నెయ్యిలో ఔషధగుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.పాలు, పాల పదార్థాలు కొందరికి నచ్చదు అలాంటి వారు లాక్టోజ్ శాతం తక్కువగా ఉండే నెయ్యిని వాడొచ్చు. ఇందులో లభించే పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. కాలేయం, పేగులు, గొంతులోని మలినాలను బయటకు పంపుతుంది. నెయ్యి తీసుకొంటే కొలెస్ట్రాల్ సమస్య వస్తుందని అందరి నమ్మకం.
అయితే ఇది అందర్నీ బాధిస్తుందని మాత్రం చెప్పలేం. ముందు నుంచి కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు నెయ్యి వాడకం తగ్గించాలి. ఒక్కోసారి శరీరంలో కొవ్వు శాతం పెరగడానికి శారీరక మార్పులు, ఇతర మార్పులు, ఇతర ఆహార పదార్థాలుకూడా కారణమయ్యే అవకాశం ఉంది. నెయ్యి బలహీనంగా ఉన్న వారికి చాలా మేలు చేస్తుంది. వాతాన్ని తగ్గిస్తుంది. చర్మానికి కాంతిని ఇస్తుంది. మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. నిపుణులు దీన్ని మానసిక సమస్యలకు ఔషధంగా కూడా ఇస్తారు.
ఇంకా తీసుకొన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆకలి మందగించినప్పుడు మిరియాల పొడిలో నెయ్యి కలిపి మొదటి ముద్దలో తీసుకొంటే చక్కటి పరిష్కారం లభిస్తుంది.
ఎదిగే పిల్లలకు ఎముక పుష్టిగా ఉండేందుకు గ్లాసు పాలలో చెంచా నెయ్యి వేసి తాగిస్తే మంచిది. అరటి పండు గుజ్జులో, కాసిని పాలు, కొద్దిగా నెయ్యి కలిపి పిల్లలకు తినిపిస్తే అవయవాలు దృఢంగా అవుతాయి. బరువు పెరుగుతారు.
పొడి చర్మతత్వం, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలతో బాధపడేవారు పావు చెంచా వేప గింజల పొడిలో, పావుచెంచా నెయ్యి జోడించి మొదటి ముద్దతో కలిపి తింటే సత్వర ఉపశమనం దొరుకుతుంది.
కాలిన బొబ్బల మీద నెయ్యిని పైపూతగా రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగా మానిపోతాయి. ముక్కు నుంచి రక్తస్రావమవుతుంటే రంధ్రాల్లో మూడు నాలుగు చుక్కలు నెయ్యి వేస్తే ఫలితం కనిపిస్తుంది.
పసి పిల్లలకు నెయ్యి లేదా వెన్నను ఒంటికి రాసి కాసేపయ్యాక స్నానం చేయిస్తే చర్మం మృదువుగా మారుతుంది. క్షయవ్యాధి, మలబద్ధకం, విరేచనాలు, జ్వరంతో బాధపడేవారు, వృద్ధులు నెయ్యికి దూరంగా ఉండాలి.