నీడలా మా అమ్మే నా వెంట
అమ్మతో నా అనుబంధం గురించి రాయాలంటే ఒక ఉత్గ్రంధమే అవుతుంది. చిన్న వ్యాసంలో చెప్పాలంటే కష్టమే. నేను పుట్టినప్పుడు మొదటిసారి తన చేతుల్లోకి తీసుకొని ఎంత ప్రేమగా నా తల నిమిరి ఆతన గుండెలకు హత్తుకుందో నాకు యాభై ఏళ్ళు వచ్చినా అంతే ప్రేమగా తల నిమురుతుంది. నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. అందరు అమ్మలు అదే చేస్తారు. ఇందులో గొప్పెముంది అనుకోవచ్చు. గొప్పే మరి. ఒక చిన్నపాటి జమీందారీ కలిగిన ఇంటికి పెద్ద కూతురు, ఇంకో చిన్న జమీందారీ ఇంటి చిన్న కోడలు. నిప్పులు కడిగే వంశాలు.
అనివార్య కారణాల వల్ల మానాన్న సంపాదన సరిగా లేక బాధ్యత లేకుండా తిరుగుతుంటే కష్టపడి చదివి ఉద్యోగం హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగిని అయింది. ఇంటి ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే ఇంటి పరువు పోతుందన్న అత్తింటి వాళ్ళను పుట్టింటి వాళ్ళను ఎదిరించిది. ఇదంతా మా చెల్లిని నన్ను తాను అనుకున్నట్టు పెంచదానికి చదివించడానికి. నాకు ఝాన్సీ అనిపేరు పెట్టినప్పటి నుండే ధైర్యం నూరి పోయడం మొదలు పెట్టింది. "సమాజం తొక్కుతె మొక్కుతుంది, మొక్కితే తొక్కుతుంది" ఇది నాకు నేర్పిన బ్రహ్మ సూత్రం. ప్రతి చిన్న విషయం లోను ఎంతో శ్రధ్ధ తీసుకునేది. ఏమాత్రం సౌకర్యాలు లేని టైమ్ లోనే దూరాలు ప్రయాణం చేసి ఆఫీసుకు వెళ్ళి వచ్చేది. సాయంత్రం వచ్చి నన్నుచెల్లిని చదివించేది. ఒంట్లో బాగాలేక పోయినా పరీక్ష లో మార్కులు బాగా రాక బాధపడుతున్నా ధైర్యం చెప్పి వెన్నంటే ఉండేది. టెన్త్ క్లాస్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు, ఉద్యోగాలాకోసం కంపిటేటివ్ పరీక్షలు ఒకటేమిటి ఏ సందర్భం తలచుకున్నావెనుక కొండత అండగా మా అమ్మే ఉన్నట్టు కనబడుతుంది. ఇవన్ని ఒక ఎత్తు ఐతే నాకు . పుస్తకాల పైన ఇష్టాన్ని పెంచింది.
ప్రపంచంలోని వ్యక్తులను అర్థం చేసుకోవడానికి ఇంతకంటే సులువైన మంచి సాధనం లేదని చెప్పింది. ఇప్పటికీ తాను చదివిన మంచి పుస్తకంలో విషయాలు నాతో పంచుకుంటుంది. ఉన్న ఉళ్లోనే సంబందం చేయాలని కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగింది. అనుకున్నట్టుగానే హైద్రాబాద్ లోనే ఉండే అబ్బాయి తో పెళ్లి చేసింది. ఉద్యోగం పిల్లలు రెండు భాద్యతలతో నేను సతమవుతూఉంటే పిల్లలను తనతో ఆఫీస్ కి తీసుకేళ్లేది. తన పని చేసుకుంటూనే వాళ్ళను కూడా చూసుకునేది. ఇప్పటికీ ప్రతి ఏడాది దీపావళికి మా నలుగురికీ ఉన్నంతలో బట్టలు పెడుతుంది. ఎన్దుకమ్మా నీకు శ్రమ అంటే, నాన్న వెంట లెక్‌పోవడం వల్ల నాకు లోటు జరిగిందని నువ్వు కానీ అల్లుడు కానీఅనుకోకూడదని అంటుంది.
నేను ఈత గింజ ఇవ్వబోతే తాను తాటి పండు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. మా అమ్మ అనే మహా నదిలోనుంచి ప్రవహిస్తూ ఉన్న పిల్ల కాలువని నేను. ఆనాడు మా అమ్మ కనుక అంత సాహసం చేసి సమాజానికి ఎదురు నిలిచి మమ్మల్ని చదివించక పోయి ఉంటే నాకు ఇంత రంగుల మయమైన రసవంతమైన జీవితం దొరికెదే కాదు. యాభై ఏళ్ల జీవితం లో వెనక్కి తిరిగి చూసుకుంటే నీడలా మా అమ్మే నా వెంట ఉంది.
--ఝాన్సీ మంతెన
