చర్మం పొడిబారుతోందా...ఈ టిప్స్ ఫాలో అయితే సరి..!
చర్మం పొడిబారే సమస్య చాలా మందిని వేధిస్తుంది. ఇది మొదట్లో ఒక చిన్న ఇబ్బందిగా మొదలై దీన్ని నిర్లక్ష్యం చేసే కొద్ది పెద్ద సమస్యగా మారుతుంది. చర్మం పొడిబారడం వల్ల సున్నితంగా తయారవుతుంది. ఇది చర్మాన్ని వాతావరణ పరిస్థితులకు విరుద్దంగా మారుస్తుంది. పొడి చర్మం ఉన్నవారు ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటించడం వల్ల చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఇందులో నూనెలు వాడటం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మనం సాధారణం అనుకున్న నూనెలు చర్మాన్ని ఎలా కాపాడతాయో తెలుసుకుంటే..
కొబ్బరినూనె..
కొబ్బరినూనె గొప్ప మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మం పొడిబారడాన్ని తగ్గించి చర్మం మృదువుగా ఉండటంలో సహాయపడుతుంది. స్నానానికి గంట ముందు కొబ్బరినూనెను ఒళ్లంతా పట్టించుకోవాలి. తరువాత స్నానం చేయాలి. కెమికల్స్ ఎక్కువగా ఉన్న సోప్ వాడకూడదు. పొడి చర్మానికి గ్లిజరిన్ సోపులు మంచివి.
తేనె..
తేనెను ఇష్టమైన పేస్ మాస్క్ లో ఉపయోగించవచ్చు. లేదా తేనెను ముఖానికి రాసుకోవచ్చు. ఇది చర్మానికి లోతుగా తేమను అందిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.
కలబంద..
సౌందర్య ఉత్పత్తులలో కలబంద జెల్ బాగా పేరు పొందింది. కలబంద జెల్ ను చర్మం పై అప్లై చేస్తుంటే చర్మం పొడిబారే సమస్య తగ్గుతుంది. అలాగే తాజా కలబంద జెల్ ను సేకరించి పేస్ ప్యాక్ లా వేసుకుని కడిగేస్తున్నా మంచి ఫలితం ఉంటుంది.
ఆలివ్ నూనె..
ఆలివ్ నూనె ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా చాలా మంచిది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఆలివ్ నూనెను ఇష్టమైన లోషన్ లో కలిపి ఉపయోగించవచ్చు. మంచి ఫలితం ఉంటుంది.
పెరుగు..
పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేయడానకిి సహాయపడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ గా కూడాచేస్తుంది. చర్మం పొడిబారుతుంటే పెరుగును ముఖానికి పట్టించి 10 నిమిషాల తరువాత సాధారణ నీటితో కడిగేయవచ్చు.
దోసకాయ..
దోసకాయ చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. చర్మం మీద మొటిమలు, దద్దుర్లు వంటివి రాకుండా చేస్తుంది. చర్మం రంధ్రాలను రిపేర్ చేస్తుంది. దోసకాయ రసాన్ని చర్మానికి అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఓట్ మీల్..
ఓట్ మీల్ ను నీటిలో కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. దీన్ని చర్మం పైన అప్లై చేయాలి. ఫస్ట్ ముఖానికి స్క్రైబ్ చేసి ఆ తరువాత దీన్ని ప్యాక్ లాగా వదిలేయాలి. ఇది చర్మాన్ని చాలా మృదువుగా చేస్తుంది. చర్మం పొడిబారడాన్ని నివారిస్తుంది.
నీరు..
చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ముఖ్యమైన అంశాలలో నీరు ప్రధానమైనది. రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగుతూ ఉండాలి. ఇది శరీరంలో టాక్సిన్లను బయటకు పంపడమే కాకుండా చర్మం ఆరోగ్యంగా తాజాగా ఉండటంలో సహాయపడుతుంది.
*రూపశ్రీ.
