అమ్మ లేని నేనులేనే లేను

అవును..పెద్దవుతున్నకొద్దీ....అమ్మలేదని తట్టుకోలేక తిట్టుకుంటానేమో కాని కన్నతల్లి తలపులు తట్టిలేపుతూండడం అనుక్షణం నా దినచర్యలోపెనవేసుకుపోతున్నతరుణం..ఇంతలోనే ఈశీర్షికతోమది తలుపులు తెరచి తలపులు తెలుపమంటూ పిలుపు!!నా జీవనరాగంలో అమ్మ ముద్ర ,మార్కు మరీప్రస్ఫుటం..ఎంతో ప్రధానం..ప్ర ప్రథ మ స్థానం..మా అమ్మకి ఏడుగురు సంతానం..నలుగురు ఆడపిల్లలు ముగ్గురు మగ పిల్లలు..మధ్యనంబరునాది.పెద్దకూతురని అక్క స్పెషలు..పెద్దాడంటూ అన్నయ్య,చిన్నదని చెల్లి..చిట్టచివరాడని తమ్ముడు...మరి మధ్యవారి మాటేమిటి?? అక్కడికే వస్తున్నా!!మానాన్నగారికి బ్యాంకేలోకం..దైవికంగా సంప్రాప్తించిన జ్యోతిష్యం ఆయన పూర్వజన్మ సుకృతం..నేను పుడుతూనే ఆయనన్నారట.."ఇదికళలలో రాణిస్తుందీ "అని..గ్రహస్థితులబట్టి అనుకుంట...అమ్మ అందటా..."ఏడిసింది..బల్లిలా పుట్టింది..బతికి బట్టకట్టనివ్వండీ "అని. ..నాకు ఊహతెలిసి ఎనిమిదొచ్చేసరికి మేమంతా హైదరాబాదుకు బదిలీ మీదొచ్చాం..అంతే..ఏగ్రహబలమో..నేనీ ఊరుకదిలితే ఒట్టూ..బాల్యంలో బాలానందసంఘంలో కళలపట్ల నానగారికున్న మక్కువతో నన్ను చేర్చారు అంతే..మిగతా అంతా అమ్మే...సంగీతం..నాట్యం..నాటకం.. వారునేర్పితే ...క్రమశిక్షణ,సమయపాలన,పెద్దలపట్ల గౌరవం..మర్యాద,కంటిచూపుతోనే నేర్పేది అమ్మ..నేర్చుకున్నకళలకు సంపూర్ణంగా న్యాయంచేసినది అమ్మవల్లే..ఆకతాయిగా ఉందామనిపించినా మా ఆటలు సాగనివ్వలేదు అమ్మ.కళలుకాస్తా.. వయసుతో పాటు అటకెక్కినా...అమ్మఅందించిన అమూల్యాలు...నాతోనే..నావెంటే ఉంటూ..అనుక్షణం అమ్మని తలపిస్తాయి..ముఖ్యంగా ఒకటి అరా కన్నటువంటి మా అందరికి...ఇంతమందినికని..అంతబాగా ఎలా పెంచిందన్నది అంతుచిక్కదు..నటనలో ప్రతిభ కనబరుస్తుందంటూ పెద్దల ప్రశంసల మేరకనుకుంట...ఆకాశవాణి..దూరదర్శన్ లలో నన్ను పదిహేడేళ్ళకే అడల్ట్ ఆర్టిస్టుగా ఆడిషన్ పరీక్షకి రమ్మన్నారు..ససేమిరా అంటూ మొండికేశాను.."చీరకట్టుకెళ్ళాలట..నాకురాదు..అయినా నాకు డిగ్రీ మొదటి ఏడాదిపరీక్ష...తలనొప్పి..అహ..ఊహూఁ..నావల్లకాదు" అంటూ అమ్మకి నేపెట్టిన పేచీ ఇప్పటికి ఎన్ని ఇంటర్వ్యూల్లో చెప్పానో...

