద్దగా అయ్యేలా చేస్తుంది. చర్మం లో ఉత్పత్తి అయ్యే నూనెలను తగ్గిస్తుంది. ఇది మొటిమల సమస్యలకు లేదా చర్మం పగుళ్లకు దారితీస్తుంది. కాబట్టి ఫేస్ స్టీమ్ చేయడానికి సమయం, వ్యవధిని నిర్ణయించుకోవాలి.
రసాయన రహిత ఫేస్ ప్యాక్..
ముఖం సహజంగా అందంగా కనిపించడానికి రసాయనాలు లేని ఫేస్ ప్యాక్ లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అలాంటి పేస్ ప్యాక్ ఏ ఇది. స్వయానా వైద్యులు సూచించిన ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి చాలా మంచి ఫలితాలు అందిస్తుంది.
కావలసిన పదార్థాలు..
పసుపు - 1/3 టీస్పూన్
నిమ్మరసం - 1/2 టీస్పూన్
గంధం - 1 టీస్పూన్
అలోవెరా జెల్ - 1 టీస్పూన్
తేనె - 1 టీస్పూన్
(అవసరాన్ని బట్టి పై పదార్థాలు ఎక్కువ నిష్పత్తిలో కూడా తీసుకోవచ్చు)
తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో గంధం, పసుపు, నిమ్మకాయ రసం, కలబంద జెల్ వేసి బాగా కలపాలి. చివరగా తేనె వేసి అన్నింటినీ కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి.
తయారుచేసిన ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత కడిగేయాలి.
మొదటిసారి వాడినప్పుడే చర్మం శుభ్రంగా, రంధ్రాలు చిన్నగా కనిపించడం గమనించవచ్చు.
ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించి చర్మాన్ని సహజంగా శుభ్రం చేసుకుంటూ ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు.
ప్రయోజనాలు..
ఈ ఫేస్ ప్యాక్‌లో గంధపు చెక్కను ఉపయోగించారు . దీని శీతలీకరణ ప్రభావం కారణంగా ముఖంపై వేడి సంబంధిత మొటిమలు పెరగకుండా నిరోధిస్తుంది. అలాగే తేనె చర్మాన్ని తేమగా మార్చడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయ చర్మాన్ని స్పష్టంగా కనిపించేలా చేయడం ద్వారా మచ్చలను తేలికపరచడంలో సహాయపడుతుంది.
పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీ ఏజింగ్, యాంటీ ఫంగల్ వంటి అనేక లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖంపై చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు పెరగకుండా నివారిస్తాయి. అందువల్ల చాలా మంది పెరుగు, పసుపు, శనగపిండి ఫేస్ ప్యాక్‌లను కూడా ఉపయోగిస్తారు.
*రూపశ్రీ.