అమ్మ ఈఊరికి రాకమునుపు నాన్నగారి ఉద్యోగ బదిలీలంటూ ఆంధ్రా అంతా చుట్టేశారుట..నాకు గుర్తులేదు..అమ్మకి వాళ్ళమ్మ పురిట్లోనే పోయారట..అమ్మమ్మతాతలు పదేళ్ళకే ఐదోక్లాసు చదువు అర్జంటుగా ఆపించి,పెళ్ళిచేసేశారట పదిహేడేళ్ళ మానానగారికిచ్చి...ఇదే మా అమ్మనేపథ్యం..అమ్మకి అన్ని ఊళ్ళలోనూ...ఇరుగుపొరుగు వారే పురుళ్ళూ గట్రాలకి సాయమట...పెద్దలు అప్పటికే టపా కట్టేసినందుకేమో...తెలీదు!బొత్తిగా ఊరుకూడా తెలియని అమ్మ ఆడిషన్ రోజు ఎక్కడెగ్గొట్టి ఇంటికి చక్కా వచ్చేస్తానోనని..ఏకంగా కోఠీ..ఉమెన్స్ కాలేజీకి రిక్షా కట్టించుకుని వచ్చేసి..మెయిన్ గేటుదగ్గర కాపలా కూర్చుని ఆలిండియా రేడియోకి తీసుకెళ్ళి..ఆడిషన్టెస్టుకి వెనకాలే ఉండిచెఱకు రసం ఇప్పించి తీపిగుర్తుగా ఇప్పటికీ నిలిచిపోయింది..ఆ పరీక్షే ఇప్పటికీ నాకు చిరుసంపాదనతో పాటు పెను గుర్తింపును ఆపాదిస్తూ వస్తోంది..స్వతహాగా పరమపిరికి నైన నేను అందివచ్చిన ప్రతి అవకాశానికి మొరా యించేదాన్ని...చదువుకలో వెనకబడడం...టైముసరిపోకపోవడంనాకు నచ్చేదికాదుమరి!  అన్నీ అవసరమనేది అమ్మ..నిజమే...అదితెలిసాకే అమ్మవిలువ అవగతమయ్యేది...రేపు నా  ఏకైక పుత్ర రత్నానికైనా!!

నాగురించి అమ్మచెప్తూండే మరో మాట..పసితనంలో కారణంచెప్పకుండా గంటల తరబడి ఏడుపు...అలకలూ నట..ఎందుకోమరి..తెలిస్తే మీకైనా చెప్పడానికి సిద్ధమేనేను!! ఆవసూ ఏనా ఈ వసువులు అంటూ చాలా మెచ్చుకునేది..వంటపని..ఇంటిపనిలో నా ఒబ్బిడి,,పద్ధతి..ఖర్చుల్లో పొదుపు..అటు ఉద్యోగంలో కమిట్మెంటు..అన్నీ..మనసారా చూసిందేమో..తన పోలికలు పిల్లలందరికీ అబ్బేయి అని తెగ మురిసిపోయేది..దుబారా అంటేఅమ్మకి నచ్చదు..ఆమాట ఆవిడనోటవిన్నదే..మళ్ళా ఎవరినోటావినలేదు..కొన్నిమాటలు అచ్చంగా అమ్మసొంతం..నిజమే...మాపిల్లలని చూస్తే అమ్మ తరం వారంతా ధన్యులనిపిస్తుందిసుమండీ..

ఇరవైమూడుకే పెళ్ళైనా ,అమ్మున్న ఊరే కనుకేమో..బెంగ ..చొంగ లాంటివిలేవు.ఎటొచ్చీ ఉద్యోగం మూలాన అడపా తడపానే కలిసే వాళ్ళం.ఫోనుల్లో అప్డేట్లు ఒకస్నేహితురాలికి మల్లే వినేది..ఏనాడు పిల్లలసంసారాల్లో తలదూర్చలేదు.తరువాతగాని తెలియలేదు అది సైద్ధాంతికపరమైన నిర్ణయమనీ,,చాలారైటు అనీ..!! ఇంటిల్లిపాది పెళ్ళిళ్ళూపదిహేనేళ్ళ నిడివిలో అయ్యాయి..చివరితమ్ముడి కళ్యాణం ఒక్కదానికే నాన్నగారులేరు.యాభైఏళ్ళతోడు...అమ్మకి మరీకష్టకాలమే..అయినా ఒక్కరోజు ఎవ్వరినీ తనబాధ నుతెలిపి ఇబ్బంది పెట్టలేదు..అందరిదగ్గరా అదే సర్దుబాటుగుణం...ఎంతమొక్కినాతక్కువే..!!రికార్డింగులకెడితే ఇప్పటికీ...నన్ను ....అమ్మనివెంటబెట్టుకొచ్చేదాన్నని ఆటపట్టించే వారెందరో!!

ఇలా ఉంటుండగా...ఓసారి ఆంధ్రజ్యోతి నవ్యవారు..౨౦౦౬లోననుకుంట...నాపాతికేళ్ళ గళానుభవాన్ని పేపరుకెక్కించడానికి...ఇంటర్వ్యూకని ఇంటికొచ్చారు..ఫోటో గ్రాఫర్ తో సహా..ఇప్పటికి  కంప్లీటుగా భిన్నంగా...!వాట్సప్పులు..ఫేసుబుక్కులు లేవుగాఅపుడూ!!బోలెడుకబుర్లు రాబట్టి "మాటలకోకిల "పేరుతో ప్రచురించారు పేపరులో..ఇప్పటిలాగా క్షణాల్లోవార్త..  ఖండాలు దాటే వీలులేనికాలం.కనుక ఏకొద్దిమందికో అదీ చెప్పుకుంటేనే తెలిసేది.."అమ్మ"కనుక ఆపేపరును లామినేటుచేయించి తలగడకిందే పెట్టుకుని ఇంటికి వచ్చిన ,తనకు నచ్చిన వారికి చూపుకుని తన తనయను కొనియాడుకుని  పరవశించేదని వినికిడి..ఇంతలో ఓరోజు అమ్మ అదోలా మాట్లాడుతూ.." అవున్లేమ్మా...నీకు మొదట్నించీ వెనకే ఉంటూ ,,నువు ఆడినా పాడినా మురిసిపోతూ ఉన్నందుకు..భలేగా గుర్తుంచుకున్నావులేవే...ఆఖరికి నువు దూరమెళ్ళలేనని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్.ఎస్సి .మానేస్తే అక్కడే గదితీసుకుని నానగారిని వదిలైనాసరే  నీతోనే ఉండటానిక్కూడా సిద్ధపడ్డానుకదమ్మా అప్పట్లో...అందుకనేనేమో..మా బాగా బుద్ధిచెప్పావు అంటూ వగచింది..మొట్టమొదటిసారి అమ్మనాతో ఇలాంటి దెప్పిపొడుపుడైలాగువేయడం!!మైండుబ్లాకైంది..కూపీ లాగాను..కట్చేస్తే,,ఇంటికొచ్చిన ఆపేపరుపెద్దలకి చాలనేవరకు కబుర్లునేనేచెప్పినా,,వారు కాస్తతికమకపడి కొన్నివిషయాలను మకతిక చేసి రాస్తారని నాకు చాలా ఏళ్ళక్రితమేతెలిసినా,,చేసిపొడిచేదేంటిలే అని లైట్ తీసుకున్నాను..ఇపుడు మరోసారి పునరావృతమై...అమ్మకెక్కడోముల్లులా గుచ్చుకుని.. ఎక్కుపెట్టిన బాణంలానన్నుదూసుకునిపోయింది..తుంటినికొడితే పళ్ళు రాలడం అంటే ఇదేనేమో,,,నాట్ స్యూర్!!రాసుకెళ్ళిన పెద్దమనిషి..అమ్మమాట,మాటవరసకైనా రాయకుండా..మానాన్నగారి పేరు మాత్రమే రెండుసార్లు ఉటంకించి..ఆయన మంచి కళాభిమాని కావడం వలననే..నేను ఇలాతయారయ్యానని,అంతా తండ్రిగారిచలవేనని నేనే నొక్కివక్కాణిస్తేనే  ఆయన రాసినట్టు అమ్మ అర్థం చేసుకున్నట్టు నాకర్థమైంది..

ఎలా చెప్పినా అమ్మ వినేలాకూడా కనిపించకపోవడంతో...నేనే కాపుకాచి..అవకాశంఅందివస్తే అమ్మకిన్యాయం అర్జంటుగా చేసెయ్యాలి అని మనసులో దృఢంగా తలపోశాను,అడిగి రాయించుకోడం అస్సలు నడవదునాకు..అలాఉండుంటే ఆకాశమే హద్దుగా పెద్దయ్యేదాన్ని.అమ్మేమో పెద్దదైపోతోంది...ఎలాగబ్బా అనుకుంటుండగా...౨౦౦౯లో హెచ్.ఎమ్ టివి ప్రారంభంలో..."ఆకాశంలో సగం "అంటూఒక ప్రోగ్రామ్ లో నన్ను అరగంట నిడివికి ఇంటికొచ్చి షూటింగు చేసుకుంటామంటూనే ...ముందుగా అమ్మకి కబురుచేసి తీసుకొచ్చి..నాపక్కనే కూర్చో పెట్టించి..చక్కగా టివిలో కనపడేలా ఏర్పాటు చేసి నా ఉన్నతికి అమ్మచేసిన కృషిని తెలిపి ఖుష్చేశాను..అప్పుడప్పుడే టెస్ట్ సిగ్నల్స్ ప్రారంభించిన ఆటివి వారు రోజుకు కనీసం పదిసార్లు చెప్పున నా ప్రోగ్రామ్ టెలెకాస్ట్ చేయడమూ..అది విజయనగరంలో నున్న మా అమ్మ ఆడబడచులు,తోటికో డళ్ళు..వాళ్ళపిల్లలు మాకంటే ముందుగాచూసి...అందులో అమ్మనే ముందుగుర్తుపట్టి ఫోన్లు చేసిచెబితే..అమ్మచెప్పగా నేనూ చివరికి చూసి తరించాను మామూలుగా కాదు!! 

ఆతరువాత ఎంతోకాలం లేదు అమ్మ...!! అనారోగ్యకారణాలవలన జాబ్ మానేస్తూ..చివరిరోజు  మీటింగులో..మా అమ్మకి నా అవసరం ప్రస్తుతం చాలా ఉందని చెప్పి,,కాలక్షేపానికిలోటుండదని శలవుతీసుకున్న నేను...ఒక్కనెలరోజులు అమ్మని ఆనందింపచేశాను నా కంపెనీతో..అంతే...తిరిగిరానిలోకాలకు తరలిపోయింది సీతమ్మ...!తోచక...తరచితరచి కుమిలింది వసంతమ్మ.!

అమ్మ కలకాలం ఉండాలనుకోవడం ఎంత పేరాశో.. ఉంటుందన్నిది ఒక కల.. పెద్ద కల.

--అయ్యగారి వసంతలక్ష్మి